గత శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘దేవర’ మిక్స్డ్ టాక్‌తో మొదలైనప్పటికీ తొలి రోజు, తొలి వీకెండ్లో భారీ వసూళ్లు రాబట్టింది. వరల్డ్ వైడ్ రూ.250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో అదరగొట్టింది. ఐతే సినిమాకు డివైడ్ టాక్ వచ్చిన నేపథ్యంలో వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ఎలా పెర్ఫామ్ చేస్తుందా అన్న ఆసక్తి అందరిలోనూ వ్యక్తమైంది.
సోమవారం వచ్చింది. షోలు పూర్తయ్యాయి. కలెక్షన్ రిపోర్ట్ చూస్తే ఆశాజనకంగా లేదు. వీకెండ్ తర్వాత డ్రాప్ మామూలే కానీ.. అది ఎంత స్థాయిలో ఉందన్నది కీలకం. సోమవారం ‘దేవర’ వరల్డ్ వైడ్ రూ.15 కోట్ల మేర గ్రాస్ రాబట్టింది. ఆక్యుపెన్సీలు 25 శాతానికి పడిపోయాయి. పెద్ద పెద్ద హిట్ సినిమాలకు కూడా సోమవారం వసూళ్లు 50 శాతానికి పడిపోవడం మామూలే. కానీ 25 శాతానికి డ్రాప్ అంటే ఆందోళన రేకెత్తించే విషయమే.
ఐతే ‘దేవర’కు వచ్చిన టాక్ ప్రకారం చూస్తే ఈ డ్రాప్ మరీ ఆశ్చర్యం కలిగించేది కాదు. ఈ విషయంలో అభిమానులు మరీ కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా స్కూళ్లు పని చేశాయి. మంగళ, బుధవారాల్లో దసరా సెలవులు మొదలవుతున్నాయి. పైగా బుధవారం గాంధీ జయంతి సెలవు. ఆ రోజు కచ్చితంగా వసూళ్లు పుంజుకుంటాయి. ఆ రోజు నుంచి పది రోజుల పాటు దసరా సెలవులూ కలిసి వస్తాయి. అక్టోబరు 10న ‘వేట్టయాన్’తో దసరా సినిమాల సందడి మొదలవుతుంది. అంత వరకు ‘దేవర’కు ఎదురు లేదు.
ఈ వీకెండ్లో కొన్ని సినిమాలు రిలీజవుతున్నప్పటికీ ‘దేవర’ మీద అంత ప్రభావం ఏమీ ఉండకపోవచ్చు. రెండో వీకెండ్లో ఈ సినిమా కొత్త చిత్రంలాగా సందడి చేసే అవకాశముంది. కాబట్టి లాంగ్ రన్ సినిమాకు కలిసి వస్తుంది. మంచి వసూళ్లతోనే థియేట్రికల్ రన్ ముగించే అవకాశాలు ఉన్నాయి.