ఊహించినట్టే దేవర పార్ట్ 1 ఓపెనింగ్ అదిరిపోయింది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఈ ట్రెండ్ స్పష్టమైనప్పటికీ కౌంటర్ సేల్స్ దానికి మరింత బలాన్ని జోడించడంతో ఏకంగా నాన్ ఆర్ఆర్ఆర్ నెంబర్లు నమోదయ్యే దిశగా దేవర పరుగులు పెడుతోంది. పబ్లిక్ టాక్, రివ్యూలు యునానిమస్ గా ఒకే తీర్పు ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చనే మాట పబ్లిక్ నుంచి బయటికి వెళ్తోంది. దీని వల్ల శని ఆదివారాలు సైతం వసూళ్లు భారీగా ఉండబోతున్నాయి. చాలా ఎక్కువగా జరిగిన టికెట్ ధరల పెంపు ప్రభావాన్ని కొట్టిపారేయలేం. అఫ్కోర్స్ దాని వల్ల కలిగిన ప్రయోజనమూ పెద్దదే కాదనలేం.
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు దేవర ఏపీ తెలంగాణ నుంచి సుమారు 54 కోట్లకు పైగా షేర్ వసూలు చేసినట్టు తెలిసింది. ఒక్క నైజామ్ లోనే ఇరవై కోట్లకు అతి దగ్గరగా వెళ్లడం తారక్ మార్కెట్ ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టం చేస్తోంది. బలమైన కోటగా భావించే సీడెడ్ లోనూ పది కోట్లను దాటేయడం కొత్త బెంచ్ మార్క్. వైజాగ్, గుంటూరు తదితర ప్రాంతాల్లో సైతం నెవర్ బిఫోర్ రికార్డులు నమోదవుతున్నాయి. వీకెండ్ మొత్తం దేవర చేతుల్లోకి వెళ్లడం ఖాయం. ఇవాళ రిలీజవుతున్న సత్యం సుందరంకి ప్రీ టాక్ బాగున్నప్పటికీ దానికి ఏ మేరకు మద్దతు దక్కుతుందో చూడాలి.
మొదలయ్యింది ఇప్పుడే కాబట్టి దేవర స్టేటస్ ఎక్కడిదాకా వెళ్తుందనేది చెప్పడానికి కనీసం పది రోజులు పడుతుంది. సోమవారం నుంచి డ్రాప్ ఎలా ఉంటుందనే దాని గురించి బయ్యర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీక్ డేస్ లోనూ హోల్డ్ కొనసాగించగలిగితే ఇండస్ట్రీ హిట్ క్యాటగిరీలోకి చేరిపోవచ్చు. సూచనలు పుష్కలంగా ఉన్నాయి. ఓవర్సీస్ లో 3 మిలియన్ మార్క్ సులభంగా దాటేసిన దేవరకు ఇంత మాస్ కంటెంట్ తోనూ అక్కడి వాళ్ళను మెప్పించడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా షేర్ చూసుకుంటే కల్కి (75 కోట్లకు పైగా) దాటేసిన దేవర 87 కోట్లకు పైగా షేర్ తో టాప్ వన్ లో ఉందట.