సమీక్ష – మళ్ళీ పెళ్లి

2.25/5

2 Hr 11 Mins   |   Romance   |   26-05-2023


Cast - Naresh, Pabithra, Jayasudha, Annapoorna, Ananya Nagalla, Sarath Babu and others

Director - MS Raju

Producer - Naresh

Banner - Vijaya Krishna Movies

Music - Suresh Bobbili

వయసు మళ్ళిన జంటను హీరో హీరోయిన్లుగా పెట్టి సినిమాలు తీయడం చాలా రిస్క్. అందులోనూ క్యారెక్టర్ ఆర్టిస్టులతో ఈ ప్రయోగమంటే సాహసమే. అయినా సరే నరేష్ తన స్వీయ నిర్మాణంలో దీనికి పూనుకుని మళ్ళీ పెళ్లితో ప్రేక్షకుల ముందుకొచ్చారు. షూటింగ్ టైంలో దీన్నెవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ ప్రమోషన్లు మొదలయ్యాక కదలిక వచ్చింది. మొదటి రోజే చూడాలన్నంత హైప్ రాలేదు కానీ వీళ్ళ ప్రైవేట్ లైఫ్  ఎలా ఉంటుందోననే ఆసక్తి ఆడియెన్స్ లో లేకపోలేదు. ఇంతకీ మూడు ముళ్ళు సరిగా పడ్డాయా

కథ

టాలీవుడ్ ఆర్టిస్టు నరేంద్ర(నరేష్) షూటింగ్ స్పాట్లో పార్వతి(పవిత్ర లోకేష్)ని చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. భార్య సౌమ్య(వనిత విజయ్ కుమార్) గయ్యాళితనం వల్ల ఒంటరితనం అనుభవిస్తూ ఉంటాడు. పార్వతితో స్నేహం పెరిగాక తల్లి(జయసుధ)కి పరిచయం చేస్తాడు. ఓసారి బెంగళూరు వెళ్లిన నరేంద్రకు తను ఇష్టపడిన మహిళకో కుటుంబం ఉందని దాని వెనుకో విషాద గతం ఉందని తెలుసుకుంటాడు. దీంతో ఎలాగైనా సరే జీవిత భాగస్వామిని చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆపై జరిగేది తెరమీద చూడాలి

విశ్లేషణ

ఎన్నో నెలలుగా పేపర్లు, న్యూస్ ఛానల్స్, వెబ్ సైట్స్ లో చదివిన చూసిన కథనే నరేష్ ఈ మళ్ళీ పెళ్లిలో చూపించే ప్రయత్నం చేశారు. ఇంటర్వెల్ దాకా ఇదే ఫీలింగ్ కలుగుతుంది కానీ తన నాలుగో పెళ్లికి దారి తీసిన పరిస్థితులు బయట ప్రపంచానికి తెలియని విషయాలను చెప్పాలని పడిన తాపత్రయమే ఈ మళ్ళీ పెళ్లి. ఇలాంటి సబ్జెక్టుఐ క్యాస్టింగ్ ని స్టార్ డైరెక్టర్లు తీసుకోరు కాబట్టి ఎంఎస్ రాజు లైన్ లోకి వచ్చారు. నిర్మాతగా ఎంతో గొప్ప ట్రాక్ రికార్డు ఉన్న రాజుగారు దర్శకుడిగా మారాక సక్సెస్ సాధించారేమో కానీ కంటెంట్ పరంగా మెప్పులు పొందలేదు. అందుకే ఈ మళ్ళీ పెళ్లికి ఆయన పేరు చూసి అమాంతం అంచనాలేవి పెరగలేదు.

డైరెక్షన్ తో పాటు రచన కూడా చేసిన ఎంఎస్ రాజు స్క్రీన్ ప్లేని ఆసక్తికరంగా మలుచుకోవడంలో తడబడ్డారు. ఉదాహరణకు సౌమ్య నరేంద్రని ఎలా ట్రాప్ చేసిందన్న ఎపిసోడ్ చాలా ఫ్లాట్ గా నడిపించి ఆసక్తి కలిగించే అవకాశమున్న అంశాలను సైతం చప్పగా తేల్చేశారు. పైగా నరేంద్ర జీవితంలో ఎలాంటి తప్పు చేయలేదని ప్రొజెక్ట్ చేయడానికి తీసుకున్న శ్రద్ధ కొన్ని చోట్ల అవసరం లేని వ్యక్తిత్వ ఎలివేషన్లకు చోటిచ్చింది. ఉదాహరణకు నరేంద్రపై తల్లికి ఎంత ప్రేమ ఉన్నా ఇన్నేసి వివాహాలు ఎందుకు విఫలమయ్యాయనే పాయింట్ కి సరైన జస్టిఫికేషన్ ఉండదు. పైగా సౌమ్యని విలన్ చేయడం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం స్పష్టంగా కనిపిస్తుంది.

ఒకరకంగా చెప్పాలంటే ఇది వన్ సైడ్ వెర్షన్. నరేంద్ర వ్యక్తిత్వాన్ని హైలైట్ చేస్తూ ఇంత గొప్ప వ్యక్తి  అరవై ఏళ్ళ వయసులో ఎందుకు ప్రేమలో పడ్డారో చెప్పేందుకు రెండు గంటల పధి నిమిషాల వీడియోగా తీసినట్టు అనిపిస్తుంది. ఇది బ్యాలన్స్ కావాలంటే పార్వతి లైఫ్ లోని చేదు ఏమిటో చూపించాలి. మళ్ళీ పెళ్లిలో సర్ప్రైజ్ ఏదైనా ఉందంటే అది ఈ భాగమే. ఆవిడ భర్త తాలూకు గతం కర్ణాటక జనానికి ఏమో కానీ మన ప్రేక్షకులకు కొంచెం కూడా తెలియదు. ఇదొక్కటే కొంత ఇంటరెస్టింగ్ గా సాగుతుంది. వీళ్ళ బంధం వెనుక చీకటి కోణాన్ని చూపించిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. అందులో వాస్తవమెంతుందో తెలియదు కానీ పార్వతిపై జాలికి ఉపయోగపడింది

ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ లో వయసులో ఉన్న పార్వతిగా అనన్య నాగళ్ళను తీసుకోవడం మంచి ఎత్తుగడ. పోలికల పరంగా పర్ఫెక్ట్ గా సూటయ్యింది. అలా అని ఈ ట్రాక్ ఏదో హై ఇస్తుందని కాదు కానీ కొన్ని తెలియని విషయాలను చెబుతుంది అంతే. నరేష్ పేరు మార్చుకుని తన ఒరిజినల్ పాత్రలో నటించి ఇది బయోపిక్ కాదని చెప్పినా ఎక్కడిక్కడా ఇది నిజమైన కథేనని తేలికైన క్లూస్ ఇచ్చారు. మొదటి సినిమా నాలుగు స్తంభాలాటగా చెప్పడం, తల్లిని మహిళా దర్శకురాలిగా చూపించడం, తండ్రిని సూపర్ స్టార్ గా సంబోధించడం ఇవన్నీ అందులో భాగమే. పరోక్షంగా ఇంకో పేరుతో మహేష్ బాబు ప్రస్తావన తెచ్చారు కానీ ఆ థ్రెడ్ ని ఎక్కువ హైలైట్ చేయలేదు

నరేష్ పవిత్ర లోకేష్ రిలేషన్ పట్ల ఇంటరెస్ట్ ఉంటే తప్ప సగటు ఆడియన్స్ ని నచ్చే మెచ్చే అంశాలు మళ్ళీ పెళ్లిలో ఏమీ లేవు. కేవలం ఈ ఇద్దరి వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు, అంతా సౌమ్య, పార్వతితో సహజీవనం చేసిన వ్యక్తి వల్ల జరిగిందే తప్ప తమ బంధం స్వచ్ఛమైందనే మెసేజ్ ఇచ్చారు అంతే. ఇది ఆడినా ఆడకపోయినా నరేష్ కు వచ్చే నష్టం ఏమి లేదు. ప్రెస్ మీట్ లో లీగల్ గా డిటైల్డ్ గా చెప్పలేని సంగతులను ఇలా కాల్పనిక సినిమా రూపంలో వాస్తవాలను చూపించేలా సినిమా తీయించారు. దానికి ఎంఎస్ రాజు సహాయం తీసుకున్నారు. అక్కడక్కడా కొన్ని సీన్లు తప్పించి ఓవరాల్ గా చూసుకుంటే మళ్ళీ పెళ్లి భరించలేని ప్రహసనమే

నటీనటులు

ఇష్టపడి ఏరికోరి చేసిన పాత్ర కాబట్టి నరేష్ అలవోకగా నరేంద్రలో పరకాయ ప్రవేశం చేసేశారు. నటన పరంగా ఇది వన్ అఫ్ ది బెస్ట్ అని చెప్పలేం కానీ తనవరకు సంపూర్ణంగా జీవించేశారు. సహజంగానే పవిత్ర లోకేష్ కూడా న్యాయం చేశారు. జయసుధకు చెప్పుకోదగ్గ స్పేస్ దొరికింది. హుందాగా నటించారు. ఇటీవలే కన్నుమూసిన శరత్ బాబుని బాగా చూపించారు. యుక్త వయసు పార్వతిగా అనన్య నాగళ్ళ బాగుంది. కాసేపే అయినా ఉనికిని చాటుకుంది. ఊర మాస్ గయ్యాళిగా వనిత విజయ్ కుమార్ తన బాధ్యతను నెరవేర్చారు. పార్వతి భర్తగా చేసిన టీవీ రవివర్మతో పాటు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కుర్రాడు యాప్ట్. మిగిలిన వారు చెప్పుకునేంతగా గుర్తుండరు

సాంకేతిక వర్గం

సురేష్ బొబ్బిలి పాటలు అంతగా గుర్తుండిపోవు. ఏదో మెలోడీ ట్యూన్స్ అయితే ఇచ్చారు కానీ వీక్ గా కంటెంట్ వల్ల ఎలివేట్ కాలేకపోయాయి. అరుళ్ దేవ్ నేపధ్య సంగీతం బాగానే కుదిరింది. బాల్ రెడ్డి ఛాయాగ్రహణంలో పెద్దగా ఫిర్యాదు చేయడానికి ఏమి లేదు. ఉన్నంతలో విజువల్స్ ని దర్శకుడి ఆలోచనల ప్రకారం డీసెంట్ గా చూపించారు. జునైద్ సిద్ధికి ఎడిటింగ్ ని తప్పుబట్టలేం కానీ ఓవరాల్ లో ఇంకో పది నిమిషాలు తగ్గించినా బాగుండేది. నరేష్ స్వంత ప్రొడక్షన్ కాబట్టి ఈ కథకు అవసరమైన ఖర్చు పెట్టారు

ప్లస్ పాయింట్స్

నరేష్ పవిత్ర జంట
కొన్ని కొత్త విషయాలు

మైనస్ పాయింట్స్

వన్ సైడ్ వెర్షన్
నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే
బలం లేని సన్నివేశాలు
నిడివి

ఫినిషింగ్ టచ్ : ప్రైవేట్ పెళ్లి

రేటింగ్ : 2.25/5