విశ్వం భుజాల మీద నలుగురి బరువు

ఈ శుక్రవారం అక్టోబర్ 11 విడుదల కాబోయే విశ్వం మీద భారీ అంచనాలేం లేవు కానీ పండగ సీజన్ లో మంచి ఎంటర్ టైనర్ అవ్వొచ్చనే నమ్మకం అభిమానుల్లో ఉంది. ఫ్యాన్స్ కన్నా ఎక్కువగా నలుగురికి ఖచ్చితంగా హిట్ ఇవ్వాల్సిన బాధ్యత విశ్వం మీద ఉంది. మొదటగా చెప్పుకోవాల్సిన పేరు దర్శకుడు శీను వైట్ల.

అవుట్ అఫ్ ది ఫామ్ గా కొన్నేళ్లు కనిపించకుండా పోయిన ఈ ఒకప్పటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కు విశ్వం కంబ్యాక్ అవ్వాలి. అదే కాన్ఫిడెన్స్ ని ఇంటర్వ్యూలలో చూపిస్తున్నారు కూడా. మాస్, కామెడీ, యాక్షన్ ఏదీ మిస్ చేయకుండా ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తీశానని స్పష్టమైన హామీ ఇస్తున్నారు.

ఇక హీరో గోపీచంద్ ఇది ఎంత కీలకమో మళ్ళీ గుర్తు చేయనక్కర్లేదు. మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉండి, ఎనర్జీని సరైన రీతిలో వాడుకోగల టీమ్ దొరికితే అద్భుతాలు చేసే సత్తా ఈ మాచో స్టార్ కుంది. కానీ దురదృష్టవశాత్తు కొన్నేళ్లుగా అది జరగడం లేదు.

భీమా ఎంత రొటీన్ గా ఉన్నా ఆ మాత్రం డబ్బులు వచ్చాయంటే కారణం మాస్ లో తనకున్న బ్రాండ్ ఇమేజే. ఇక వచ్చినప్పటి నుంచి ఫ్లాపులే తప్ప హిట్టు చూడని కావ్య థాపర్ కు ఇంకొన్ని అవకాశాలు రావాలంటే విశ్వం విజయం సాధించాల్సిందే. ఊరి పేరు భైరవకోన డీసెంట్ గా ఆడటం తప్పించి ఈ అమ్మడికి దక్కాల్సిన హిట్టు విశ్వమే.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టిజి విశ్వప్రసాద్ కి విశ్వం కొత్త ఎనర్జీ ఇవ్వాలి. గత రెండు చిత్రాల్లో మిస్టర్ బచ్చన్ దారుణంగా పోగా స్వాగ్ కు యువత నుంచి చెప్పుకోదగ్గ మంచి టాక్ వచ్చినా ఫ్యామిలీ ఆడియన్స్ ని తనవైపు తిప్పుకోలేకపోవడంతో బాక్సాఫీస్ నెంబర్లు పెద్దగా లేవు.

అంతకు ముందు మనమే, ఈగల్, బ్రో లాంటివి అంచనాలు అందుకోలేకపోయాయి. సో విశ్వం కనక కమర్షియల్ గా లాభాలు తీసుకొస్తే ఊరట దక్కుతుంది. వేట్టయన్, జనక అయితే గనక, మార్టిన్, జిగ్రా, మా నాన్న సూపర్ హీరోతో విశ్వంకు పెద్ద పోటీనే స్వాగతం పలుకుతోంది.