హాలీవుడ్ సినిమాల్లో జోకర్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. హీరోయిజం, విలన్ క్యారెక్టరైజేషన్ లో ఒక కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన మూవీగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కించుకుని 9 వేల కోట్ల వసూళ్లు సాధించడం ఒక రికార్డు. రాకాసి బల్లులు, సూపర్ మ్యాన్లు, అవెంజర్లు లాంటి హంగులు లేకుండా ఫక్తు కమర్షియల్ ఫార్మెట్ లో ఆలోచింపజేసే విధంగా జోకర్ తీయడం కారుడు గట్టిన విమర్శకులను సైతం మెప్పించింది. హైదరాబాద్ తో సహా ఇండియాలోని ప్రధాన నగరాల్లో జోకర్ వారాల తరబడి హౌస్ ఫుల్ షోలతో విజయవంతంగా ప్రదర్శింపబడింది. ఇదంతా 2019 కథ. ఆరేళ్ళు గడిచిపోయాయి.
ఇప్పుడు సీక్వెల్ వచ్చింది. జోకర్ ఫోలీ ఆ ద్యు పేరుతో పార్ట్ 2 రిలీజ్ చేశారు. రిలీజ్ ముందు వరకు దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా టైటిల్ రోల్ పోషించిన హీరో జోక్విన్ ఫీనిక్స్ అభిమానులు విపరీతంగా ఎదురు చూశారు. అయితే వాళ్ళ ఆశలను నీరు గారుస్తూ జోకర్ 2 తీవ్రంగా నిరాశ పరిచింది. మొదటి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో ఏ అంశాలు దోహదం చేశాయో వాటిని విస్మరించి ఎమోషన్లు, అవసరం లేని పాటలను ఎక్కువగా జొప్పించడంతో ఇంటర్వెల్ కే లేచి వెళ్లిపోదామా అనిపించే స్థాయిలో జోకర్ 2 ఆడియన్స్ సహనాన్ని ఓ రేంజులో పరీక్షించింది.
మానసిక చికిత్స కోసం పిచ్చాసుపత్రిలో ఉన్న హీరోలో మరో పర్సనాలిటీ ఉందని నిరూపించాలని అతని లాయర్ ప్రయత్నిస్తూ ఉంటుంది. నేరం రుజువైతే ఉరిశిక్ష ప్రమాదం ఉండటంతో వాదనలు సిద్ధం చేసుకుంటుంది. అయితే జోక్విన్ చేసే పనులు దానికి సహకరించవు. తర్వాత ఏమైందనేది తెరమీద చూడాలి. మనిషిలో అంతర్గతంగా ఉండే శాడిస్ట్ మెంటాలిటీని జోకర్ 1లో అద్భుతంగా ఆవిష్కరించారు. కానీ ఇది సెకండ్ పార్ట్ లో పూర్తిగా మిస్సయ్యింది. విపరీతమైన ఓపిక, జోక్విన్ ఫీనిక్స్ మీద అంతులేని ప్రేమ ఉంటే తప్ప జోకర్ 2ని చివరి దాకా థియేటర్లో కూర్చుని భరించడం మహా కష్టం.