నిర్మాతలకు పవన్ క్షమాపణ చెప్పిన వేళ

కారణాలు ఎన్నున్నా హీరోలు వ్యక్తిగతంగా నిర్మాతలకు సారీ చెప్పే సందర్భాలు బహు అరుదుగా ఉంటాయి. స్క్రీన్ మీదే కాదు బయట కూడా ఈగోలతో నిండిపోయిన ఇండస్ట్రీలో దీన్ని అంత సులభంగా ఆశించలేం. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం దానికి మినహాయింపుగా నిలిచారు. ఇవాళ జరిగిన టిడిపి, జనసేన, బిజెపి కూటమి శాసనపక్ష సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. యాభై రోజులకు పైగా చంద్రబాబునాయుడుని అప్పటి సర్కార్ జైలు పాలు చేసిన సంఘటన గుర్తు చేసుకుని ఎవరికి తెలియంది పంచుకున్నారు.

తెలుగుదేశం అధినేతగా కొన్ని నెలల క్రితం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబునాయుడు కారాగారంలో ఉండగా షూటింగులకు వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ కు మనస్కరించలేదు. ఇలాంటి విపత్కాలంలో ఆయనలా బాధ పడుతూ ఉంటే తాను సెట్లలో ఉత్సాహంగా పాల్గొనలేనని గుర్తించి వెంటనే తన నిర్మాతలకు ఇచ్చిన డేట్లకు రాలేనని చెబుతూ వాళ్లను క్షమాపణ చెప్పారు. నిజానికి పవన్ కు ఆ అవసరం లేదు. నేను రాలేను అని ఒక మాట చెబితే అయిపోయేది. ఎంతటి ప్రొడ్యూసర్ అయినా సరే అనడం తప్ప ఏం చేయలేరు. కానీ వాళ్ళ సాధక బాధలు తెలుసు కాబట్టే పర్సనల్ గా తన నిస్సహాయతను వ్యక్తం చేశారు.

ఇప్పటిదాకా తాను ఒకరికి క్షమాపణ చెప్పానని పవన్ కళ్యాణ్ బహిరంగంగా పంచుకున్న సందర్భం ఇదే మొదటిసారని చెప్పొచ్చు. ఇంకోవైపు చంద్రబాబు సైతం పవన్ ని పొగడ్తలతో ముంచెత్తడం విశేషం. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తనను పలకరించడానికి వచ్చిన పవన్ ను అప్పటి ప్రభుత్వం అడ్డంకులు ఏర్పరిస్తే రోడ్డు మార్గం ద్వారా వచ్చి, మధ్యలో అడ్డుకుంటే రహదారి మీద ధర్నా చేసిన సాహసం ఆయనకే చెల్లిందని అన్నారు. పోరాటయోధుడిగా ప్రశంసలు గుప్పించారు. సినిమా కన్నా రాజకీయం, ప్రజాసేవా తనకెంత ముఖ్యమో పవన్ కళ్యాణ్ మరోసారి ఈ ఉదంతం ద్వారా చాటినట్టు అయ్యింది.