తెలుగు సినిమాలకు బిగ్గెస్ట్ షార్ట్ సీజన్ అంటే సంక్రాంతినే. ఆ టైంలో పోటీ ఎలా ఉంటుందో తెలిసిందే. ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఏ సినిమాలు రిలీజవుతాయనే విషయంలో కొంత ఉత్కంఠ నెలకొంటుంది. ఇందుకు ఆరు నెలల ముందే రేసు మొదలవుతుంది. కొన్ని సినిమాలు రేసులోకి వస్తాయి. వాటిలో కొన్ని తప్పుకుంటాయి. కొత్తవి యాడ్ అవుతాయి.
ఇలా చివరికి నాలుగైదు సినిమాలు చివరికి రేసులో నిలుస్తాయి. వచ్చే సంక్రాంతికి చాలా ముందుగా రిలీజ్ ఖాయం చేసుకున్న సినిమా మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’నే. నెల ముందు వరకు ఆ చిత్రం సంక్రాంతికి రావడం ఖాయం అన్నట్లే ఉంది పరిస్థితి. కానీ ఈ మధ్య కథ మారిపోయింది.
‘విశ్వంభర’ టీం సైలెంట్ అయిపోయింది. షూట్ పూర్తి కావచ్చినా.. భారీగా విజువల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడ్డ ప్రి ప్రొడక్షన్ పనులు సమయానికి పూర్తయ్యేలా కనిపించకపోవడంతో ఈ చిత్రం వాయిదా పడుతుందనే ప్రచారం మొదలైంది.
అదే సమయంలో క్రిస్మస్‌కు అనుకున్న రామ్ చరణ్ సినిమా ‘గేమ్ చేంజర్’ సంక్రాంతికి వాయిదా పడుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. క్రిస్మస్ అని బల్లగుద్ది చెప్పాక లేటెస్ట్ పోస్టర్లలో ఆ మేరకు రిలీజ్ డేట్ ప్రకటించలేదు. ‘విశ్వంభర’ సంక్రాంతికి రాని పక్షంలో ఈ చిత్రాన్ని ఆ పండక్కి వేసేద్దామని దిల్ రాజు భావిస్తున్నారు.
దీని వల్ల సినిమాకు బాక్సాఫీస్ దగ్గర అడ్వాంటేజ్ ఉంటుందని.. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇంకొంత సమయం లభిస్తుందని ఆయన భావిస్తున్నారు. కానీ ఈ గందరగోళానికి ఎప్పుడు తెరపడి క్లారిటీ వస్తుందో అని మెగా అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
క్రిస్మస్, సంక్రాంతి.. ఇలా షార్ట్ టైంలో రెండు భారీ మెగా మూవీస్ చూడాలని ఆశపడ్డ వారికి ఈ ప్రచారం కొంత నిరాశను కలిగిస్తోంది. కానీ చిరు సినిమా ఎప్పుడు రిలీజవుతుందన్న దాని కంటే ఎంత బాగా ఉంటుందన్నదే కీలకం కాబట్టి ‘విశ్వంభర’ వాయిదా పడ్డా అభిమానులు అర్థం చేసుకోగలరు.