మళ్లీ థియేటర్ల హాహాకారాలు

గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. పెద్ద సినిమాలు అనుకున్న స్థాయిలో రిలీజ్ కాకపోవడం, విజయవంతమైన సినిమాలు కూడా తగ్గడంతో ఆక్యుపెన్సీలు ఆశించిన స్థాయిలో లేవు. సరైన సినిమాలు లేక పూర్తిగా థియేటర్లు వెలవెలబోయిన రోజులు చాలానే ఉన్నాయి. మినిమం ఆక్యుపెన్సీలు లేక థియేటర్లలో షోలు రద్దవడం మామూలైపోయింది.

ఐతే 2026 మీద టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా ఆశలే పెట్టుకుంది. అందుకు తగ్గట్లే సంక్రాంతి సినిమాలు చాలా బాగా ఆడడం, రెండు మూడు వారాల పాటు థియేటర్లు కళకళలాడడంతో ఫిలిం ఇండస్ట్రీలో పండుగ వాతావరణం కనిపించింది. కానీ సంక్రాంతి సినిమాల తర్వాత స్లంప్ రావడం ఎప్పుడూ జరిగేదే కానీ.. ఈసారి ఆ స్ట్రెచ్ మరీ ఎక్కువగా ఉంది. సంక్రాంతి సినిమాలు రిలీజై నెల గడుస్తున్నా.. ఆ తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు.

జనవరి నెలాఖరులో వచ్చిన ‘ఓం శాంతి శాంతి శాంతి:’ చిత్రాన్ని ప్రేక్షకులు అస్సలు పట్టించుకోలేదు. తర్వాతి వారం ‘యుఫోరియా’ సహా పలు చిత్రాలు విడుదల కాగా.. వాటి పరిస్థితీ అంతే. ఐతే వేలంటైన్స్ డే వీకెండ్‌కు ఎప్పుడూ కొంచెం క్రేజ్ ఉంటుంది, పైగా ఈసారి ఫంకీ, కపుల్ ఫ్రెండ్లీ, సీతాపయనం లాంటి పేరున్న చిత్రాలు వస్తుండడంతో మళ్లీ బాక్సాఫీస్ పుంజుకుంటుందని ఆశించారు. కానీ అలా జరగలేదు.

ఫంకీ, సీతాపయనం నెగెటివ్ టాక్‌లో కొట్టుకుపోయాయి. ‘కపుల్ ఫ్రెండ్లీ’ పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా అందుకు తగ్గట్లుగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోతోంది. ఐతే అంతో ఇంతో ప్రేక్షకులన్నది ఈ సినిమా థియేటర్లలోనే. మిగతా సినిమాలకు మినిమం ఆక్యుపెన్సీలు లేక షోలు నడిపించడమే కష్టమైపోయిన పరిస్థితి. ఈ రోజు బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే థియేటర్లు ఎలా హాహాకారాలు పెడుతున్నాయో అర్థమవుతుంది. ఈ వీకెండ్లో రానున్న ‘హే బల్వంత్’తో ఏమైనా పరిస్థితి మారుతుందేమో చూడాలి.