తమిళనాట సంచలన మహిళ ఎవరు అంటే గతంలో, వర్తమానంలో, భవిష్యత్ లో వినిపించే పేరు జయలలిత. రామాయణాన్ని కట్టె, కొట్టె, తెచ్చె అన్నట్లు మూడు ముక్కల్లో చెబితే, జయలలిత జీవితాన్ని నాయిక..నాయకురాలు..ముఖ్యమంత్రి అనే మూడు పదాల్లో చెప్పొచ్చు. కానీ ఆ మూడు పదాల మధ్య ఎంతో కష్టం..ఎంతో ఎమోషన్..ఎంతో మొండితనం వున్నాయి. వాటన్నింటినీ ఒడిసి పట్టి సినిమా మార్చితే అది తలైవి అవుతుంది.
పాపులర్ వ్యక్తుల కథలే బయోపిక్ లు అవుతాయి. కానీ అలాంటి పాపులర్ వ్యక్తుల జీవితాలు తెరకెక్కించాలంటే కత్తి మీద సామే..స్పయిస్ వుండాలనుకుంటే గొడవ అయ్యే ప్రమాదం వుంది. అలా కాకుంటే డాక్యుమెంటరీ అవుతుంది. ఈ రెండింటి మధ్య తాడు మీద నడిచే ఫీట్ చేస్తూ సినిమాను నడపాల్సి వుంటుంది.
తలైవి సినిమాను అందించింది దర్శకుడు ఎల్ విజయ్. గతంలో మదరాసుపట్నం, నాన్న, శైవం వంటి మంచి సినిమా అందించిన విజయ్ తలైవా సినిమాను ఎలా అందించాడు అన్నది కచ్చితంగా ఆసక్తికరం. తలైవా సినిమా తమిళనాడు శాసనసభలో జయలలిత ప్రతిపక్షనాయకురాలుగా వున్నపుడు జరిగిన అవమానంతో స్టార్ట్ అవుతుంది. వెనక్కు నడిచి జయలలిత సినిమా జీవితంతో మొదలై, ఆమె తొలిసారి సిఎమ్ కుర్చీ అధిష్టించడంతో ముగుస్తుంది. అందువల్ల దీన్ని పూర్తి బయోపిక్ అనలేము. అలాగే తమిళనాట పార్టీల పేర్లను నేరుగా తీసుకోలేదు. కానీ క్యారెక్టర్లను కొంత వరకు తీసుకున్నారు. అందువల్ల కూడా పూర్తి స్థాయి బయోపిక్ అనలేము.
గతంలో మణిరత్నం తమిళ రాజకీయాలకు బయోపిక్ రూపం ఇవ్వాలని ఇద్దరు సినిమాతో కొంత ప్రయత్నించారు. అప్పట్లో మణిరత్నం ఎదుర్కొన్న ఇబ్బంధులను దృష్టిలో వుంచుకుని ఈసారి తలైవి మేకర్లు కాస్త జాగ్రత్త పడినట్లు కనిపిస్తోంది. తలైవి సినిమాకు దర్శకుడు ఎల్ విజయ్ ఎంత కీలకమో, ముగ్గురు నటులు అంత కీలకం. తలైవిగా కంగన రనౌత్, ఎంజిఆర్ గా అరవింద్ స్వామి, ఎంజీఆర్ సహచరుడు వీరప్పన్ గా సముద్రఖని. తెరమీద ఈ మూడు పాత్రల్లో ఏదో ఒకటి కనిపిస్తూనే వుంటుంది. వీరుకాక నాజర్ (కరుణానిధి), మధుబాల (జానకీ రామచంద్రన్), భాగ్యశ్రీ (సంధ్య, జయ తల్లి), తదితరులు కనిపిస్తారు.
తలైవి సినిమాలో ఆకట్టుకునే అంశం, ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏమిటంటే దర్శకుడు ఎల్ విజయ్ ప్రేక్షకులను జయలలిత కాలానికి విజయవంతంగా తీసుకెళ్లడం. అలనాటి సీన్ల రీ ప్రొడక్షన్ కానీ, సెట్ ప్రాపర్టీస్ కానీ, నటీనటుల గెటప్ లు కానీ అన్నీ కలిసి ప్రేక్షకులను ఆ కాలానికి తీసుకెళ్తాయి. ఒకసారి సినిమా ప్రారంభమయ్యాక, ప్రేక్షకులు ఆ కాలం నుంచి డిస్ కనెక్ట్ కావడం అన్నది దాదాపు అసాధ్యం.
ఇక రెండో పాజిటివ్ పాయింట్ ఏమిటంటే, జయలలిత జీవితంలో అందరికీ తెలిసిన కొన్ని మ్యాజికల్ లేదా ఎమోషనల్ మూవ్ మెంట్లను తీసుకుని, వాటిని పెర్ ఫెక్ట్ గా ప్రెజెంట్ చేస్తూ, వాటి నడుమ రెగ్యులర్ స్టోరీని రన్ చేసుకుంటూ వెళ్లాడు దర్శకుడు. ఆ మ్యాజికల్ లేదా ఎమోషనల్ మూవ్ మెంట్ వచ్చినపుడల్లా సినిమా హై అనిపిస్తుంది. సినిమా డాక్యుమెంటరీ టచ్ లో వుందనిపించినపుడల్లా, ఇలాంటి మూవ్ మెంట్ ఒకటి వచ్చేలా చూసుకున్నారు. ఇది బహుశా స్క్రిప్ట్ అందించిన విజయేంద్ర ప్రసాద్ ఐడియా కావచ్చు.
మరో మూడో పాజిటివ్ ఏమిటంటే..తలైవి పాత్ర పోషించిన కంగన, ఎంజీఆర్ గా నటించిన అరవింద్ స్వామి, వీరప్పన్ గా నటించిన సముద్రఖని. ఈ ముగ్గురూ ఆయా పాత్రల్లో జీవించేసారు. ముఖ్యంగా కంగన సీన్ సీన్ కు చూపించిన వేరియేషన్ కచ్చితంగా అభినందనలు అందుకునే విషయం. మేకప్ లో ఎప్పటికప్పుడు వేరియేషన్లు చూపిస్తూ, ఆ మేకప్ కు, ఆ వేరియేషన్ కు తగినట్లు బాడీ లాంగ్వేజ్ ను మార్చుకుంటూ కంగన శభాష్ అనిపించేసుకుంది. అరవింద్ స్వామి కి గెటప్ ఎక్కువ సెట్ చేసారు. నటన ఓకె. ఇక వీరప్పన్ పాత్ర సినిమాలో జయలలిత పాత్రతో సమానంగా వుంటుంది. అందుకే సముద్రఖని లాంటి నటుడిని తీసుకున్నారు. ఆయన తనేంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.
ఈ మూడుపాజిటివ్ పాయింట్లు తలైవి సినిమాను చూడబుల్ గా మార్చాయి. అయితే సినిమా అన్నాక నెగిటివ్ పాయింట్లు కూడా తప్పవు. తలైవి సినిమాకు ఫస్ట్ మైనస్ పాయింట్ మేకర్లకు కొన్ని కట్టుబాట్లు వున్నాయి అనిపిస్తుంది. జయలలిత సినిమా కెరీర్ మీద ఎక్కువ దృష్టిపెట్టలేదు. పొలిటికల్ గా చెప్పాల్సింది ఎక్కువ వుండడంతో, సినిమా లైఫ్ ను తగ్గించారు. ముఖ్యంగా జయలలిత అంటే తెలుగింటి అమ్మాయి అన్నంత పరిచయం మనకు. కానీ ఒక్కటంటే ఒక్క సీన్ కూడా తెలుగు సినిమాల నుంచి టచ్ చేయలేకపోయారు. అది లోపమే కచ్చితంగా. పైగా తెలుగువెర్షన్ లో అయినా చోటు ఇచ్చి వుండాల్సింది.
ఇక రెండో నెగిటివ్ పాయింట్ ఏమిటంటే జయలలితను పూర్తిగా లోప భూయిష్టమైన పాత్రలా సృష్టించారు. అంతే తప్ప ఆమెలోని కఠినత్వాన్ని, ఆమెకు నగలు, దుస్తులు, ఆస్తుల మీద వున్న మక్కువను, సినిమా రంగంలో ఆమెకున్న సన్నిహిత స్నేహాలను అస్సలు టచ్ చేయలేదు.
మూడో నెగిటివ్ పాయింట్ ఏమిటంటే, ఈ సినిమాను తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించడంతో ఎంజీఆర్ అంతిమ ఘడియలను కాస్త ఎక్కువ సేపే చిత్రీకరించారు. అవి మన ప్రేక్షకులకు కాస్త లాగ్ అనిపించవచ్చు.
మహానటి బయోపిక్ ను చూసాక ఎలా తీయాలో అన్న గైడ్ మనకు దొరికింది. కథానాయకుడు, మహానాయకుడు చూసాక ఎలా తీయకూడదో అన్న ఐడియా వచ్చింది. తలైవి చూసాక డాక్యుమెంటరీ కి ఎక్కువగా, బయోపిక్ కు దగ్గరగా ఎలా తీయాలో అన్న ఐడియా వస్తుంది.
టెక్నికల్ గా తలైవి సినిమా టాప్ ఆర్డర్ లో నిలుస్తుంది. అలనాటి సెట్ ప్రాపర్టీస్, ఆర్ట్ వర్క్ కానీ, పెర్ ఫెక్ట్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ కానీ సినిమాకు అదనపు అసెట్ లు అయ్యాయి. కానీ ఒక్కోసారి కొన్ని సీన్లు చూస్తుంటే మాత్రం కాస్త రాజీ పడ్డారు అని కూడా అనిపిస్తుంది. జయలలితకు కీలకమైన వేదనిలయం సెట్ బయట నుంచి చూస్తే మరీ సింపుల్ గా తేల్చేసారని అనిపిస్తుంది. అలాగే కొన్ని సీన్లు కూడా అలాగే అనిపిస్తాయి.
మొత్తం మీద తలైవి సినిమాను ఓ సారి చూడాలి. ఎందుకంటే మనకు మనదైన చరిత్ర పుస్తకాలు తక్కువ. చదివే ఓపిక తక్కువ. అందువల్ల బయోపిక్ లో, బయోపిక్ ల్లాంటి సినిమాలో ఎవరో ఒకరు ప్రయత్నిస్తూనే వుండాలి. ఆనాటి కాలానికి ఈ నాటి ప్రేక్షకులను తీసుకెళ్తూనే వుండాలి.
ప్లస్ పాయింట్లు
కంగన..అరవింద్..సముద్రఖని
కొన్ని మంచి సన్నివేశాలు
నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్లు
అక్కడక్కడ డాక్యుమెంటరీ టచ్
నిడివి
ఫినిషింగ్ టచ్: అరిటాకులో తమిళ భోజనం
Rating: 3/5
This post was last modified on September 10, 2021 11:48 am
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…