సమీక్ష: సరిలేరు నీకెవ్వరు

నటీనటులు: మహేష్ బాబు – రష్మిక మందన్న – విజయశాంతి – ప్రకాష్ రాజ్ – రాజేంద్ర ప్రసాద్ – సంగీత – వెన్నెల కిషోర్ – సుబ్బరాజు – హరితేజ – బండ్ల గణేష్ – అజయ్ – రఘుబాబు తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాతలు: అనిల్ సుంకర – దిల్ రాజు
రచన – దర్శకత్వం: అనిల్ రావిపూడి

మాంచి ఎంటర్ టైనర్ సినిమాలు అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి, ఇటీవల కొన్ని సినిమాలుగా ఉపన్యాసాలు,సందేశాలు సినిమాలు వరుసగా చేస్తూ వస్తున్న హీరో మహేష్ బాబు కలిసి సినిమా చేస్తున్నారు అంటే అది కచ్చితంగా ఆసక్తి కరమే. అందుకే సరిలేరు నీకెవ్వరు సినిమాకు ఆ బజ్ వచ్చింది. జనాలు అర్థరాత్రి, లేదా తెల్లవారు ఝామునే థియేటర్లకు పరుగులెత్తేలా చేసింది. మరి అలా పరుగులెత్తిన జనాలను హీరో-దర్శకుడు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసేలా చేయగలిగారా? లేదా? అన్నది చూద్దాం.

సరిలేరు నీకెవ్వరు సినిమాలో చాలా అంటే చాలా థిన్ లేయర్ కథ వుంది. ఓ పెద్ద హీరో సినిమా కోసం ఇంత థిన్ లేయర్ కథ తో ముందుకు వెళ్లడం అన్నది కాస్త సాహసమే. లైన్ థిన్ గా వుండొచ్చు. కానీ లైన్ చుట్టూ అల్లుకున్న కథ లేదా కథనం అన్నది అయినా సాలిడ్ గా వుండాలి. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి తనకు అలవాటు అయిన పద్దతిలోనే సీన్లు వేసుకుంటూ వెళ్లిపోయాడు తప్ప, ఆ సీన్లు అన్నీ కలిపి ఓ సరైన కథనంలా మాత్రం తయారు కాలేకపోయాయి. అదే ఈ సినిమా అసలు సమస్య.

సైన్యంలో వున్న హీరో తోటి సైనికుడు గాయపడితే, అతని తరపున, ఆ కుటుంబానికి సాయం చేయడానికి వెళ్లడం, అదే సమయంలో ఆ కుటుంబం ఆపదలో చిక్కుకోవడంతో, వారికి అండగా నిలిచి సమస్య సాల్వ్ చేయడం. ఇదే సరిలేరు నీకెవ్వరు లైన్. దీనికి ప్యాడింగ్ గా సైన్యంలో వున్నాడు కాబట్టి, ఓ మిలటరీ ఆపరేషన్ సీన్. ఓ మిలటరీ పార్టీ సాంగ్ సీన్. మిలటరీ నుంచి కర్నూలు బయల్దేరాడు కాబట్టి ట్రయిన్ జర్నీలో కొన్ని సీన్లు. ఇవి మాత్రమే కలిస్తే సినిమా తొలిసగం పూర్తయిపోతుంది. ఆ తొలిసగం పూర్తయిపోయే ముందు ఓ భారీ పోరాటం.

మలిసగంలోకి వస్తే, విలన్ ను ఢీకొనడం, హీరోను దెబ్బతీయడానికి విలన్ ప్రయత్నాలు. వాటి మధ్యలో బోర్ కొట్టకుండా హీరోయిన్, కమెడియన్లతో కొన్ని సీన్లు. ప్రీ క్లయిమాక్స్, క్లయిమాక్స్.

తొలిసగంలో కావచ్చు, మలిసగంలో కావచ్చు. ఫ్లిల్లింగ్ కోసం వాడుకున్న సీన్లు బాగానే వుంటాయనిపిస్తుంది కానీ, అన్నీ కనెక్ట్ చేస్తే సరైన బొమ్మ తయారు కాని ఫీలింగ్ వెంటాడుతుంది ప్రేక్షకుడిని. వాస్తవానికి అనిల్ రావిపూడిని మహేష్ కు వున్న సూపర్ స్టార్ ఇమేజ్ కట్టిపడేసింది. ఏ సీన్ రాసుకోవాలన్నా అందులో హీరో వుండాలి. హీరో వుంటే కచ్చితంగా మహేష్ మార్క్ ఎలివేషన్ వుండాలి లేదా తన మార్కు ఫన్ వుండాలి. ఇదీ సమస్య. దాంతో సీన్ లో దమ్ము, కథతో కనెక్టివిటీ, లేదా కథకు సీన్ ఇచ్చే సపోర్ట్ ఇలాంటి అంశాలు పట్టించుకోకుండా సీన్లు వేసుకుంటూ వెళ్లిపోయాడు.

అనిల్ రావిపూడి  బహుశా ఈ నిర్ణయం మహేష్ ఫ్యాన్స్ ను, బి, సి సెంటర్ల ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని తీసుకుని వుండొచ్చు. కానీ దీనివల్ల ఏం జరిగింది అంటే సినిమా ఎటూ కాకుండా అయింది. మహేష్ ను అభిమానించే క్లాస్ ఆడియన్స్ కు సినిమా కాస్త దూరం జరిగింది. అలాగే మహేష్ ను అభిమానించే మాస్ ఆడియన్స్ కు దగ్గర చేసింది. కానీ, అదే మాస్ ఆడియన్స్ ను ద్వీతీయార్థంలో వచ్చే ఎమోషన్ సీన్లు, ప్రీచింగ్ సీన్లు కాస్త కట్టడి చేస్తాయి. అదే సమయంలో అనిల్ రావిపూడి చేసిన ఫన్ సీన్లు కాస్త క్లాస్ ఆడియన్స్ ను రప్పించాలనుకున్నా, మహేష్ తో చేసిన బోయపాటి టైపు సీన్లు అడ్డం పడతాయి.

ఇలా అటు కొంత ఇటు కొంత అనే టైపులో ప్లాన్ చేయడం అన్నది సినిమా మీద ఓ రకమైన మిక్స్ డ్ ఒపీనియన్ ఏర్పడడానికి దారితీసింది. నిజానికి మహేష్ సినిమాలో కాస్త సందేశం, ఎమోషన్ అన్నవి తగ్గించి, ధైర్యం చేసి పూర్తిగా మాస్ దోవలో వెళ్లిపోతే పరిస్థితి వేరుగా వుండేదేమో? కానీ ఎందుకో దర్శకుడు ఆ దోవలో వెళ్లలేదు. అదే ఈ సినిమాకు మరో సమస్య.

ఇదిలా వుంటే బలమైనవో, కావో అన్న సంగతి పక్కన పెడితే, వీలయినంత వరకు ఫన్ ను తీసుకువచ్చే ప్రయత్నం అయితే ఆది నుంచి అంతం వరకు గట్టిగా చేసాడు దర్శకుడు. కానీ అక్కడ సమస్య ఏమిటంటే, మహేష్ కు సీనియర్ హీరో రాజేంద్ర  ప్రసాద్ ను జోడించాడు. మహేష్ ప్రదర్శన లైటర్ వీన్ లో నాచురల్ గా వుంటే రాజేంద్రప్రసాద్ చేసింది డ్రామా జోడించినట్లయింది. ఈ రెండూ అంత సింక్ కాకపోవడంతో సీన్లు పెద్దగా పండలేదు.

అదే సమస్య ట్రయిన్ ఎపిసోడ్ మీద కూడా పడింది. ట్రయిన్ ఎపిసోడ్ లో హీరోయిన్ ఫ్యామిలీ, జబర్దస్త్ బ్యాచ్ వ్యవహారాలు కాస్త ఓవర్ ది బోర్డ్ అన్నట్లుగా లౌడ్ గా వున్నాయి. బండ్ల గణేష్ ఎపిసోడ్ కు ఇదే సమస్య. దాంతో ఎంతో అంచనా వేసుకున్న ట్రయిన్ ఎపిసోడ్ అంత రక్తి కట్టలేదు. పైగా అంతేగా..అంతేగా అనే లైన్ అంత క్యాచీగా తెలుగులో మరో లైన్ ఆలోచించలేకపోయారు. నెవ్వర్ బిఫోర్..ఎవ్వరు ఆఫ్టర్ అన్న లెంగ్తీ ఇంగ్లీష్ లైన్ అంతేగా రేంజ్ కు రీచ్ కాలేకపోయింది. ప్రకాష్ రాజ్ దగ్గర మహేష్ చేసిన ఉపన్యాసాలు కానీ, రాజకీయ నాయకుల దగ్గర చేసిన ఉపన్యాసం కానీ ఆడ్ వన్ అవుట్ గా వుంటాయి. ఎలుక ఎపిసోడ్ అయితే మరీనూ.

సినిమాకు ప్లస్ పాయింట్లు లేదా అంటే బోలెడు వున్నాయి. ఎలా అంటే, కథ లైన్, కథనంతో సంబంధం లేకుండా జబర్థస్ టైపు కామెడీ నచ్చే ప్రేక్షకులకు ఫన్ సీన్లు అన్నీ నచ్చుతాయి. అలాగే హీరో ఎలివేషన్ సీన్లు, ఇంటర్వెల్ ముందు ఫైట్, అడవి ఫైట్ కూడా బాగా పడ్డాయి. ఆరంభంలో వచ్చిన తమన్నా పాట ఓకె అనిపించుకుంటే, క్లయిమాక్స్ లో వచ్చే పరమ నాటు సాంగ్ మాస్ జనాలను ఊపేస్తుంది. సెకండాఫ్ చివరిలో మైండ్ బ్లాక్ పాట లేకపోతే సినిమా పరిస్థితి ఊహాతీతంగా వుండేది. ఆ పాటకు మాస్ జనాలు ఫిదా కావడం ఖాయం. హీరోయిన్ తో కలిసి వెన్నెల కిషోర్ చేసిన సీన్లు కొంత వరకు ఓకె. మహేష్ ఫాటలు, ఫైట్లు ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తాయి. అలాగే విజయశాంతికి హీరో శాల్యూట్ చేసే సీన్ కానీ, అంతకు ముందుగా వచ్చే టైటిల్ సాంగ్ కానీ సీన్లకు బలం తీసుకవస్తాయి.

ఇలాంటి సినిమాలో మహేష్ బాబు ఫుల్ ఎనర్జీతో నటించారు. ఫన్, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్నింటితో పాటు డ్యాన్స్ లు కూడా చేసి, ఫ్యాన్స్ కు మాత్రం ఎలాంటి అసంతృప్తి కలగకుండా చూసుకున్నాడు. రష్మిక పాత్ర డిజైనింగ్ నే సరిగ్గా లేదు. సినిమాలో ఇలా వచ్చి, అలా మాయమై, మళ్లీ అలా వచ్చి, మెరుపులా మెరుస్తుంది. ప్రకాష్ రాజ్ లౌడ్ విలనీ మామూలే. విజయశాంతి రీ ఎంట్రీ ఓకె అనిపించుకుంటుంది. అంతే.

దేవీ నేపథ్య సంగీతం బాగుంది. పాటల్లో మైండ్ బ్లాక్ మాత్రమే గుర్తుంటుంది. ఫోటోగ్రఫీ అద్భుతంగా, కలర్ ఫుల్ గా ఏమీ లేదు. ఒక్క విలన్ ఇంటి సెట్ స్కేల్ కారణంగా అక్కడ మాత్రం బాగుందనిపిస్తుంది.

మొత్తం మీద దర్శకుడు కేవలం తనకు బాగా కలిసి వచ్చిన జోనర్ కే ఫిక్స్ అయినా లేదా, స్ట్రయిట్ గా మహేష్ కు కలిసి వస్తున్న జోనర్ కు షిప్ట్ అయినా ఫలితం వేరుగా వుండేదేమో? అటొ కాలు ఇటో కాలు వేయడం వల్ల కాస్త తేడా కొట్టింది. అయితే పండగ సీజన్ కావడం, మాస్ సినిమాకు టైమ్ కావడం వల్ల కలెక్షన్ల పరంగా బాగానే వుండొచ్చు. అదీ కూడా అల వైకుంఠపురంలో సినిమా ఫలితం మీద కూడా కొంత వరకు ఆధారపడి వుంటుంది.

రేటింగ్-3/5
ఫినిషింగ్ టచ్…సరిపోయి..సరిపోనట్లుగా