సమీక్ష – గల్లీ రౌడీ

2/5

2 Hrs 23 Mins   |   Action   |   17-09-2021


Cast - Sundeep Kishan, Neha Shetty, Bobby Simha

Director - G. Nageswara Reddy

Producer - MVV Satyanarayana, Kona Venkat

Banner - MVV Cinemas, Kona Film Corporation

Music - Ram, Sai Karthik

ప్రతి నిర్మాత, ప్రతి దర్శకుడు, ప్రతి హీరో, జనాలు ఏ సినిమా చూస్తారో? ఏ సినిమా చూడరో? అసలు ఏ సినిమా చేస్తే బెటరో? కాస్తయినా కొత్తగా ఆలోచించడం ఎలా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే, అవుట్ డేటెడ్ సినిమా చూపిస్తే జనం బెంబేలెత్త పోరూ…? వారానికి నాలుగయిదు కామీడీ షో లు టీవీల్లో వచ్చి జనాలకు ఫ్రీగా వినోదం అందిస్తుంటే, డబ్బులిచ్చి చూడాల్సిన వినోదం ఇంకెంత బాగుండాలి అన్న ఆలోచన చేయకుండా కామెడీ సినిమా తీసి థియేటర్ల మీదకు వదిలేస్తే ఏమనుకోవాలి? సరుకు అయిపోయింది..సత్తా అయిపోయింది… అని అనిపించేసుకుంటున్న డైరక్టర్ నాగెశ్వరరెడ్డి, బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నం మానేసి ఇంకా తాతల మూతుల నేతులు వాసన చూడమనడం అంటే అయ్యో అని అనుకోవడం తప్ప ఇంకేం చేయగలం? ఇదంతా ఈ వారం విడుదలయిన భయంకర హస్య చిత్రం గల్లీ రౌడీ గురించే.

భయంకర హాస్య చిత్రం అని ఎందుకు అనడం అంటే ఈ సినిమాలో హాస్యం మాత్రమే కాదు, భయంకరమైన విలనీ కూడా వుంది. ఊ అంటే మర్టర్, ఆ అంటే హత్య చేసే విలన్లు కనిపిస్తారు. పెన్ను పట్టుకుని గొంతులు కసక్కున దింపేసే కాన్సెప్ట్ రౌడీలు కనిపిస్తారు. దీంతో పాటు ఫన్ అనుకునే కామెడీ సీన్లు కూడా వుంటాయి.

ఇంతకీ గల్లీ రౌడీ కథ ఏంటంటే..ప్రజలకు న్యాయం చేయడం కోసం రౌడీగా మారినా తప్పులేదనే వంశంలో పుడతాడు వాసు (సందీప్ కిషన్). తాత (నాగినీడు) అతగాడి సలహాదారు నాయుడు (పొసాని) కలిసి చదువు మాన్పించి మరీ రౌడీగా చేస్తారు. ఇదిలా వుంటే పట్టపగలు వెంకట్రావు (రాజేంద్రప్రసాద్) భూమిని కబ్జా చేస్తాడు విశాఖను తన గుప్పిట్లో వుంచుకున్న భయంకర క్రిమినల్…… దాంతో అతగాడినే కిడ్నాప్ చేసి, తమ భూమి అమ్మితే వచ్చే కోటి రూపాయలను సంపాదించాలని పట్టపగలు వెంకట్రావు భార్య, తల్లి, కూతురు, కొడుకు ప్లాన్ వేస్తారు. కానీ ఆ ప్లాన్ వికటించి ….హత్యకు గురవుతాడు. అక్కడి నుంచి ఈ ఫ్యామిలీ కోసం వెదుకులాట ప్రారంభమవుతుంది. వీళ్లకు అండగా నిల్చుంటాడు వాసు. అప్పుడేం జరిగింది అన్నది మిగిలిన సినిమా.

గల్లీ రౌడీ సినిమా టైటిల్స్ నుంచి శుభం కార్డు వరకు ఒకే విధంగా వుంటుంది. ప్రేక్షకుడు కళ్లు అప్పగించి చూడడం, చెవులు అప్పగించి ఢాం..ఢాం అనే రీరికార్డింగ్ వినడం తప్ప చేసేదేమీ వుండదు. సినిమా ఎత్తుగడ ఓ లెవెల్ లో వుంటుంది. కానీ అంతలోనే హీరోకి బాల్యంలోనే రౌడీ శిక్షణ ప్రారంభం కాగానే పక్కా కామెడీ జోనర్ లోకి షిప్ట్ అవుతుంది. కానీ మళ్లీ అదే విధంగా వెళ్తుందా అంటే కాదు. భయంకరమైన విలన్లు, వాళ్లు చేసే హత్యలు, అవన్నీ బీభత్సంగా వుంటాయి. ఇటు కాస్త కామెడీ అటు కాస్త మాస్ బిల్డప్. వీటి మధ్యలో హీరో చేసే అదో మాదిరి నటన, ఇవన్నీ చాలక రాజేంద్ర ప్రసాద్, పోసాని లాంటి సీనియర్ల లౌడ్ కామెడీ, ఇక వీటికి అదనంగా హీరోయిన్ ట్రాక్. ఒకటి కాదు రెండు కాదు. అన్నట్లు కొసరు పాయింట్ లాంటి అద్భుతమైన ట్విస్ట్ కూడా వుండనే వుంది.

సినిమా చూస్తుంటే మ్యూజిక్ డైరక్టర్ అంత భీకరమైన ఆర్ఆర్ ఎందుకు ఇస్తున్నట్లో అని సందేహం దొలిచేస్తూ వుంటుంది. సినిమాలో వెన్నెల కిషోర్ చేసిన సైకో కామెడీ తప్పిస్తే మరే కామెడీ పండలేదు అని చెప్పడానికి అస్సలు మొహమాట పడక్కరలేదు.

పాపం, నిర్మాత సినిమాకు తక్కువేమీ చేయలేదు. విశాఖ లోకేషన్లు ఒక్కటి కూడా వదలకుండా షూట్ చేసేసారు. తనవో, బంధువులవో వున్న ఖరీదైన కార్లన్నీ వాడేసారు. మాంచి ఎరోటిక్ ఐటమ్ సాంగ్ బలవంతంగా దూర్చారు. ఇలా ఎన్ని చేయాలో అన్నీ చేసినా, అంతా సినిమా పాలయింది తప్ప, సినిమాకు పాజిటివిటీని తేలేకపోయింది.

అసలే థియేటర్ కు రావడానికి కరోనా భయపెడుతుంటే ఇలాంటి సినిమాలు ఇంకా భయపెడతాయి.

ప్లస్ పాయింట్లు
వెన్నెల కిషోర్

మైనస్ పాయింట్లు
కథ..కథనం
దర్శకత్వం..అన్నీ

ఫినిషింగ్ టచ్: సిల్లీ మూవీ

Rating: 2/5