సమీక్ష – టైగర్ నాగేశ్వరరావు

2/5

3 hour 2 min   |   Action Drama   |   20-10-2023


Cast - Raviteja, Nupur Sanon, Gayathri Bharadwaj, Renu Desai, Nasser, Jishu Sen Gupta, Anupam Kher and others

Director - Vamsee

Producer - Abhishek Agarwal

Banner - Abhishek Agarwal Arts

Music - G. V. Prakash Kumar

మాస్ మహారాజా బయోపిక్ చేయడమంటేనే పెద్ద విశేషం. అందులోనూ ఇప్పటి తరానికి పరిచయం లేని ఒక గజదొంగగా నటించేందుకు సిద్ధపడటం అభిమానుల్లోనే కాదు సగటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి రేపింది. పైగా భారీ బడ్జెట్ తో ప్యాన్ ఇండియా రేంజ్ లో నిర్మించడంతో సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. దసరా బరిలో హైప్ పరంగా కొంత వెనుకబడినట్టు అనిపించినా సరైన కంటెంట్ ఇస్తే రవితేజ బ్లాక్ బస్టర్ ఇస్తాడనే నమ్మకం థియేటర్లకొచ్చిన జనంలో కనిపించింది. మరి పేరుకి తగ్గట్టు టైగర్ గాండ్రించాడా లేదా చూద్దాం.

కథ

1980 నేపథ్యం. స్టువర్ట్ పురంలో టైగర్ గా పేరుపొందిన గజదొంగ నాగేశ్వరరావు(రవితేజ)కు చోరీలకు ముందు పోలీసులకు ఫోన్ చేసి మరీ సవాల్ విసరడం అలవాటు. ఆ ఊరి పెద్దగా వ్యవహరించే ఎలమంద(హరీష్ పేరడీ)వల్ల ప్రజలు వెనుకబాటుతనంలో బ్రతుకుతూ ఉంటారు. కొన్ని అనూహ్య సంఘటనల తర్వాత ఏకంగా ప్రధాన మంత్రి ఆఫీస్ కే బెదిరింపు ఉత్తరం పంపిస్తాడు టైగర్. దీంతో రహస్య విచారణ కోసం అక్కడికి వస్తాడు రాఘవేంద్ర రాజ్ పుత్(అనుపమ్ ఖేర్). పరమ క్రూరుడిగా పేరు పొందిన నాగేశ్వరరావు గురించి అసలు నిజాలు తెలుసుకుంటాడు. ఇన్ని అరాచకాలకు కారణం ఎవరు, చివరికి టైగర్ ప్రయాణం ఏ మజిలీకి చేరుకుందో తెరమీద చూడాలి.

విశ్లేషణ

ఎవరి బయోపిక్ అయినా తెరకెక్కించే స్వతంత్రం దర్శకులకుంది. వంశీ ఎంతో రీసెర్చ్ చేసి, ఎన్నో ప్రాంతాలు తిరిగి సమాచారం సేకరించి దానికి కొంత కల్పన జోడించి టైగర్ నాగేశ్వరరావు స్క్రిప్ట్ రాసుకున్నట్టు పలు సందర్భాల్లో చెప్పాడు. ఈ మాటల్లో అవాస్తవం లేదు. ఆలోచన కూడా మంచిదే. అయితే ఒక దొంగ గురించి తెరమీద చూపిస్తున్నప్పుడు, అందులోనూ రవితేజ లాంటి మాస్ హీరోతో రిస్క్ చేస్తున్నప్పుడు చాలా క్యాలికులేషన్లు అవసరం. కేవలం భారీతనం వల్లనో, పదే పదే లీడ్ క్యారెక్టర్ ని విపరీతంగా పొగిడేయడం వల్లనో ఆడియన్స్ కనెక్ట్ కారు. ఈ ప్రాధమిక సూత్రాన్ని వంశి విస్మరించాడు. లైన్ పరంగా ఎంతో డెప్త్ ఉన్న సబ్జెక్టు ఇది.

కెజిఎఫ్ తర్వాత డైరెక్టర్లలో అధిక శాతం అదే తరహా మోడల్ నెరేషన్ కు అలవాటు పడ్డారు. ఇందులోనూ అదే జరిగింది. మురళీశర్మని ఢిల్లీకి పిలిపించి నాగేశ్వరరావు కథ చెప్పమని పీఎం పేషీ అధికారుల విచారణతో మొదలవుతుంది. ఓ రేంజ్ బిల్డప్ తో టైగర్ ఎలాంటి దొంగతనాలు చేసేవాడో వివరించే ఎపిసోడ్ తో మొదలైన కొద్దినిమిషాలకే మెయిన్ టెంపోలోకి తీసుకెళ్ళిపోతాడు వంశీ. రాజమండ్రి బ్రిడ్జ్ మీద తాళ్లు కట్టుకుని చేసే సాహసం విఎఫెక్స్ పరంగా నాణ్యత తగ్గినప్పటికీ ఆ మొత్తం సీన్ బాగా వచ్చింది. ఎప్పుడైతే పోర్టులో పొగాకు బేళ్లు తీసుకొచ్చి వేలం పాటలో కుర్చీ సొంతం చేసుకుంటాడో దాని తర్వాత హీరోయిన్ ఎంట్రీతో అసలు సమస్యకు శ్రీకారం చుట్టాడు.

ఫస్ట్ హాఫ్ లో అధిక భాగం నాగేశ్వరరావు స్వతహాగా డబ్బు కోసం, కామదాహం తీర్చుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తాడని రిజిస్టర్ చేసిన దర్శకుడు వంశీ దాని వెనుక అసలు ఉద్దేశాలను ఇంటర్వెల్ తర్వాత వివరించడానికి దాచి పెట్టడం విపరీతమైన ల్యాగ్ కు దారిచ్చింది. నుపుర్ సనన్ తో లవ్ ట్రాక్ మొత్తం పూర్తిగా పక్కదారి పట్టేసింది. ఆ పాత్రకిచ్చిన ట్విస్ట్ ఎలాంటి ఫీలింగ్ కలింగించలేకపోవడం రాతలో లోపమే. ఇంటర్వెల్ దాకా దొంగతనాలు, కాసిన్ని ఎలివేషన్లతో ఓ మాదిరిగా నెట్టుకొచ్చిన వంశీ విశ్రాంతి దగ్గర ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కు టైగర్ ఎందుకు వచ్చాడనే ప్రశ్న దగ్గర కట్ చేస్తాడు. నిజానికిది ఓ రేంజ్ లో పేలాల్సిన సన్నివేశం. కానీ అంతంత మాత్రంగా వచ్చింది.

అసలు పరీక్ష సెకండ్ హాఫ్ లో మొదలవుతుంది. అప్పటిదాకా నాగేశ్వరరావుని బ్రూటల్ కిల్లర్ గా ఏదైతే మనసులో ముద్రించుకున్నామో దాన్ని పూర్తిగా చెరిపేసే సంకల్పం షురూ చేశాడు వంశీ. జీవితంలో చేసిన తప్పులన్నీ కేవలం ఊరి బాగు కోసమేనని, ఏ స్వార్థం లేని గొప్ప వీరుడని చెప్పే ప్రయత్నం ఒక దశ దాటాక పూర్తిగా హద్దులు దాటిపోయింది. పదే పదే పాత్రలన్నీ దేవుడి రేంజ్ లో కీర్తించేందుకు ఆరాటపడతాయి. ఇది రవితేజ ఇమేజ్ కి డ్యామేజ్ కాకూడదనే ప్రయత్నమో లేక నాగేశ్వరరావుని భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ తర్వాత అంత మహోన్నత వ్యక్తిత్వం కలవాడని చెప్పే ఆరాటమో ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. ఇది ప్రధాన లోపం.

విపరీతమైన నిడివితో రెండో సగం మొత్తం విసుగు మోతాదుని పెంచుకుంటూ పోయింది. నాగేశ్వరరావులో మంచితనం ఉండొచ్చు. కానీ చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందినట్టు చూపించి ఆ తర్వాత ఎలివేషన్లు ఇచ్చి ఉంటే బాగుండేది. రేణు దేశాయ్ వచ్చాక క్లైమాక్స్ కు వెళ్ళిపోతాం అనుకుంటే తిరిగి అక్కడి నుంచి మరో అరగంట సినిమా ఉండటం సహనాన్ని పీక్స్ కు తీసుకెళ్తుంది. ఇంతా చేసి టైగర్ ని మౌళి తుప్పల్లో వెంటపడటం, చివరి ఘట్టం సగటు కమర్షియల్ సినిమా తరహాలో పాడుబడిన ఫ్యాక్టరీలో ముగించడం మరీ రొటీన్ అనిపిస్తుంది. మూడు గంటల పాటు చెప్పేంత కంటెంట్ కాదని తెలిసి కూడా లెన్త్ విషయంలో శ్రద్ధ తీసుకోకపోవడం ముమ్మాటికీ తప్పే

ఒక మంచి అవకాశం రైటింగ్ లో తడబాటు వల్ల పూర్తిగా పట్టాలు తప్పేసింది. రాబిన్ హుడ్ రేంజ్ లో నాగేశ్వరరావుని ప్రెజెంట్ చేయాలనుకున్న టార్గెట్ పక్కదారి పట్టింది. హింసను విపరీతంగా చూపిస్తే మాస్ కాసేపు ఊగుతారేమో కానీ సగటు ప్రేక్షకులు మాత్రం నిర్మొహమాటంగా బోర్ ఫీలవుతారు. ఇలాంటి ఎన్నో అంశాలు బ్యాలన్స్ తప్పాయి. ఇతర భాషల్లో వర్కౌట్ అవుతున్న కెజిఎఫ్ రాఖీ భాయ్ స్టోరీలు మనదగ్గర ఎందుకు తేడా కొడతాయో విశ్లేషించుకుంటే ఈ టైపు పొరపాట్లు జరగవు. భారీతనం ముసుగులో బలహీనతలు ఎక్కువ దాచలేం. వంశీ అదే చేశాడు. ప్రయత్నం పరంగా మెచ్చుకోదగిందే అయినా అమలుపరంగా అంచనాలు నిలబెట్టుకోలేదు.

నటీనటులు

రవితేజ పెర్ఫార్మన్స్ పరంగా ఏ లోటు రానివ్వలేదు. గంభీరమైన గొంతుతో చివరిదాకా ఒకే టోన్ మెయిటైన్ చేశాడు. యంగ్ లుక్స్ విషయంలో కొంచెం తేడా కొట్టింది. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ లకు స్పేస్ దొరికినా గుర్తుండిపోయేలా ఏమీ దక్కలేదు. వృధా అయ్యారు. మెయిన్ విలన్ హరీష్ పేరడీ ఓకే. అనుపమ్ ఖేర్, మురళి శర్మ, నాజర్ లకు వయసు అనుభవానికి తగ్గ పాత్రలే ఇచ్చారు. జిస్సు సేన్ గుప్తా క్యారెక్టర్ డిజైనే కాదు నటించిన విధానం కూడా మిస్ ఫైర్ అయ్యింది. రేణు దేశాయ్ ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వలేకపోయారు. కంచరపాలెం కిషోర్ హీరో పక్కనే ఉండే అనుచరుడిగా ఎక్కువసేపు కనిపించాడు. ఆర్టిస్టులు ఇంకా బోలెడున్నారు.

సాంకేతిక వర్గం

జివి ప్రకాష్ కుమార్ సంగీతంలో ఎలాంటి మెరుపుల్లేవ్. బిజిఎం కూడా అంతంత మాత్రమే. పాటలు మరీ అన్యాయంగా ఫోన్ వైపు చూసేంత వీక్ గా పడ్డాయి. తన స్థాయి పనితనం కాదిది. ఆర్ మధి ఛాయాగ్రహణం మాత్రం వీలైనంత మేరకు క్వాలిటీ చూపించడానికి తాపత్రయపడింది. ఇంత కాన్వాస్ లో రాజీపడిన వైనాన్ని కవర్ చేయడానికి చాలా కష్టపడ్డారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ లో ఇంత ఓవర్ లెన్త్ రావడం ఆశ్చర్యమే. బహుశా దర్శకుడి ప్రోద్భలం వల్ల కత్తెర పక్కనపెట్టారేమో. అర్ట్ వర్క్ పర్వాలేదు. శ్రీకాంత్ విస్సా సంభాషణలు అక్కడక్కడా బాగున్నాయి. అభిషేక్ అగర్వాల్ నిర్మాణ విలువల్లో విఎఫెక్స్ పరంగా కాంప్రోమైజ్ కనిపించింది.

ప్లస్ పాయింట్స్

రవితేజ
కథా నేపథ్యం

మైనస్ పాయింట్స్

సుదీర్ఘమైన నిడివి
కథనం
మితిమీరిన ఎలివేషన్లు
సంగీతం
సెకండ్ హాఫ్

ఫినిషింగ్ టచ్ – వినిపించని గాండ్రింపు
రేటింగ్ : 2 / 5