జైలర్ పోలిక కరెక్ట్ కాదు

రజనీకాంత్ ‘వేట్టయన్ ది హంటర్’ తెలుగు వెర్షన్ కు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. పండగ సెలవుల్లో వచ్చిన మొదటి సినిమాగా పొందిన అడ్వాంటేజ్ తో పాటు పదో తేదీ సోలో రిలీజ్ కావడం బాగా కలిసి వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ తొలుత నెమ్మదిగా ఉన్నప్పటికీ క్రమంగా బుకింగ్స్ ఊపందుకోవడం బుక్ మై షో ట్రెండ్స్ లో కనిపించింది. అయితే టాక్, రివ్యూస్ మిశ్రమంగా రావడం గమనించాల్సిన విషయం.

బూటకపు ఎన్కౌంటర్లలో అమాయకులు బలవుతున్నారని దర్శకుడు టీజె జ్ఞానవేల్ ఒక సీరియస్ పాయింట్ చెప్పాలనే ప్రయత్నం బలంగా చేశారు. తొందరపాటు చర్యల పర్యవసానాన్ని చూపించారు. ఈ క్రమంలో రజనీకాంత్ ఇమేజ్, మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని నాలుగు ఫైట్లు, రెండు పాటలు అవసరం లేకపోయినా పెట్టారు. అయితే జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న రజనీకాంత్ సోలో మూవీ కావడంతో అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.

ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఒకటుంది. అన్నీ జైలర్లు కాలేవు. వేట్టయన్ రెగ్యులర్ కమర్షియల్ జానర్ కాదు. ఆ మాటకొస్తే జై భీమ్ లాంటి అవార్డు విన్నింగ్ మూవీ తీసిన జ్ఞానవేల్ రజనీకాంత్ కోసం చాలా కాంప్రోమైజ్ అయిపోయి మాస్ అంశాలను జొప్పించారు. ఇవన్నీ మార్కెట్ లెక్కలకు అనుగుణంగా రజని సలహా మేరకు పెట్టినవే. అందుకే మాస్, మెసేజ్ రెండూ బాలన్స్ చేసే క్రమంలో టీజె జ్ఞానవేల్ తడబడిన వైనం సెకండాఫ్ లో స్పష్టంగా కనిపించింది.

ఇంకా నయం. రెండో సగంలో అక్కర్లేని ఎలివేషన్లు, ఐటెం సాంగ్ తో చిరాకు పెట్టించలేదు. రానా ఎంట్రీ నుంచి క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఊహించేలా ఉన్నప్పటికీ మరీ విసుగు రాకుండా డిజైన్ చేసుకున్న స్క్రీన్ ప్లే వేట్టయన్ ని మరీ బ్యాడ్ కాకుండా కాపాడింది. ఇంకొంచెం బెటర్ గా తీసుండాల్సిందన్న కామెంట్ ని కొట్టి పారేయలేం. ఇతర బాషల సంగతి ఎలా ఉన్నా తమిళంలో మాత్రం పెద్ద హిట్టయ్యేలా ఉంది. విజయ్ గోట్ నే అంతగా ఆదరించినప్పుడు ఇక వేట్టయన్ సంగతి వేరే చెప్పాలా.