చాలా చిన్న వయసులో నటకిరీటి రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి కన్నుమూయడం ఇండస్ట్రీ వర్గాలను, అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. కేవలం 38 సంవత్సరాల జీవితం మాత్రమే చూసిన ఒకే ఒక ఆడ నలుసు అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోతే ఆ తండ్రి పడే బాధ ఎవరూ ఓదార్చలేనిది.
సినిమా లాగే వీళ్ళ బంధంలోనూ గుండెని తడి చేసే నాటకీయత ఉండటం విధి లిఖితం. గాయత్రిది ప్రేమ వివాహం. ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కోపంతో రాజేంద్రప్రసాద్ కొంత కాలం ఆమెతో మాట్లాడ్డం మానేశారు. 2018లో రమేష్ చెప్పాల దర్శకత్వంలో బేవార్స్ సినిమాలో ఆయనో కీలక పాత్ర పోషించారు.
కథ ప్రకారం కూతురు చనిపోతే తల్లి నా చిట్టి తల్లి అంటూ సాగే ఒక విషాద గీతం ఉంటుంది. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ హృద్యమైన పాటను యూట్యూబ్ లో 80 మిలియన్లకు పైగా చూశారంటే ఎంతగా శ్రోతలను తాకిందో అర్థం చేసుకోవచ్చు.
బేవార్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ పాటలో నటించాక గాయత్రిని ఇంటికి పిలిపించి నాలుగుసార్లు వినిపించానని, ఇద్దరూ కంటతడి పెట్టుకుని దగ్గరయ్యామని బాగా ఎమోషనల్ అయ్యారు. ఇక అప్పటి నుంచి రెండిళ్ళ మధ్య రాకపోకలు మొదలయ్యాయి. మనసున్న మనుషులు ప్రతి ఒక్కరు వినాలని అప్పట్లో రాజేంద్రుడు పిలుపిచ్చారు.
ఇప్పుడు అంతా సర్దుకున్నాక గాయత్రి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం రాజేంద్రప్రసాద్ ని హతాశుడిని చేసింది. కేవలం కెమెరా ముందే అంత భావోద్వేగానికి గురైన ఆయన పదేళ్ల వయసులో తల్లి చనిపోయినప్పుడు కూడా ఏడవలేదని, కానీ సినిమాలో కూతురు పోయిందన్నా తట్టుకోలేకపోయారు. అలాంటిది ఇప్పుడు అదే నిజమయ్యింది.
కాకతాళీయంగా బేవార్స్ తీసిన రమేష్ చెప్పాలానే ఇప్పుడు లగ్గం అనే సినిమా తీశారు. అందులోనూ రాజేంద్రప్రసాద్ ఉన్నారు. విదేశాల నుంచి దీని ప్రమోషన్ల కోసమే వచ్చారు. ఎవరికీ రాకూడని కడుపు కోత రాజేంద్రప్రసాద్ అనుభవిస్తున్నారు. త్వరగా కోలుకోవాలని అభిమానుల ఆకాంక్ష.