సమీక్ష – సీటీమార్

2.75/5

2 Hrs 19 Mins   |   Action   |   10-09-2021


Cast - Gopichand, Tamannaah, Bhumika, Pragati, Rahman, Digangana Suryavanshi, Tarun Arora, and others

Director - Sampath Nandi

Producer - Srinivasaa Chitturi

Banner - Srinivasaa Silver Screens

Music - Mani Sharma

కొన్ని సినిమాలు కేవలం ఆడియన్స్ కోసమే తీస్తారు. కొన్ని సినిమాలు సమీక్షకులకు మాత్రమే నచ్చుతాయి. ఆడియన్స్, సమీక్షకుల అభిప్రాయాలు అన్ని సార్లు మ్యాచ్ కావాలని లేదు. అలా అయ్యే అవకాశమూ లేదు. నేల, బెంచి జనాలకు, సినిమా లో ఈలవేసి గోల చేసే జనాలకు నచ్చే సినిమాలు కొన్ని సమీక్షలకు నచ్చకపోవడంలో పెద్దగా ఆశ్చర్యం కూడా లేదు.

ప్రతి రోజూ పండగే, ఎఫ్ 3 సినిమాలు చాలా మంది సమీక్షకులకు నచ్చలేదు. కానీ అవి బ్లాక్ బస్టర్ అయిపోయాయి. ఈవారం విడుదలైన సీటీమార్ మరీ అలాంటి రేంజ్ సినిమా కాకపోయినా, ఆఢియన్స్ ను థియేటర్లో సీటీ కొట్టించే సినిమానే.

సీటీమార్ సినిమా మంచి చెడ్డలు చూసే ముందు కథ ఏమిటో చూసేద్దాం. గోదావరి జిల్లాలో బ్యాంక్ మేనేజర్ కమ్ కబడ్డీ కోచ్ కార్తీ (గోపీచంద్). ఊరిలో మెరికల్లాంటి అమ్మాయిలను కొంతమందిని చేరదీసి కబడ్డీ క్రీడలో శిక్షణ ఇస్తుంటాడు. వాళ్లను నేషనల్స్ లో ఆడించాలన్నది సంకల్పం. ఇదిలా వుంటే కార్తీ సోదరి (భూమిక) బావ (రెహమాన్) ఢిల్లీలో వుంటారు. అతగాడు స్ట్రిక్ట్ పోలీస్ అధికారి. ఘజియాబాద్ లో ఓ కరెప్ట్ పోలీస్ అధికారి (తరుణ్ అరోరా). అతగాడిని ఢీకొనడంతో ఇతగాడిపై అటాక్ చేస్తాడు. ఆ సమయంలో అక్కడ వున్న కార్తీ ఆ కరెప్ట్ పోలీస్ అధికారి సోదరుడిని షూట్ చేసి చంపేస్తాడు. దాంతో నేషనల్స్ ఆడడానికి ఢిల్లీ వచ్చిన కార్తీ టీమ్ అమ్మాయిలను అందరినీ కిడ్నాప్ చేస్తాడు విలన్.అప్పుడేం జరిగింది అన్నది మిగిలిన సినిమా

ఇక ఇప్పుడు సీటీమార్ సినిమా ఎలా వుందో చూద్దాం. సీటీమార్ తొలిసగం పక్కాగా మీటర్ మీద వుంటుంది. ఎక్కడ వుండాల్సిన సీన్ అక్కడ వుంటుంది. ఇక్కడ ఈ సీన్ వస్తుంది ముందుగానే తెలిసిపోతుంది. అయితే ఫైట్లు కానీ మాస్ సీన్లు కానీ ప్రేక్షకుల చేత ఓకె అనిపిస్తాయి కానీ నెగిటివ్ కామెంట్ రానివ్వవు. పెళ్లి చూపులు చెడగొట్టే ఆంటీల సీన్ కానీ, రావు రమేష్ సీన్లు కానీ, తమన్నా రైల్వే స్టేషన్ సీన్ కానీ మాస్ జనాలను అలరించేవే. తొలిసగం పాస్ మార్కులు సంపాదించేసుకుంది అనుకునే వేళకు ద్వితీయార్థం ప్రారంభమవుతుంది.

విలన్ వ్యవహారం మొదలవుతుంది. కమర్షియల్ సినిమా కాబట్టి ఇక్కడ లాజిక్కులు వెదకలేం. లేకపోతే తమ్ముడిని చంపేసిన వాడి చేతే వాడి అన్నను చంపించాలన్న పిచ్చి పంతం ఏమిటి? అందుకోసం అమ్మాయిలను కంటైనర్ లో వేసి ఢిల్లీ చుట్టూ తిప్పుతూ, హీరో కనుక్కుని వచ్చి తనను చితక్కొట్టే వరకు వెయిట్ చేయడం ఏమిటి? కరుడు కట్టిన రాక్షస విలన్ చేయాల్సిన పనేనా ఇది?

సరే ఇలాంటి లాజిక్కులు పక్కన పెడితే దర్శకుడు కూడా ఇలాంటి వాటి కోసం పాకులాడ పడలేదు. ద్వితీయార్థంలో ప్రేక్షకులు కావాల్సిన ‘జ్వాలారెడ్డి’ ‘పెప్సీ ఆంటీ’ పాటల కోసం ప్లేస్ మెంట్ ను చూసుకున్నాడు. అలాగే భారీ..భారీ యాక్షన్ ఎపిసోడ్ లు ప్లాన్ చేసుకున్నాడు. వీటి మధ్య కబడ్డీ ఆటను కూడా కాస్త ఇరికించాడు.

మొత్తం మీద చెప్పొచ్చేది ఏమిటంటే, రొటీన్ మాస్ యాక్షన్ సినిమానే. అందులో సందేహం లేదు. కానీ కరోనా సెకండ్ ఫేస్ తరువాత ఇలాంటి సినిమా కోసమే జనాలు చూస్తున్నారు. మామూలు రోజుల్లో కూడా ఇలాంటి సినిమాలకు ఫ్యామిలీ లు దూరంగానే వుంటాయి. రావాల్సింది మాస్ జనాలే. వారికి కావాల్సింది మాత్రం దర్శకుడు బాగానే దట్టించాడు. ద్వితీయార్థంలో కాస్త జాగ్రత్త పడి వున్నా, తమన్నా క్యారెక్టర్ ను మరించి కథలో పార్ట్ చేసి వున్నా ఇంకా ప్లస్ అయ్యేది. తొలిసగంలో వున్న ఎంటర్ టైన్ మెంట్ పార్ట్ ద్వితీయార్థంలో లేదు. అది కూడా ఓ మైనస్ పాయింట్ నే.

ఈ మద్యకాలంలో హీరో గోపీచంద్ కు సరైన సినిమా పడలేదు. ఈ సినిమా సరైన సినిమా అనలేం కానీ నిరాశ పర్చే సినిమా అయితే కాదు. తమన్నా ఒకె. విలన్ గా తరుణ్ అరోరా బాగానే చేసాడు.

సంపత్ నంది మాస్ డైలాగులు రావడంలో, మాస్ యాక్షన్ సీన్లు తీయడంలో తన హ్యాండ్ ను మరోసారి గట్టిగానే వాడాడు. సినిమాటోగ్రఫీ అందుకు ప్లస్ అయింది. నిర్మాణానికి అయిన ఖర్చు కూడా ఆ రేంజ్ లోనే వుంది. పాటలు రెండు ఇప్పటికే పాపులర్ అయ్యాయి కాబట్టి కొత్తగా చెప్పుకోనక్కరలేదు.

ప్లస్ పాయింట్లు
తొలిసగం
మాస్ మూవ్ మెంట్స

మైనస్ పాయింట్లు
ద్వితీయార్ధం
విలన్ ట్రాక్

ఫినిషింగ్ టచ్ : మాస్ తో ‘సీటీ’ కొట్టిస్తాది