ఇటీవలే బ్యాలన్స్ ఉన్న సినిమాల దర్శక నిర్మాతలతో తానున్న చోటే సమావేశాలు పెట్టి వాటి స్టేటస్ తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఈ నెలలోనే షూటింగులు మొదలుపెట్టే దిశగా వాళ్లకు కొన్ని సూచనలు చేశారు. వీలైనంత మంగళగిరి, అమరావతి, గుంటూరు తదితర ప్రాంతాల్లోనే చిత్రీకరణ చేసుకోమని కూడా చెప్పారట. ఓజిలో కీలకమైన విదేశీ షెడ్యూల్ కు తప్ప హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ లకు ఎలాంటి ఇబ్బంది లేదు. రేపో మాపో సెట్లోకి అడుగు పెడతారని ఎదురు చూస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ ముందరి కాళ్లకు పరిస్థితులు స్పీడ్ బ్రేకర్స్ లా అడ్డుపడుతున్నాయి.
ఇటీవలే బుడమేరు వరదలు విజయవాడని ముంచెత్తాయి. కోట్లలో ఆస్తి నష్టంతో పాటు వేలాది సామాన్య జనం రోడ్డున పడ్డారు. ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోబట్టి సరిపోయింది కానీ లేదంటే ఇంకా దారుణంగా ఉండేది. క్రమంగా బెజవాడ కోలుకుంటుందనే టైంలో ఇంకో ప్రాంతంలో భారీ వర్షాలతో ఏలేరు వరద ముంచెత్తింది.. నిన్న స్వయంగా పవనే కాకినాడ, పిఠాపురం పర్యటనకు వెళ్లి కళ్లారా జరిగిన విపత్తుని చూసి వచ్చారు. ఇలాంటి టైంలో పవన్ అసలు షూటింగ్ మూడ్ లో లేరని సన్నిహితుల మాట. వర్షాలకు ముందు వరకు సానుకూలంగా ఉన్నారు కానీ ఇప్పుడు ప్రజల గురించి ఆలోచన తప్ప వేరేది చేయడం లేదని అంటున్నారు.
సో దర్శకులు నిర్మాతలు మరికొంత కాలం ఎదురు చూడక తప్పేలా లేదు. ఇవన్నీ ఊహించనివి. ఆగస్ట్ లో ఎవరూ ఇలాంటి విపత్కాలం వస్తుందని అంచనా వేయలేదు. కారణాలు స్పష్టంగా తెలిసినా సరే పవన్ కళ్యాణ్ వరద బాధితులను కలవలేదని ప్రతిపక్షాలు నానా యాగీ చేయాలని చూశాయి. తర్వాత దానికి సరైన సమాధానం దొరికాక సైలెంటయ్యాయి. ఇప్పుడు పవన్ కనక వెంటనే షూటింగుల్లో ఉంటే మళ్ళీ ఇంకో రకమైన విమర్శలకు పదును పెడతాయి. పవన్ కేవలం ఎమ్మెల్యే అయితే సమస్య లేదు. ఉప ముఖ్యమంత్రి పదవీతో పాటు కీలక శాఖలకు మంత్రి కావడం వల్లే ఈ ఒత్తిడిని తట్టుకోవాల్సి ఉంటుంది.