సమీక్ష – వాల్తేరు వీరయ్య

2.5/5

2 Hour 35 minutes   |   Action | Comedy   |   13-01-2023


Cast - Chiranjeevi, Raviteja, Shruti Haasan, Bobby Simha, Prakash Raj, Catherine Tresa and others

Director - Bobby Kolli

Producer - Naveen Yerneni, Y Ravi Shankar

Banner - Mythri Movie Makers

Music - Devi Sri Prasad

Waltair Veerayya – కొత్త తరం దర్శకులు వింటేజ్ స్టార్లతో చేసే అవకాశం రావడం అదృష్టంగా ఫీలవుతున్నారు. వయసు, ఆరోగ్యం దృష్ట్యా ఎక్కువ సినిమాల్లో నటించే అవకాశం లేకపోవడంతో వీలైనంత గొప్పగా సదరు హీరోలను చూపించాలని తాపత్రయపడుతున్నారు. బాబీ కొల్లి వాల్తేరు వీరయ్యలో అదే ప్రయత్నం చేశాడు. ఖైదీ నెంబర్ 150 తర్వాత సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న చిరంజీవికి ఇదేదో గట్టి హిట్టు ఇస్తుందన్న నమ్మకం అభిమానుల్లో మొదటి నుంచీ ఉంది. అందుకే చెప్పుకోదగ్గ అంచనాలే నెలకొన్నాయి.

మలేషియాలో ఉండే మాఫియా డాన్ సోలొమన్(బాబీ సింహా)ని తెచ్చే పని మీద వాల్తేరు వీరయ్య(Chiranjeevi)ని కలుస్తాడు సీతాపతి (రాజేంద్రప్రసాద్). ఒప్పుకున్న వీరయ్య అక్కడికి వెళ్తాడు. అనుకున్న కార్యం నెరవేర్చే క్రమంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయి. ఇంతకీ ఈ మిషన్ ఎందుకు ప్లాన్ చేశారు, ఏసిపి విక్రమ్ సాగర్(Ravi Teja) ఎవరు తదితర ప్రశ్నలకు సమాధానమే అసలు కథ.

బాబీకి ఒకప్పటి చిరంజీవిని తెరమీద ఆవిష్కరించాలన్న తాపత్రయం మంచిదే. అలా అని 1990 నాటి రోజుల్లోనే ఉంటూ అప్పటి స్టయిల్ లోనే కథ చెప్పడానికి వెళ్తే ఇప్పటి జెనరేషన్ రిసీవ్ చేసుకుంటారా. మెగాస్టార్ మాస్ మహారాజా అనే పదునైన కాంబినేషన్ చేతికి దొరికినప్పుడు అభిమానులు ఓ రేంజ్ లో గూస్ బంప్స్ స్టఫ్ ని ఆశిస్తారు. అంతే తప్ప ఎమోషన్ల పేరిట సాగదీసిన సన్నివేశాలను కాదు. ఇద్దరు కలిసి డాన్సు చేస్తే సరిపోదు. ఫైట్ చేయాలి. తుక్కు రేగొట్టాలి. ఒకరు కుడివైపు మరొకరు ఎడమవైపు రౌడీల దుమ్ము దులపాలి. సగటు మాస్ జనాలు కోరుకునేవి ఇవే. కమర్షియల్ మార్కెట్ బోధించే పాఠం కూడా ఇదే. కానీ వీరయ్య దీన్ని సరిగా అర్థం చేసుకోలేదు.

నడి సముద్రం బ్యాక్ డ్రాప్ లో చిరు ఇంట్రోతో మొదలుపెట్టి ఒక ఇంటెర్నేషల్ డాన్ ని విదేశాల నుంచి ఇండియాకు రప్పించే మిషన్ మీద హీరో చేసే పనుల దాకా అన్నీ ఫార్ములా ప్రకారమే వెళ్లాయి. జై చిరంజీవా, రెబెల్ లాంటి రివెంజ్ డ్రామాలో జరిగింది ఇదే. అంత పెద్ద దందా చేసే హీరో పక్కన కమెడియన్లను గ్యాంగ్ సభ్యులుగా చూపించి వాళ్ళు వందల కోట్ల డ్రగ్స్ వ్యాపారం చేస్తారని బాబీ సింహ లాంటి పవర్ ఫుల్ విలన్ గుడ్డిగా నమ్మేయడం ఏ మాత్రం నమ్మశక్యంగా ఉండదు. ఇలాంటివి బోలెడు పొరపాట్లు వీరయ్య గ్రాఫ్ ని ఎక్కడిక్కడ తగ్గించుకుంటూ వెళ్లాయి.

మొదటి గంట హెచ్చుతగ్గులు ఎలా ఉన్నా ఇంటర్వెల్ బ్యాంగ్ ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసిన బాబీ ఆ తర్వాత సెకండ్ హాఫ్ మీద అమాంతం అంచనాలు పెంచేస్తాడు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రవితేజ వచ్చాక పూనకాలకు సీట్లో కూర్చోవడం కష్టమేమో అన్న రేంజ్ లో సిద్ధపడిపోతాం. కానీ అదేమీ జరగదు. ఇద్దరి మధ్య సీన్లను కొత్తగా చూపించిన బాబీ వాళ్ళ బాండింగ్ ఎస్టాబ్లిష్ చేశాక ఎలాంటి హై ఇచ్చే ఎపిసోడ్స్ ని డిజైన్ చేసుకోలేదు. ఆర్ఆర్ఆర్ లో తారక్ చరణ్ లు కలిసి బ్రిటిషర్లను ఓ ఆట ఆడుకున్నట్టు ఇందులో కూడా చిరు రవిలు గూండా బ్యాచ్ తుక్కు రేపుతారని ఆశిస్తాం. మరీ అంత అంచనాలు పెట్టుకున్నా కష్టం. ఎమోషన్ డామినేషన్ వల్ల అది కుదరలేదు.

చిరంజీవి లాంటి మాస్ లెజెండ్ తో సోషల్ మీడియా జోకులు చెప్పించడం ఏమిటో అర్థం కాదు. అల్లరి నరేష్ స్పూఫ్స్ తరహాలో హిట్ సాంగ్స్, పాత బ్లాక్ బస్టర్ బిజిఎమ్స్, డైలాగులను వాడుకోవడంలో ఔచిత్యం ఏంటో అంతు చిక్కదు. చాలా కాలం తర్వాత మెగాస్టార్ తనలో అసలైన కామెడీ టైమింగ్ ని బయటికి తీయడం వల్ల ఇలాంటి బలహీనతలు కవరైపోయాయి కానీ లేదంటే పరిస్థితి ఇంకా కిందకు వెళ్ళేది. ప్రమోషన్లలో పదే పదే పూనకాలు లోడింగ్ అంటూ ఊదరగొట్టడం లేనిపోని హైప్ ని పెంచేసి ఆ స్థాయికి తగ్గట్టు లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. సగటు ప్రేక్షకుడు ఆశించే రెగ్యులర్ ఎలిమెంట్స్ గాడ్ ఫాదర్ లో మిస్ అయితే ఇందులో పాతమూసలో సర్దేశారు.

బాబీతో పాటు రచనలో భాగమైన కోన వెంకట్ బృందం అప్డేటెడ్ గా ఆలోచించకపోవడం వాల్తేరు వీరయ్యకు జరిగిన మరో చేటు. కామెడీని మరీ తేలికగా రాసుకున్నారు. ప్రీ క్లైమాక్స్ లో యాక్షన్ డ్రామాను మరీ అతిశయోక్తిగా నడిపించడం సినిమాటిక్ లిబర్టీ అని సర్దిచెప్పుకున్నా అక్కడా లెన్త్ ఎక్కువైపోయి ఎప్పుడెప్పుడు చివరి ఘట్టం వస్తుందాని ఎదురు చూసేలా చేసింది. రవితేజ ఉన్నంత సేపూ అతని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యే స్పేస్ సెట్ చేసుకున్నారు కానీ ఆ ఎనర్జీని మెగా స్టామినాతో పర్ఫెక్ట్ గా సింక్ చేసే కంటెంట్ ని రాసుకోలేదు. అదే జరిగి ఉంటే థియేటర్లలో ఈలలు కేకలు ఇంకో స్థాయిలో ఉండేవి. ఇవన్నీ స్క్రిప్ట్ దశలో పొరపాట్లే.

హిట్లర్ నాటి డాన్సులను, శంకర్ దాదా ఎంబిబిఎస్ టైపు కామెడీని అరవై ఏడేళ్ల వయసులోనూ చిరు నుంచి ఆశించడం కరెక్ట్ కాదు. అయినా శక్తివంచన లేకుండా చిరంజీవి దర్శకుడు అడిగినంతా ఇచ్చారు. ఫ్యాన్స్ ఫుల్ మీల్స్ గా ఫీలవొచ్చు. శృతి హాసన్ సంక్రాంతి బరిలో రెండోసారి మొక్కుబడి హీరోయిన్ గా మారిపోయింది. చిన్న ట్విస్టు పెట్టడం ఊరట. బాబీ సింహా బాగున్నాడు. ప్రకాష్ రాజ్ ది కొన్ని పదులసార్లు చూసిన వ్యవహారమే. ఊరికే నవ్వడం తప్ప శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, సప్తగిరి చేసిందేమి లేదు. ప్రదీప్ రావత్ ని ఎందుకు పెట్టుకున్నారో అర్థం కాదు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, క్యాథరిన్ వగైరాలు పాత్రలకు తగ్గట్టు సరిపోయారు.
 
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం పాటల పరంగా ఆల్రెడీ రీచ్ అయిపోయింది కానీ అందరి నోళ్ళలో నానిన బాస్ పార్టీ స్క్రీన్ మీద చాలా సాధారణంగా అనిపిస్తుంది. రెండు డ్యూయెట్స్ లో విజువల్స్ బాగున్నాయి. భగభగ సాంగ్ ఎలివేషన్ కి పర్ఫెక్ట్ గా ఉపయోగపడింది. బీజీఎమ్ గొప్పగా లేదు. ఆర్థర్ ఏ విల్సన్ ఛాయాగ్రహణం గురించి టీమ్ ప్రీ రిలీజ్ టైంలో గొప్పగా చెప్పడం నిజమే. రామ్ లక్ష్మణ్ పోరాటాలు గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ మిగల్లేదు. సెకండ్ హాఫ్ నిడివి గురించి ఎడిటింగ్ డిపార్ట్ మెంట్ కొంచెం సీరియస్ గా ఆలోచించి ఉంటే బాగుండేది. మైత్రి ప్రొడక్షన్ వేల్యూస్ యథావిధిగా బాగున్నాయి. క్వాలిటీ కోసం పెట్టిన ఖర్చు తెరమీద స్పష్టంగా కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్

చిరు టైమింగ్
రవితేజ పాత్ర
రెండు పాటలు
ఇంటర్వెల్ బ్యాంగ్

మైనస్ పాయింట్స్

రొటీన్ ఎమోషన్స్
కామెడీ
సెకండ్ హాఫ్
క్లైమాక్స్

ఫినిషింగ్ టచ్ – పూనకాలు ఏవి వీరయ్య..

రేటింగ్ : 2.5 / 5