దసరా పండగ అయిపోయింది. సెలవులు పూర్తి చేసుకుని స్కూళ్ళు, కాలేజీలు తెరిచేశారు. ఆఫీసులకు అన్ని హాలిడేస్ లేకపోయినప్పటికీ పిల్లల కోసం తీరిక చేసుకున్న పెద్దలు తమ వృత్తుల్లో బిజీ అయిపోయారు. అదే విధంగా బాక్సాఫీస్ కూడా పది రోజుల పాటు పండగ సందడి చూసి ఇవాళ్టి నుంచి రిలాక్సవుతోంది. ఇక సినిమాల ప్రోగ్రెస్ రిపోర్ట్ విషయానికి వస్తే వాటి పెర్ఫార్మన్స్ ఎలా ఉందో చూద్దాం. ముందుగా 2024 దసరాకు మైనస్ పాయింట్ గా నిలిచిన ఒక అంశం గురించి చెప్పాలి. అదే టయర్ 1, 2 స్టార్ హీరోల సినిమా ఒక్కటీ లేకపోవడం. దీని వల్ల థియేటర్లు కిక్కిరిసిపోకుండా మిశ్రమంగా కనిపించాయి.
జూనియర్ ఎన్టీఆర్ దేవర మూడో వారంలో ఉంది కనక దాన్ని పరిగణనలోకి తీసుకోకపోయినా శని ఆదివారాలు అన్ని ప్రధాన కేంద్రాల్లో అత్యధిక ఆక్యుపెన్సీని నమోదు చేయడం విశేషం. పదిహేడో రోజు రాజమౌళి మాత్రమే నమోదు చేసే నెంబర్లు దేవరకు కనిపించడం అతిశయోక్తి కాదు. ఇక అసలు మ్యాటర్ కొద్దాం. గోపీచంద్ ‘విశ్వం’ టాక్ తో సంబంధం లేకుండా మాస్ అండతో డీసెంట్ వసూళ్లు రాబట్టింది కానీ టీమ్ కోరుకున్న స్థాయిలో కాదనేది ట్రేడ్ రిపోర్ట్. వంద శాతం రికవరీ అయ్యిందని నిర్మాతలు చెబుతున్నారు కానీ వసూళ్లకు సంబంధించి క్లారిటీ రావాలంటే ఈ రోజు రేపు నమోదయ్యే డ్రాప్ విశ్లేషించుకోవాలి.
సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ నిరాశపరిచింది. కంటెంట్ లోని ఎమోషన్, ప్రమోషన్ రెండూ ఆడియన్స్ ని మెప్పించలేదన్నది చేదు వాస్తవం. సుహాస్ ‘జనక అయితే గనక’కు పర్వాలేదనే టాక్ వచ్చినా నిర్మాత దిల్ రాజు ఎలివేట్ చేసిన రేంజులో మేజిక్ చేయలేకపోతోంది. ఉన్నంతలో విశ్వం తర్వాత రెండో ప్లేస్ దీనిదే. డబ్బింగ్ చిత్రాల వరస చూస్తే ‘వేట్టయన్ ది హంటర్’ ఓ మోస్తరుగా లాగడం బయ్యర్లకు కొంత రిలీఫ్. కానీ జైలర్ మానియాలో సగం కూడా లేకపోవడానికి కారణం టాక్ పూర్తి పాజిటివ్ టాక్ రాకపోవడమే. ఇక ‘మార్టిన్’ గురించి మౌనంగా ఉండటం ఉత్తమం. అలియా భట్ ‘జిగ్రా’ ఫ్లాపుల లిస్టులోకి చేరిపోయింది. అంతిమంగా చూసుకుంటే యునానిమస్ గా దేనికీ హిట్ టాక్ రాకపోవడంతో దసరా విన్నర్ గా దేవరనే నిలిచిందనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం.