దావూది పాట మీద తర్జనభర్జనలు ?

వచ్చే వారం విడుదల కాబోతున్న దేవర పార్ట్ 1 కోసం అభిమానుల ఎదురుచూపులు అంతకంత భారంగా మారిపోయాయి. ఎప్పుడెప్పుడు ఏడు రోజులు గడిచిపోతాయాని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనిది తెలుగు రాష్ట్రాల్లో మిడ్ నైట్ బెనిఫిట్ షోలు ప్లాన్ చేయడంతో వాళ్ళ ఎగ్జైట్ మెంట్ రెట్టింపయ్యింది. ప్రీమియర్ల టికెట్ రేట్లు బ్లాక్ లో అమ్మకుండా గరిష్ట ధరను ప్రభుత్వం నుంచే అనుమతి తెచ్చుకునేలా నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్టు వస్తున్న వార్తలు సంతోషం కలిగించేవే. ఫైనల్ కట్ తొలుత రెండు గంటల యాభై నిమిషాలని వినిపించగా తాజాగా ఎనిమిది నిముషాలు తగ్గినట్టు వినికిడి.

ప్రత్యేకంగా అందిన సమాచారం మేరకు దావూది పాటను ప్రస్తుతానికి ఉంచాలా వద్దా అనే దాని మీద టీమ్ తర్జనభర్జనలు పడుతున్నట్టు తెలిసింది. ముందు అనుకున్న వెర్షన్ ప్రకారం క్లైమాక్స్ అయిపోయాక ఎండ్ టైటిల్స్ రోల్ అవుతున్నప్పుడు దీన్ని ప్లే చేయాలని ఫిక్సయ్యారు. కానీ భారీ యాక్షన్, ఎమోషన్ తో సినిమా ముగిశాక డ్యూయెట్ పెట్టడం ఎంతవరకు సబబనే కోణంలో సీరియస్ గా చర్చిస్తున్నట్టు తెలిసింది. పోనీ మధ్యలో పెడదామంటే చుట్టమల్లే తరహాలో సరైన ప్లేస్ మెంట్ దొరక్కపోవడం వల్లే ఏం చేయాలో తెలియని అయోమయం నెలకొందని అంటున్నారు.

ఈ సస్పెన్స్ కు తెరవీడేది సెప్టెంబర్ 27నే. కాకపోతే ఉండకపోవచ్చని ముందే ప్రిపేరవ్వడం మంచిదే. ఒకవేళ ఉంటే స్పెషల్ గా ఫీలవొచ్చు. చాలా హై ఎలివేషన్ తో నడిచే దేవరలో ఎక్కువ పాటలకు ఛాన్స్ లేకపోవడం వల్లే అనిరుద్ రవిచందర్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకున్నా దర్శకుడు కొరటాల శివ బలవంతంగా పాటలు పెట్టే ఆలోచన చేయకుండా నాలుగుకే పరిమితం చేశారు. పార్ట్ 2లో ఎన్ని ఉంటాయో ఇంకా డిసైడ్ కాలేదు కానీ తెరమీద జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ చేయబోయే లవ్, రొమాన్స్, డాన్స్ మీద ప్రేక్షకుల్లోనే కాదు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలున్నాయి.