సమీక్ష- కలర్ ఫొటో

2.5/5

140 min   |   Drama-Romance   |   23-10-2020


Cast - Suhas, Chandini Chowdary, Sunil, Viva Harsha

Director - Sandeep Raj

Producer - Sai Rajesh Neelam, Benny Muppaneni

Banner - Amrutha Productions

Music - Kala Bhairava

కులాల కోసం, అంతస్థుల కోసం ప్రేమికులను విడదీసిన సినిమాలు అనేకం చూసాం. రంగు తక్కువని, అందం తక్కువైందని ప్రేమికలను విడదీసే సినిమానే కలర్ ఫొటో. బహుశా అమెరికాలో తెలుపు-నలుపు బేధాలు, మన దగ్గర పెయిర్ అండ్ లవ్లీ లాంటి ప్రకటనలు చూసి ఓ ఐడియా వచ్చి, కథ అల్లే ప్రయత్నం చేసి వుంటారు కలర్ ఫొటో మేకర్లు. అయితే ఇలా పాయింట్ దొరికితే సరిపోదు. సరిపడా సీన్లు రాసుకోవాలి. లేదూ అంటే రాసుకున్న సీన్లనే చెక్కుకుంటూ వెళ్లాలి. అప్పుడు నచ్చిన వాళ్లు ‘భలే తీసాడ్రా’ అనే అన్నా అంటారు. నచ్చని వాళ్లు మరీ ‘ఎక్కువ సాగదీసాడు’ అని అన్నా అంటారు. కలర్ ఫోటోకు దక్కే కాంప్లిమెంట్ లు ఇవే.

ఇంతకీ ఏమిటీ కలర్ ఫొటో…మచిలీపట్నం లాంటి ఊళ్లో ఒక పక్క పాలు అమ్ముకుంటూ, మరోపక్క ఇంజనీరింగ్ చదువుతూ, జీవితం మీద బోలెడు ఆశలు పెట్టుకున్న కుర్రాడు జయ కృష్ణ (సుహాస్). అదే ఊరిలో పోలీస్ ఆఫీసర్ (సునీల్) చెల్లెలు దీప్తి వర్మ(చాందినీ). పోలీస్ ఆఫీసర్ రామరాజు కు అందం మీద ఆసక్తి. ప్రేమ అంటే పట్టనంత కోపం. తనకు ఎలాగూ అందం తక్కువ కనీసం కుటుంబంలోనైనా అందం వున్నవాళ్లు వుండాలనుకునే తరహా. ఇలాంటి నేపథ్యంలో నల్లగా వున్నా కృష్ణ వ్యక్తిత్వం నచ్చి అతన్ని ప్రేమిస్తుంది దీప్తి. ఆ తరువాత ఏం జరిగింది అన్నది మిగిలిన సినిమా.

వర్ణవివక్ష అంటే కుల వివక్ష కాదు, రంగు తేడా. ఈ సబ్జెక్ట్ మీద అప్పుడెప్పుడో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ శారద అత్యంత నల్లగా వుంటుంది. ఆ తరువాత ఈ రంగు పాయింట్ సినిమాలు వచ్చింది దాదాపు లేనట్లే. అలాంటి పాయింట్ బేస్ చేసుకుని వచ్చిన కలర్ ఫోటో సినిమాలో కీలకమైనవి రెండు పాయింట్లు.

ఒకటి కలర్ తక్కువ అని అడుగు అడుగునా అపహాస్యాలు. అదే రంగు తక్కువ కారణంగా ప్రేమకు అడ్డంకులు. అయితే సినిమాలో రెండో పాయింట్ ను డీల్ చేసింది చాలా తక్కువ. మొదటి పాయింట్ ను డీల్ చేసిందే ఎక్కవ. అది కూడా ఎలా డీల్ చేసారు. రెండు మూడు అంచెలుగా. మొదట్లో హీరోకి తన రంగు తక్కువ మీద తనకే కాస్త చిన్న చూపు. రంగు పెంచుకుందామనే ప్రయత్నం. అదే రంగును అవమానపరుస్తూ కాలేజీలో సంఘనటలు. దాంతో ఎదురుతిరిగేవైనం. వీటితో పాటే ప్రేమ వ్యవహారం.

కలర్ ఫోటో సినిమా చిత్రంగా వుంటుంది. ఒక్కోసారి కొత్త దర్శకుడు సందీప్ రాజ్ కు విషయం బాగానే వుంది. మంచి డైలాగులు పడ్డాయి. మంచి పాయింట్ తో సీన్ ను భలే లేపాడు అనిపిస్తుంది. ఒక్కోసారి సరైన పాయింట్ ను సరిగ్గా ఎలివేట్ చేయకుండా వదిలేసాడు అనిపిస్తుంది. ఇంకోసారి మరీ సాగదీస్తున్నాడు, సరైన సీన్లు రాసుకుంటే మరింత బాగుండేదిగా అనిపిస్తుంది. ఇలా మిక్స్ డ్ ఫీలింగ్ ఇస్తుందీ కలర్ ఫొటో.

కలర్ ఫొటో సినిమా ఎత్తుగడ నెమ్మదిగా వుంటుంది. చాలా సేపు సినిమా కాస్త సాగుతున్నట్లే అనిపిస్తుంది. ప్యాడింగ్ కోసం, సినిమా నడక కోసం రాసుకున్న నాటకాలు, డ్యాన్స్ లు, ఇలాంటి సీన్లు ఏవీ అంత కొత్తగా, గొప్పగా ఏమీ అనిపించవు. సినిమా సరిగ్గా ఇంటర్వెల్ గ్యాప్ కాస్త దూరంలో వుంది అనగా ఆసక్తి కరంగా మారుతుంది. హీరో హీరోయన్లకు నడుమ రాసుకున్న సీన్లు కానీ, డైలాగులు కానీ బాగుండడంతో అవి రక్తికట్టి అలరిస్తాయి. పైగా సహజంగా అనిపిస్తాయి.

మళ్లీ సినిమా ద్వితీయార్థంలోకి ప్రవేశించాక, కాస్త గ్యాప్ ఫిల్లింగ్ వ్యవహారం తొంగి చూస్తుంది. కానీ అంతలోనే సినిమా అసలు కథలోకి, కీలకమైన ఘట్టాల్లోకి చేరుకుంటుంది. అక్కడి నుంచి ముగింపు వరకు ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగుతుంది. అయితే ఇక్కడ కూడా ఇంకా బాగా చేయగలిగిన అవకాశం వుండి కూడా దర్శకుడు వదులుకున్నాడు అనిపిస్తుంది. ప్రేమ విఫలమైన అమ్మాయి ఆనందం, ఆవేదన, విషాదం, నవ్వు, ఏడుపు ఇలా అన్ని భావాలు వదిలేసుకున్న అతీతమైన స్థితిలోకి వెళ్లినట్లు ఆరంభంలోనే చూపిస్తాడు. కానీ అలా వెళ్లిన సన్నివేశం మాత్రం సినిమాలో వుండదు. నిజానికి ఎంత కీలకమైన సన్నివేశం అది. కానీ చివర్లో మళ్లీ ఘనీభవించిన మంచు కరిగిపోయినట్లు, హీరో చొక్కాకు వేసిన దండ చూసి ఘొల్లుమంటుంది. మొదటి సన్నివేశం చూపించి వుంటే, అలాగే ఈ మలి సన్నివేశాన్ని మరింత బలంగా చూపించి వుంటే సినిమా స్థాయి వేరుగా వుండేది. మొదటి సన్నివేశం ముందుగా చూపిస్తే సినిమాలో సస్పెన్స్ పోతుందని భావించి వుంటే చివర్లో మలి సన్నివేశం చూపించినపుడైనా ఆ విజువల్స్ యాడ్ చేసి వుండాల్సింది.

హీరోయిన్ స్వంత ఊరికి వచ్చినపుడు రోడ్డుపై తారసపడిన ప్రేమికులకు తన కథను చెప్పే విధంగా సినిమాలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లారు. కానీ అదే కొంత మైనస్ అయింది. మధ్య మధ్యలో వెనక్కు తెచ్చి, సీరియస్ కథను, హీరోయిన్ చులాగ్గా చెబుతున్న భావన కలిగించారు. అలా కాకుండా నేరుగా ఫ్లాష్ బ్యాక్ లోకి ఏదో విధంగా తీసుకెళ్లి వుంటే కాస్త సీరియస్ నెస్ వుండేది.

హీరో స్నేహితుడు (వైవా హర్ష) కు శవాల్ని చూస్తే ఫ్రీజ్ అయిపోయే సమస్యను ముందు జోవియల్ గా చూపించి, క్లయిమాక్స్ లో ఎమోషనల్ టచ్ ఇవ్వడం బాగుంది. కానీ అక్కడ ఆ సీన్ ను మరింత సమర్థవంతగా డీల్ చేసి వుంటే బాగుండేది. కానీ అలా జరగలేదు. కోన్నిసీన్లను మాత్రం అద్భుతంగా డీల్ చేసాడు దర్శకుడు. మేకను కోస్తుంటే అరచి చెవిలో చెప్పింది…నేను మేకను కాదు దూడను..అన్న సీన్ కానీ, రైల్లో వెళ్తున్న వందలాది మందికి తెలియదు, వారు ప్రయాణిస్తున్న రైలు రెండు మృతదేహాల మీద నుంచి వెళ్తోంది అని చెప్పే సీన్ కానీ, ఇంకా మరో ఒకటి రెండు సీన్లు దర్శకుడి ఆలోచనను, స్టామినా ను చెబుతాయి.

అయితే కలర్ ఫొటో నాలుగు ప్లస్ పాయింట్ల వల్ల ఈ మైనస్ లను అధిగమించి, ఫరవాలేదు అనిపించుకుంటుంది. ఒకటి దర్శకుడు రాసుకున్న డైలాగులు. రెండు కాల భైరవ అందించిన నేపథ్య సంగీతం. మూడు సినిమాటోగ్రఫీ, సహజమైన లోకేషన్లు. నాలుగు సుహాస్, సునీల్, చాందిని, హర్ష ల నుంచి రాబట్టుకున్న నటన. కానీ వీటికి తోడు మరికొన్ని బలమైన సన్నివేశాలు వున్నా, లేదా స్లో టేకింగ్ అనే అపప్రధ రాకుండా వున్నా సినిమా మరో లెవెల్ లో వుండేది. అయితే చిన్న పాయింట్ చుట్టూ కథ అయితే అల్లుకున్నారు కానీ కథకు సరిపడా సన్నివేశాలు దర్శకుడు అల్లుకోలేకపోవడం సినిమాను అన్ని విధాలా శహభాష్ అనేందుకు వీలు లేకుండా చేసింది.

కాలభైరవ నేపథ్య సంగీతం ఆ స్థాయిలో లేకుంటేనా? అన్న అనుమానం కచ్చితంగా కలిగించే రేంజ్ లో వుంది. మచిలీపట్నం చుట్టుపక్కల లోకెషన్లు బాగా వడిసిపట్టారు. తెలుగులో నాచురల్ లోకేషన్లలో లవ్ స్టోరీలు రావడం మానేసాయి. అన్నీ హైదరాబాద్ చుట్టూ గింగిరాలు కొట్టేవే. సినిమాకు బడ్జెట్ అవరోథం మరీ ఎక్కువగా కనిపించదు కానీ, ఒకటి రెండు చోట్ల అనిపిస్తుంది. మొత్తం మీద కలర్ ఫోటోను మరికాస్త జాగ్రత్తగా డెవలప్ చేసి వుంటే బాగుండేది.

ఫినిషింగ్ టచ్..ఫోకస్ సరిపోలేదు.

రేటింగ్ – 2.5/5