ది గ్రేటెస్ట్ ‘పాఠం’ అఫ్ ఆల్ టైం

ఎలాంటి కమర్షియల్ సినిమా తీసినా చూస్తున్నారు, కోట్ల కలెక్షన్లు కురుస్తున్నాయనే ధీమాతో తెలుగు మార్కెట్ ని టెకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుని కనీసం ప్రమోషన్లకు కూడా రాని విజయ్ కు ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం పెద్ద పాఠమే నేర్పించింది.

రాజకీయాల్లోకి వెళ్ళబోతున్న తరుణంలో చేస్తున్న చివరి రెండు చిత్రాల్లో ఇది ముఖ్యమైంది కావడంతో అభిమానులు మాములు అంచనాలు పెట్టుకోలేదు. టాలీవుడ్ లోనూ భారీ రేట్లు పెట్టి హక్కులు కొన్నారు. పెద్ద రిలీజ్ దక్కేలా చూసుకున్నారు. తీరా చూస్తే మొదటి రోజే సోసోగా ఎదురీదితే నిన్న రెండో రోజు మరీ దారుణంగా వసూళ్లు పడిపోవడం షాక్ ఇచ్చింది.

తుపాకీ, అదిరింది, విజిల్, మాస్టర్, లియో లాంటి హిట్లు చూసినా బీస్ట్, వారసుడు లాంటి మాస్ అండతో గట్టెక్కిన యావరేజులు గమనించినా వాటిలో కనీస స్థాయిలో ఎంగేజ్ చేసే కంటెంట్ ఉంటుంది. కానీ గోట్ లో అవేవి లేకుండా దర్శకుడు వెంకట్ ప్రభు చాలా జాగ్రత్త పడ్డారు. కస్టడీ తీసిన తనలో ఎలాంటి మార్పు లేదని చాటి చెప్పారు.

సీఎస్కె కెప్టెన్ ఎంఎస్ ధోనిని హైలైట్ చేయడం కోసమే క్లైమాక్స్ అలా డిజైన్ చేసిన ఆలోచనకు ఎన్ని చప్పట్లు కొట్టినా తక్కువే. శివ కార్తికేయన్ క్యామియో, విజయ్ కాంత్ రీ క్రియేషన్, ఇళయరాజా సూపర్ హిట్ సాంగ్ వాడకం, ఇతర హీరోల రెఫరెన్సులు ఇవేవి పని చేయలేదు.

పైగా త్రిషతో ఐటెం సాంగ్ మరో మిస్ ఫైర్. బిర్యానీ అంటే కేవలం బియ్యం, మసాలాలు కలపడం కాదు. దానికో పద్ధతి, లెక్క ఉంటాయి. నిపుణుడైన వంటవాడు కావాలి. ఈ ప్రాధమిక సూత్రాన్ని మర్చిపోయిన వెంకట్ ప్రభు గతంలో అజిత్ తో గ్యాంబ్లర్ తీసింది ఈయనేనాని అనుమానం వచ్చేలా చేశారు.

ఫైనల్ గా విజయ్ తెలుగు మార్కెట్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలవబోతున్న గోట్ తర్వాత రాబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. బాగుంటే అనువాద చిత్రాలను సైతం నెత్తిన బెట్టుకుని చూసే టాలీవుడ్ ఆడియన్స్ మరీ తేలికగా తీసుకుంటే ఇలాంటి ఫలితాలు రిపీట్ అవుతూనే ఉంటాయి.