నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 6 దీనికి సంబంధించిన ప్రకటన రానుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ తన ఎక్స్ హ్యాండిల్ లో సింబాను పరిచయం చేస్తున్న సింహం కార్టూన్ ని పోస్ట్ చేయడం ద్వారా దీని గురించిన హింట్ స్పష్టంగా ఇచ్చాడు. షూటింగ్ ప్రారంభోత్సవం ఉండకపోవచ్చు కానీ అనౌన్స్ మెంట్ తో పాటు ప్రెస్ మీట్ ప్లాన్ చేస్తున్నారని వినికిడి. ఎక్కువ వివరాలు బయటికి రానివ్వడం లేదు. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ ప్యాన్ ఇండియా మూవీకి బడ్జెట్ కూడా ఊహకందని విధంగా ఉండబోతోంది.
ఇది కాసేపు పక్కనపెడితే ప్రశాంత్ వర్మ డిజైన్ చేసుకున్న సినిమాటిక్ యునివర్స్ కి మోక్షజ్ఞ అతి పెద్ద ప్రమోషన్ కాబోతున్నాడు. జాంబీ రెడ్డి, హనుమాన్ విజయాలు సాధించినప్పటికీ వాటి హీరో తేజ సజ్జ చిన్నవాడు. బలమైన బ్యాక్ గ్రౌండ్, అభిమానుల మద్దతు లేదు. కానీ మోక్షజ్ఞ కేసు అలా కాదు. బాలయ్య, తండ్రి ఎన్టీఆర్ అభిమానులందరూ ఎమోషనల్ గా తనతో కనెక్ట్ అవుతారు. గంపెడాశలతో మూడో తరంలో నందమూరి బ్రాండ్ ని మరింత పైకి తీసుకెళ్తాడనే నమ్మకంతో ఉన్నారు. నమ్మశక్యం కాని విధంగా మోక్షజ్ఞ కేవలం ఏడాదిన్నరలో చేసుకున్న మెకోవర్ అందరికీ ఆశ్చర్యపరిచింది.
దీనికి గాండీవ అనే టైటిల్ అనుకున్నట్టు లీక్ వచ్చింది ఇంకా నిర్ధారణగా తెలియదు. గతంలో బాలకృష్ణ హీరోగా 1993లో గాండీవం వచ్చింది కానీ ఆడలేదు. ఇటీవలే వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున చూశాం. ఇదీ డిజాస్టరే. కేవలం టైటిల్ ని బట్టి సినిమాల ఫలితాలు తేలవు కానీ ప్రశాంత్ వర్మ ఎలాంటి ప్లాన్ తో ఉన్నదో ఇంకో మూడు రోజులు ఆగితే కానీ క్లారిటీ రాదు. ప్రస్తుతం దీని మీదే పూర్తి ఫోకస్ పెడుతున్న ప్రశాంత్ వర్మ జై హనుమాన్ ని తర్వాత టేకప్ చేయబోతున్నాడు. మోక్షజ్ఞ సినిమా ఎప్పుడు రిలీజనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం. స్కేల్ ని బట్టి చూస్తే 2026 అయ్యేలా ఉంది.