విజయ్ సినిమా వద్దని చెప్పిన మల్టీప్లెక్సులు

ఇంకో నలభై ఎనిమిది గంటల లోపే విడుదల కాబోతున్న విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంకి ఉత్తరాది కార్పొరేట్ మల్టీప్లెక్సులు షాక్ ఇచ్చాయి. బాలీవుడ్ నిర్మాతలతో వీటి సమాఖ్య చేసుకున్న ఒప్పందం ప్రకారం థియేటర్, ఓటిటికి మధ్య గ్యాప్ ఖచ్చితంగా రెండు నెలలు అంటే ఎనిమిది వారాలు ఉండాల్సిందే. ఒకవేళ దీనికి కట్టుబడి ఉండకపోతే స్క్రీన్లు ఇవ్వమని ఖరాఖండిగా ముందే చెప్పేస్తారు. అయితే గోట్ కు పెట్టుకున్న విండో కేవలం 28 రోజులట. జీ ఫైవ్ తో అగ్రిమెంట్ జరిగింది. అలాంటప్పుడు తమ సముదాయాల్లో ప్రదర్శించడం కుదరదని తేల్చి చెప్పడంతో అక్కడ పరిమిత స్క్రీన్లలో రిలీజవుతోంది.

లియోకి సైతం ఇదే తరహా ట్రీట్ మెంట్ దక్కింది. ఇటీవలే రాయన్, తంగలాన్ లకు సైతం పివిఆర్ ఐనాక్స్ స్క్రీన్లు ఇవ్వలేదు. అక్కడి మార్కెట్ ని మరీ సీరియస్ గా తీసుకోకపోవడంతో నిర్మాతలు పట్టించుకోలేదు. గతంలో ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2, హనుమాన్ లాంటివి లేట్ స్ట్రీమింగ్ వల్ల అధిక సంఖ్యలో స్క్రీన్లను దక్కించుకోగలిగాయి. కానీ ప్రతి ప్యాన్ ఇండియా మూవీకి అలా సాధ్యపడటం లేదు. ఎందుకంటే విజయ్ కు ఎంత ఇమేజ్ ఉన్నా డిజిటల్ వెర్షన్ కోసం రెండు నెలలు వెయిటింగ్ అంటే దాని మీదున్న క్రేజ్ చల్లారిపోతుంది. పైగా పైరసీ బెడద ఎక్కువ కాకుండా ప్రేక్షకులను అంతసేపు వెయిట్ చేయించడం కష్టం.

ఎలాగూ గోట్ తమిళ వెర్షన్ తప్ప మిగిలిన చోట ఏమంత హైప్ లేదు. మొదటి ఆట అయ్యాక ఒక్కసారిగా టాక్ జనాన్ని థియేటర్లకు పరుగులు పెట్టిస్తుందని టీమ్ చెబుతోంది కానీ అదెంత వరకు నిజమో అయిదో తేదీ ఉదయం బెనిఫిట్ షోతో తేలిపోతుంది. తెలుగులో మైత్రి పంపిణి చేస్తుండటంతో మంచి రిలీజ్ దక్కుతోంది. నాగ చైతన్యకు కస్టడీ లాంటి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు వెంకట్ ప్రభుకి దొరికిన గోల్డెన్ ఛాన్స్ ఇది. ప్రూవ్ చేసుకున్నారా స్టార్ హీరోలు తిరిగి పిలుస్తారు. రాజకీయ ప్రవేశానికి ముందు విజయ్ చేసిన చివరి సినిమాల్లో ఒకటిగా గోట్ మీద ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు అంతాఇంతా కాదు.