దేవరలో కారంచేడు ఊచకోత ?

సెప్టెంబర్ 27 విడుదల కాబోతున్న దేవర పార్ట్ 1 తాలూకు ఎగ్జైట్ మెంట్ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటిదాకా వచ్చిన రెండు పాటలు ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. రేపు వదలబోయే వీడియో సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పులు అభిమానులను కుదురుగా ఉండనివ్వవనే టాక్ ఇప్పటికే ఊపందుకుంది. భయపడినట్టు కాకుండా అనిరుద్ రవిచందర్ అంచనాలకు మించి అవుట్ ఫుట్ ఇవ్వబోతున్నట్టు క్లారిటీ వచ్చేయడంతో ఫ్యాన్స్ హమ్మయ్య అనుకుంటున్నారు. కథకు సంబంధించిన కీలక ఎపిసోడ్ ఒకటి నలభై సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఊచకోత ఆధారంగా ఉంటుందనే లీక్ గట్టిగా జరుగుతోంది.

ముందా ఘటనేంటో చూద్దాం. 1985లో ప్రకాశం జిల్లా కారంచేడు అనే గ్రామంలో ఆరుగురు దళితులు అతి కిరాతకంగా అగ్ర వర్ణాల చేతిలో హత్యకు గురయ్యారు. నీటిని వాడుకునే దగ్గర మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానగా మారి ప్రాణాలు పోయేదాకా తీసుకొచ్చింది. ముగ్గురు మహిళలు మానభంగానికి గురయ్యారు. దీంతో కారంచేడు ఒక్కసారిగా భగ్గుమంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. నక్సలైట్లు రంగంలోకి దిగి ఈ దుర్ఘటనకు కారణమైన ఒకరిద్దరికి మరణ శిక్ష విధించారని మీడియాలో వచ్చింది. రాజకీయంగానూ పెను దుమారం రేపిన ఈ వివాదం తెలుగుదేశం సర్కారుని ఇబ్బందుల్లో నెట్టింది.

దేవరలో దీన్నే రిఫరెన్స్ గా తీసుకున్నారనే ప్రచారం జోరుగా ఉంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం దర్శకుడు కొరటాల శివ దీని గురించి పరిశోధన చేసిన మాట వాస్తవమే కానీ నేపథ్యం, హీరో విలన్ క్యారెక్టరైజేషన్ ఇవన్నీ ఊహకు అందని విధంగా, పూర్తిగా వేరుగా ఉంటాయని అంటున్నారు. సముద్రం ఒడ్డున జరిగే ఊచకోత ఎపిసోడ్ మాత్రం నెవర్ బిఫోర్ ఆన్ టాలీవుడ్ స్క్రీన్ అనేలా ఉంటుందట. రక్తం ఏరులై పారితే ఎలా ఉంటుందో చూడొచ్చని అంటున్నారు. ఈ కారంచేడు స్టోరీని తీసుకోవడం ఎంత వరకు నిజమో తెలియాలంటే ఇంకో ఇరవై నాలుగు రోజులు ఎదురు చూడాల్సిందే.