ఈ ఏడాది తెలుగులో భారీ చిత్రాల సందడి ఆశించిన స్థాయిలో లేకపోయింది. సంక్రాంతికి ‘గుంటూరు కారం’ నిరాశపరచగా.. ఆ తర్వాత రిలీజైన ఏకైక పెద్ద చిత్రం ‘కల్కి’నే. ఆ సినిమా ఘనవిజయం సాధించింది. ‘కల్కి’ వచ్చిన రెండు నెలలకు ఇప్పుడు ‘దేవర’ సందడికి రంగం సిద్ధమైంది. ట్రైలర్‌కు మిక్స్డ్ టాక్ రావడంతో సినిమా హైప్ మీద కాస్త సందేహాలు వ్యక్తమయ్యాయి కానీ.. రిలీజ్ ముంగిట ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకెళ్తోందీ చిత్రం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటక, యుఎస్‌లో అదిరిపోయే ప్రి సేల్స్‌తో దూసుకెళ్తోందీ చిత్రం.
ఇక తెలుగు రాష్ట్రాల వసూళ్లకు ఆయువుపట్టు అనదగ్గ హైదరాబాద్‌లో ‘దేవర’ దూకుడు మామూలుగా లేదు. ఈ శుక్రవారం 95 శాతం థియేటర్లలో ‘దేవర’నే ప్రదర్శించబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మల్టీప్లెక్సులు కూడా మెజారిటీ షోలను ఈ చిత్రానికే కేటాయించాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా గట్టిగానే జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రి సేల్స్ ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘దేవర’ రెండో స్థానానికి ఎగబాకింది. ఈ చిత్రం విడుదలకు రెండు రోజుల ముందే రూ.13 కోట్ల మేర గ్రాస్ రాబట్టింది. రూ.12.49 కోట్లతో రెండో స్థానంలో ఉన్న ‘సలార్’ సినిమాను అధిగమించింది. ఈ లిస్టులో ‘కల్కి 2898 ఏడీ’ అగ్రస్థానంలో ఉంది. ఆ సినిమా హైదరాబాద్‌లో ప్రి సేల్స్‌తో రూ.18.9 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. ‘దేవర’ రిలీజ్ లోపు ఈ మార్కును అందుకోవడం కష్టమే కావచ్చు. కానీ ‘సలార్’తో పాటు ‘ఆర్ఆర్ఆర్’, ‘గుంటూరు కారం’ లాంటి సినిమాలను దాటేయడం చిన్న విషయం కాదు.
‘దేవర’ ట్రైలర్‌కు మిక్స్డ్ టాక్ వచ్చాక ఈ స్థాయిలో హైప్ ఉండడం అంటే గొప్ప విషయమే. ఇక డే-1 ఓపెనింగ్స్‌లోనూ ‘దేవర’ సంచలనం రేపేలాగే కనిపిస్తోంది. ఇండియా ఆల్ టైం డే-1 గ్రాసర్స్‌లో టాప్-5లో ఈ సినిమా నిలవడం ఖాయం.