సరైన దారిలో వెళ్తున్న సుధీర్ బాబు

ఏదో కొత్తగా ట్రై చేయాలని చూస్తున్న సుధీర్ బాబుకి గత కొన్నేళ్లుగా సక్సెస్ మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఎవరూ రిస్క్ చేయని పాయింట్ తో హంట్ ఎంచుకున్నా, హీరోయిన్ ఓరియెంటెడ్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలిలో నటించినా ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఊర మాస్ టర్న్ తీసుకుని హరోంహర చేస్తే ఓ మోస్తరుగా సంతృప్తి పరిచిందే తప్ప అద్భుతాలు చేయలేదు. నిజానికి సుధీర్ బాబు సమ్మోహనం లాంటి మంచి ఫీల్ గుడ్, ఎమోషనల్ డ్రామాలకు బాగా నప్పుతాడు. కానీ ఇది కొంత కాలంగా మిస్సవ్వడంతో హిట్టు బాట తప్పింది. ఇప్పుడు రూటు మార్చాడు సుధీర్ బాబు.

నిన్న విడుదలైన మా నాన్న సూపర్ హీరో టీజర్ కు మంచి స్పందన కనిపిస్తోంది. సంపాదించే కొడుకుకు అతని జీవితంలోకి ఇద్దరు తండ్రులు వస్తే ఎలా ఉంటుందనే డిఫరెంట్ పాయింట్ తో దర్శకుడు అభిలాష్ ఏదో కొత్తగా చెప్పాలని ప్రయత్నించిన వైనం నిమిషంన్నరలోనే కనిపించింది. షియాజీ షిండే, సాయిచంద్ లతో రెండు వేర్వేరు ట్రాక్స్ కి సుధీర్ బాబుకి సింక్ చేసిన వైనం ఆసక్తి పెంచింది. యువి సంస్థ ఉత్పత్తి కావడంతో ప్రొడక్షన్ పరంగా మంచి క్వాలిటీ కనిపిస్తోంది. అందుకే గట్టి పోటీలో అక్టోబర్ 11 దసరా పండక్కు ఈ సినిమాని థియేటర్లకు తీసుకొస్తున్నారు.

ఇది చూశాక సుధీర్ బాబు చేయాల్సినవి ఇలాంటివే కదా అనిపిస్తుంది. రెగ్యులర్ మాస్, కమర్షియల్ మసాలా తనకు నప్పదు. మహేష్ బాబు అభిమానులు అందుకే కొన్ని సినిమాలకు తనను ఓన్ చేసుకోలేకపోతున్నారు. మా నాన్న సూపర్ హీరో లాంటివి కుటుంబ ప్రేక్షకులను దగ్గర చేస్తాయి. తద్వారా మార్కెట్ ని పెంచుకోవచ్చు. వెంకటేష్ తరహాలో ఫ్యామిలీ ఇమేజ్ బలంగా ఏర్పడితే ఆ తర్వాత మాస్ చేసినా పాసైపోతుంది. త్వరలో తన కొడుకు తెరంగేట్రం చేస్తాడని చెబుతున్న సుధీర్ బాబు ఇప్పుడీ సినిమా విషయంలో మాత్రం ఎమోషనల్ గా ఫీలవుతున్నాడు. కంటెంట్ అలా ఉంది మరి.