విజయ్ మాస్టర్, రజినీకాంత్ పేటతో మనకు పరిచయమైన మాళవిక మోహనన్ ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసింది కానీ వర్కౌట్ కాలేదు. ఇటీవలే తంగలాన్ లో ఊహించని దెయ్యం లుక్ తో భయపెట్టినా విక్రమ్ పెర్ఫార్మన్స్ ముందు కంటికి అనలేదు. పైగా లెన్త్ కూడా తక్కువ ఉండటంతో ఆశించిన ఫలితం దక్కలేదు. మాళవిక ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ లో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది తనకు టాలీవుడ్ తెరంగేట్రం. నిన్న బాలీవుడ్ డెబ్యూ యుధ్రా భారీ ఎత్తున థియేటర్లలో రిలీజయ్యింది. ఎన్నడూ లేనిది ఇందులో గ్లామర్ షో కూడా చేసింది. సినిమా ఎలా ఉందో చూద్దాం.
చిన్నప్పుడే తల్లితండ్రులు దారుణ హత్యకు గురైన యుధ్రా రాథోడ్ (సిద్దాంత్ చతుర్వేది) ని నాన్న స్నేహితుడు రెహ్మాన్ (రామ్ కపూర్) చేరదీస్తే పెరిగి పెద్దవుతాడు. విపరీతమైన కోపం బలహీనతగా ఉన్న యుధ్రాని సమాజానికి ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశంతో రెహ్మాన్ అతనికి డ్రగ్ మాఫియా నడిపే ఫిరోజ్ (రాజ్ అర్జున్) పతనాన్ని చూసే బాధ్యతను అప్పగిస్తాడు. దాంతో ఫిరోజ్ కొడుకు (రాఘవ్ జుయల్) తో యుధ్రా శత్రుత్వం మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది సగటు యాక్షన్ సినిమాల్లో చూసినట్టే జరుగుతుంది. శ్రీదేవి చివరి సినిమా మామ్ తీసిన రవి ఉద్యావర్ దీనికి దర్శకుడు.
రొటీన్ టెంప్లేట్ లో వెళ్లిన యుధ్రాలో బోలెడు యాక్షన్ మసాలా ఉంది కానీ వాటిని ప్రేక్షకులకు సరైన రీతిలో ముడిపెట్టే ఎమోషన్ లేకపోవడంతో చాలా రెగ్యులర్ గా అనిపిస్తుంది. లవ్ స్టోరీ బలహీనంగా ఉండటం, ఫాదర్ సెంటిమెంట్ ని రిజిస్టర్ చేయలేకపోవడం, రివెంజ్ పాయింట్ ని రొటీన్ గా రాసుకోవడం లాంటి అంశాలు ప్రభావితం చేశాయి. ఏ అంచనాలు లేకుండా సగటు మాస్ ఆడియన్స్ గా చూస్తే ఓకే కానీ లేదంటే యుధ్రా ఏ దశలోనూ బాగున్నాడని అనిపించుకోలేదు. కొత్తదనం ఆశించకుండా సిద్దాంత్, మాళవిక కెమిస్ట్రీ, యాక్షన్ మసాలా ఎంజాయ్ చేయడానికి తప్ప యుధ్రాలో ఇంకేం లేదు.