దేవర కొత్త పాట.. ఇటు విమర్శలు అటు వైరల్

జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘దేవర’ ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలున్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాకు తారక్ ఫ్యాన్స్ పట్టుబట్టి సంగీత దర్శకుడుగా ఉండాలని కోరుకున్నది అనిరుధ్ రవిచందర్‌నే.

కొరటాల శివ మనసులోనూ అతనే ఉన్నాడా.. లేక అభిమానుల ఉత్సాహం చూసి పెట్టుకున్నాడో తెలియదు కానీ.. అనిరుధ్‌కే సంగీత బాధ్యతలు అప్పగించాడు. మాస్టర్, లియో, జైలర్ లాంటి సినిమాల్లో అనిరుధ్ పాటలు, నేపథ్య సంగీతానికి ఊగిపోయిన జనాలు.. ‘దేవర’లోనూ అలాంటి ఔట్ పుటే ఇస్తాడని ఆశలు పెట్టుకున్నారు. కానీ అనిరుధ్ ఆ స్థాయి పాటలు ఇవ్వడం లేదన్న కంప్లైంట్ ఉంది. తన పాటల్లో ఊపు ఉంటోంది కానీ.. కొత్తదనం మాత్రం కనిపించడం లేదు.

మొదట వచ్చిన ఫియర్ సాంగ్.. ‘హుకుమ్’కు కాపీలా అనిపించింది. ఆ తర్వాత వచ్చిన ‘చుట్టమల్లే’ ఓ శ్రీలంక పాటకు కాపీ అని క్లియర్‌గా తెలిసిపోయింది. లేటెస్ట్‌గా వచ్చిన ‘దావూదీ’ పాట కూడా కొత్తగా ఏమీ లేదు. ‘హలమిత్తి హబీబీ’ పాటను అటు ఇటు తిప్పి కొట్టిన ఫీలింగ్ కలిగింది.

తెలుగు సినిమాలంటే మాత్రం ఎందుకింత లైట్ తీసుకుంటాడు.. పాత పాటలనే అటు ఇటు తిప్పి లాగించేస్తాడేంటి అంటూ అనిరుధ్ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఐతే ఈ పాటల్లో అనుకరణ కనిపించినా సరే.. సోషల్ మీడియాను మాత్రం అవి ఊపేస్తున్నాయి.

ఇంతకుముందు రిలీజైన రెండు పాటలు.. ఇప్పుడొచ్చిన కొత్త పాట యూట్యూబ్‌నే కాదు.. రీల్స్, షార్ట్స్‌ను ఊపేస్తున్నాయి. ఆల్రెడీ కొత్త పాట మీద రకరకాల వెర్షన్లు.. మీమ్స్ తయారై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పాటలు కొత్తగా లేకపోతేనేం.. సోషల్ మీడియాను మాత్రం ఊపేస్తున్నాయి కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీనే.