సెల‌వు రోజు దేవ‌ర వీరంగం

వీకెండ్లో వ‌సూళ్ల మోత మోగించాక సోమ‌వారం రోజు డ‌ల్ అయింది దేవ‌ర‌. వ‌సూళ్లలో బాగా డ్రాప్ క‌నిపించింది. ఆక్యుపెన్సీలు 25 శాతానికి ప‌డిపోయాయి. దీంతో తార‌క్ ఫ్యాన్స్ కంగారు ప‌డ్డారు. కానీ బ‌య్య‌ర్లు సినిమా పుంజుకుంటుంద‌నే ఆశాభావంతోనే క‌నిపించారు.

అందుక్కార‌ణం ద‌స‌రా సెల‌వులు మొద‌లు కావ‌డ‌మే. అందులోనూ బుధ‌వారం గాంధీ జ‌యంతి కావ‌డంతో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులూ థియేట‌ర్ల‌కు క‌దులుతార‌నే అంచనా ఏర్పడిందిి.

ఐతే దేవ‌ర ఫ‌స్ట్ షోల ఊపు చూస్తే సినిమా అంచ‌నాల‌ను మించే గాంధీ జ‌యంతి సెల‌వును ఉప‌యోగించుకుంద‌ని అర్థ‌మ‌వుతోంది. బుధ‌వారం సెల‌వు కావ‌డంతో ముందు రోజు రాత్రే దేవ‌ర థియేట‌ర్ల ద‌గ్గ‌ర సంద‌డి క‌నిపించింది.

ఫ‌స్ట్, సెకండ్ షోలకు మంచి ఆక్యుపెన్సీలు వ‌చ్చాయి. ఇక బుధ‌వారం మార్నింగ్, మ్యాట్నీ షోల‌కు ఓ మోస్త‌రుగా జ‌నం కనిపించారు. సాయంత్రం నుంచి థియేట‌ర్ల ద‌గ్గ‌ర హంగామా మామూలుగా లేదు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని మేజ‌ర్ సిటీస్‌లో దేవ‌ర థియేట‌ర్లు చాలా వ‌ర‌కు ప్యాక్డ్ హౌస్‌లతో నడిచాయి. హౌస్ ఫుల్ బోర్డుల‌తో ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో చాలా క‌నిపించాయి. థియేట‌ర్ల ద‌గ్గ‌ర జ‌నం టికెట్ల కోసం ఎగ‌బ‌డుతున్న దృశ్యాలు ద‌ర్శ‌న‌మిచ్చాయి.

అలాగే బుక్ మై షోలో సోల్డ్ ఔట్, ఫాస్ట్ ఫిల్లింగ్ షోలే ఎక్కువ‌గా క‌నిపించాయి. మొత్తానికి రిలీజ్ టైంలో కొంచెం డివైడ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ.. దేవ‌ర బ‌లంగానే నిల‌బడింది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌. రిలీజ్ టైమింగ్ విష‌యంలో టీం చాలా ప్లాన్డ్‌గా ఉంద‌న్న‌ది స్ప‌ష్టం.

తొలి వీకెండ్లో ఆటోమేటిగ్గా మంచి వ‌సూళ్లు ఉంటాయి. వీక్ డేస్ వ‌చ్చేస‌రికి ద‌స‌రాల సెల‌వులు వ‌చ్చేశాయి. కాబ‌ట్టి సినిమాకు ఇంకో వారం పాటు ఢోకా లేన‌ట్లే. ఈ వీకెండ్లో కొత్త సినిమాలాగా దేవ‌ర సందడి చేసే అవ‌కాశ‌ముంది. సినిమా మీద పెట్టుబ‌డులు పెట్టిన అంద‌రికీ మంచి లాభాలే వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.