రాజమౌళి బాటలోనే కొరటాల శివ

గత డిజాస్టర్ నుంచి పూర్తిగా కోలుకుని దేవర బ్లాక్ బస్టర్ సక్సెస్ తో రెట్టింపు ఉత్సాహంలో ఉన్న దర్శకుడు కొరటాల శివ పార్ట్ 2 కోసం కాస్త ఎక్కువ సమయం పట్టేలా ఉండటం వల్ల వేరే హీరోతో ఇంకో సినిమా చేస్తాడేమోననే అనుమానం అభిమానుల్లో రావడం సహజం.

ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 పూర్తి చేయాలి. జనవరి నుంచి ప్రశాంత్ నీల్ ప్యాన్ ఇండియా మూవీ మొదలవుతుంది. 2025 వీటికే అయిపోతుంది. అలాంటప్పుడు దేవర 2కి టైం ఇవ్వడం కష్టం. మరి అప్పటిదాకా కొరటాల ఖాళీగా ఉంటాడా అంటే ఆయన సన్నిహిత వర్గాల మేరకు ఏం చేయాలనే దాని మీద పూర్తి క్లారిటీతో ఉన్నారట.

దాని ప్రకారం కొరటాల శివ నెక్స్ట్ కమిట్ మెంట్ ఇంకా ఎవరికీ ఇవ్వలేదు. బాహుబలి 1 రిలీజయ్యాక రాజమౌళి కేవలం బాహుబలి 2 మీదే దృష్టి పెట్టారు. దాని వల్ల మరింత అద్భుతమైన ఫలితం వచ్చింది. అదే తరహాలో కొరటాల శివ కూడా కొన్ని నెలలు విశ్రాంతి తీసుకుని దేవర 2 స్క్రిప్ట్ మార్పులు, ప్రీ ప్రొడక్షన్ పనులు, అదనపు క్యాస్టింగ్ తదితర వ్యవహారాలు చూసుకోబోతున్నారట. అంటే సీక్వెల్ విడుదలయ్యే దాకా ఇంకే డైవెర్షన్లు ఉండవన్న మాట. ఒక కోలీవుడ్ స్టార్ హీరో వారసుడితో ప్రాజెక్టు వుండొచ్చనే ప్రచారం ప్రస్తుతానికి ఉత్తుత్తిదేనని అంటున్నారు. సో దేవర 2కి గ్రౌండ్ సెట్ అవుతోంది.

ఒక ఇంటర్వ్యూలో కొరటాల శివ చెప్పిన ప్రకారం దేవర 2 అంచనాలను మించే విధంగా జూనియర్ ఎన్టీఆర్ ని వంద శాతం వాడుకునే స్థాయిలో ఉండబోతోంది. పార్ట్ 1లో వదిలేసిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇందులోనే దొరకాలి. బాబీ డియోల్ పాత్ర ఎంట్రీతో పాటు జాన్వీ కపూర్ కు సంబంధించిన ఎపిసోడ్, సైఫ్ అలీ ఖాన్ మీద రివెంజ్, సముద్రంలో ఆస్థి పంజరాలు ఇలా బోలెడు విషయాలు పెండింగ్ లో ఉండిపోయాయి. ఇప్పటిదాకా కేవలం టయర్ 1 స్టార్ హీరోలతోనే పని చేసిన కొరటాల శివ ఇకపై కూడా అదే ఫాలో కావాలని నిర్ణయించుకున్నారట. సో కొరటాల ఎంచుకునేది ఏదైనా క్రేజీగానే ఉండబోతోంది.