సమీక్ష- టక్ జగదీష్

2.75/5

148 minutes   |   Action - Drama   |   10-09-2021


Cast - Nani, Ritu Varma, Aishwarya Rajesh, Rao Ramesh, Jagapathi Babu, Daniel Balaji

Director - Siva Nirvana

Producer - Sahu Garapati, Harish Peddi

Banner - Shine Screens

Music - Thaman, Gopisundar

రైట్ పర్సన్ ఇన్ రాంగ్ ప్లేస్ అనీ, రైట్ మూవీ ఇన్ రాంగ్ టైమ్ అనీ కొన్ని పడికట్టు పదాలు వున్నాయి. టక్ జగదీష్ సినిమా అలాంటిదే. మారుతున్న కాలమాన పరిస్థితులను గమనించకుండా, ఇప్పటి జనాలకు అప్పటి సినిమాను ఇప్పటి స్టయిల్ లో పరిచయం చేస్తే ఎలా వుంటుంది అన్న ఆలోచనకు చిత్ర రూపం. దర్శకుడు త్రివిక్రమ్ ఇలాంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. 70ల్లో వచ్చిన కథాచిత్రాలను ఇప్పటి స్టార్ కాస్ట్ తో, ఇప్పటి టెక్నాలజీతో, కలర్ ఫుల్ గా తీసి చూపించడం. కానీ ఇక్కడ ఓ షరతు వుంది. అప్పటి కథ చిత్రాల్లో ఇప్పటి జనాలకు నచ్చే విధంగా తీయడం అన్నది.

ఇప్పటి ప్రేక్షకులకు కావాల్సింది ఎంటర్ టైన్ మెంట్. అదే ఏ జోనర్ సినిమా అయినా కాస్త ఎంగేజింగ్ గా వుంటూ ఎంటర్ టైన్ మెంట్ అందించడం కీలకం. కానీ దర్శకుడు శివనిర్వాణ అలా కాకుండా మరో రూట్ లో వెళ్లారు. 70ల్లో వచ్చిన పల్లెటూరు కక్షలు, కుటుంబాల నేపథ్యంలో వచ్చిన కథలను ఇప్పుడు చూపించాలనుకున్నారు.

కానీ ఇప్పటి జనాలకు కావాల్సిన అసలు సరుకు ఎంటర్ టైన్ అన్నది శివ నిర్వాణ విస్మరించారు. అక్కడే తప్పులో కాలేసారు. టక్ జగదీష్ సినిమా అవుట్ అండ్ అటు ఫ్యామిలీ సెంటిమెంట్ కమ్ ఎమోషన్స్ కమ్, త్యాగాలు కమ్..స్వార్థాలు కమ్..ఇంకా ఇంకా వున్న సినిమా. కానీ ఎంటర్ టైన్మెంట్ అన్నది కలికంలోకి కూడా కనిపించదు. అక్కడే మిస్ ఫైర్ అయింది.

టక్ జగదీష్ సినిమా బాగాలేదు అనలేం. ఎందుకంటే ఆ లైన్ ను, ఆ సబ్జెక్ట్ ను అలాగే డీల్ చేయాలి. అలాగే తీయాలి. తీసారు. కానీ ఇప్పటి జనాలకు నచ్చుతుందా అంటే మాత్రం అనుమానం. ఎందుకంటే ఈ బాపతు వ్యవహారాలు ఇప్పటికే టీవీ సీరియళ్లుగా మారి ఇంటింటా రోజూ సాయంత్రాలు ఘోషిస్తూనే వున్నాయి. ఎటొచ్చీ వాటిల్లో సాగదీపుడు ఎక్కువగా వుంటుంది. టక్ జగదీష్ స్ట్రిక్ట్ టు ది పాయింట్ వుంటుంది.

టక్ జగదీష్ కథ ఏమిటంటే కొంచెం ఎక్కువే చెప్పాలి. భూదేవి పురం అనే ఊర్లో ఓ మోతుబరి (నాజర్) కుటుంబం. ఇద్దరు కొడుకులు జగదీష్, బోసు (నాని, జగపతి బాబు), కూతుళ్లు (రోహిణి ఎక్సెట్రా), అల్లుళ్లు (రావు రమేష్, నరేష్) ఇలా వుంటుంది వ్యవహారం. అదే ఊరిలో ఓ దుర్యోధనుడు లాంటి దుష్టుడు వీరేంద్ర (బాలాజీ). భూదేవి పురంలో పది ఎకరాలు వున్నా, పావు ఎకరం కోసం అన్న దమ్ములు కొట్టేసుకుంటారు. తరచు భూతగాదాలే. ఇలాంటి నేపథ్యంలో మోతుబరి మరణించగానే బోసు అనే పెద్ద కొడుకు విలన్ బాలాజీ మాటలు విని, తోడబుట్టిన వాళ్లందరినీ బయటకు తోసి, ఆస్తి మొత్తం స్వంతం చేసుకుంటాడు. తమ్ముడు జగదీష్ ఎమ్మార్వోగా అదే ఊరు వస్తాడు. భూతగాదాలు లేని భూదేవిపురం ను చూడాలన్న తన తండ్రి ఆశయం కోసం పని చేయడం ప్రారంభిస్తాడు. ఇది సహజంగానే వీరేంద్రకు నచ్చదు. అప్పుడు ఏం జరిగింది అన్నది మిగిలిన సినిమా. అన్నట్లు ఈ సినిమాలో వీఆర్వో గుమ్మడి వరలక్ష్మి (రీతూ వర్మ) అనే హీరోయిన్ క్యారెక్టర్ కూడా వుంది అని గమనించగలరు.

ఇంత కథ చెప్పినా ఇందులో వున్న అనేక ట్విస్ట్ లు చెప్పలేదు. అసలు సిసలు వ్యవహారం అంతా అక్కడే వుంది. అలాగే తన స్వార్ధం కోసం మేనకోడలి ని విలన్ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయడం, అక్కడ ఆమెను రాచి రంపాన పెట్టడం, ఆమె ఎప్పుడు సైగ చేస్తే అప్పుడు వెళ్లి రక్షించాలని హీరో వేచి చూడడం వంటి ఘట్టాలు కూడా వున్నాయి.

ముందుగా పాజిటివ్ పాయింట్లు మాట్లాడేసుకుందాం. నిన్ను కోరి, మజిలీ సినిమాలు అందించిన దర్శకుడు శివనిర్వాణ దగ్గర విషయం లేదు అని ఎవ్వరూ అనుకోరు. విషయం వుంది కాబట్టే, ఈ 70వ దశకం కథలో దర్శకత్వ లోపాలు ఎక్కడా లేకుండా తీసారు. కానీ స్క్రిప్ట్ ఎలా వుంది, ఈ కాలపు జనానికి నచ్చుతుందా లేదా అన్నది మాత్రం ఆలోచించలేదు. నటన రాబట్టుకోవడం, సీన్లను కలర్ ఫుల్ గా చిత్రీకరించడం, ఓ ఫ్యామిలీ సినిమాగా మలిచే ప్రయత్నం చేయడం ఇవన్నీ శివనిర్వాణ సక్సెస్ ఫుల్ గా చేసారు. గ్రామాల్లోకనిపించే సంఘటనలను బాగా తెరపైకి తీసుకువచ్చారు. ఎక్కడా లాజిక్ మిస్ కాలేదు.

అలాగే నాని తొలిసగంలో కాస్త కొత్తగా ట్రయ్ చేద్దామని ప్రయత్నించారు. ద్వితీయార్థానికి వచ్చేసరికి తనను నాచురల్ స్టార్ అంటారన్నది గుర్తు తెచ్చుకుని, తన స్టయిల్ లోకి వచ్చేసారు. జగపతి బాబు, బాలాజీ ల వారి పాత్రలకు న్యాయం చేసారు. రీతూ వర్మకు పాత్రకు న్యాయం, అన్యాయం వంటివి పెద్దగా పట్టవు. విలన్ గా బాలాజీ ఓకె కానీ, ఆ పాత్రకు మరో సరైన నటుడిని ఎవరినైనా వెదకాల్సింది. అలాగే తల్లి పాత్రకు కూడా. ఎంతమంచి నటి అన్నదికాదు. మన ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారా లేదా అన్నది. చూడాలి రాధిక లాంటి నటి అయితే వేరుగా వుండేది. లెజెండ్ సినిమా తరువాత జగపతి బాబు నుంచి ఇంత తక్కువ నటన చూడడం ఇదే తొలిసారి. రావురమేష్ ను చూస్తే జాలేస్తుంది.

సినిమా కలర్ ఫుల్ గా వుంది. మంచి లోకేషన్లు, మంచి సెట్ లు, ఖర్చు క్లియర్ గా కనిపిస్తోంది. నిర్మాతల సైడ్ లోపం లేదని, చెక్కులపై సంతకాలు విరివిగానే పెట్టారని అర్థం అయిపోతోంది.

థమన్ అందరికీ మంచి పాటలు ఇవ్వడం అన్నది అరుదుగా జరుగుతుంది. అందుకే ఇందులో పాటల కన్నా, గోపీసుందర్ నేపథ్య సంగీతం బాగుంటుంది.

ఇక్కడితో ప్లస్ పాయింట్లు పరిసమాప్తం.

నెగిటివ్ పాయింట్లకు వస్తే అసలు ఈ తరహా కథ ఈ కాలంలో చెప్పాలనుకోవడమే పెద్ద నెగిటివ్. ఇక చెప్పాలి అని డిసైడ్ అయిన తరువాత 70 లు, 80ల మాదిరిగా కామెడీ ట్రాక్ సమాంతరంగా రన్ చేసేసి వుండాల్సింది. లేదా ఏదో విధంగా సెట్ చేసి వుండాల్సింది.

సినిమాలో కీలకమైన ట్విస్ట్ ను సరిగ్గా వాడుకోలేకపోయారు. సెకండాఫ్ లో అస్సలు రిలీఫ్ కానీ ఓ డ్యూయట్ అన్నది కానీ సెట్ చేసుకోలేకపోయారు. తలుచుకుంటే ద్వితీయార్థంలో ట్రిమ్ చేసుకునే అవకాశాలు ఎక్కువే వున్నాయి. అలాగే డ్యూయట్ సెట్ చేసుకునే అవకాశాలు కూడా వున్నాయి. వాటిని కూడా వదిలేసారు.

గతంలో వచ్చిన చినబాబు, శివరామరాజు సినిమాలను గుర్తు చేసిన ఈ సినిమా నాని కప్ ఆఫ్ టీ మాత్రం కాదు. ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ చేయాలని అనుకోవడం తప్పు కాదు. కానీ తనకు అచ్చి వచ్చిన ఎంటర్ టైన్ మెంట్ ను వదిలేసుకోవడం మాత్రం ముమ్మాటికీ తప్పే.

మజిలీ, నిన్నుకోరి లాంటి యూత్ ఫుల్ ఎమోషన్లు అందించినా, అండర్ కరెంట్ గా సటిల్డ్ ఫన్ ను మిస్ కాని దర్శకుడు శివనిర్వాణ ఈసారి ఫ్యామిలీ ఎమోషన్లు నమ్ముకున్నారు, ఫన్ ను వదలుకున్నారు. అదే టక్ జగదీష్ లోపం.

ప్లస్ పాయింట్లు
చిత్రీకరణ
నిర్మాణ విలువలు
నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్లు
ఔట్ డేటెడ్ లైన్

ఫినిషింగ్ టచ్: ‘టక్’ చెదిరిపోయింది

Rating: 2.75/5