ఒక సినిమా రిలీజయ్యాక దాన్ని హిట్ అనిపించుకోవడానికి హీరోలు, నిర్మాతలు పడుతున్న అగచాట్లు అన్ని ఇన్ని కావు. అందులోనూ పెద్ద చిత్రాల మధ్య ఒక చిన్న మూవీ విడుదలైతే దాని మీద అయ్యో పాపం అని జాలిపడే వాళ్లే ఎక్కువ. మొన్న గురువారం వరకు ఇదే డిస్కషన్ నడిచింది. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ కు పోటీగా ఆయ్ ని బరిలో దించినప్పుడు నిర్మాత బన్నీ వాస్, సమర్పకులు అల్లు అరవింద్ మరీ ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారనే అధిక శాతం అనుకున్నారు. అయినా సరే భయపడకుండా రిలీజ్ చేశారు. ఆగస్ట్ 15 సాయంత్రం నుంచి ప్రీమియర్లు వేసి తమ ధైర్యం ఏంటో చాటారు.
ఊహించని విధంగా ఆయ్ సూపర్ హిట్ కొట్టేసింది. మొదటి రోజు కేవలం అరవై లక్షల గ్రాస్ వస్తే నాలుగో రోజు రెండు కోట్ల ఇరవై లక్షలు వసూలు చేసింది. అది కూడా పరిమిత స్క్రీన్లు, షోలతో. దీన్ని బట్టే ఏ స్థాయి విజయమో అర్థం చేసుకోవచ్చు. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో బుక్ మై షో యాప్ ద్వారా ఆయ్ 32 వేల టికెట్లు అమ్మితే, మిస్టర్ బచ్చన్ 11 వేలు, డబుల్ ఇస్మార్ట్ 16 వేల టికెట్లకే పరిమితమయ్యాయి. వాటికైన బడ్జెట్ లో కనీసం పావు వంతు కూడా ఆయ్ కు ఖర్చయ్యిండదు. అయినా సరే ఆడియన్స్ కంటెంట్ కే పట్టంకట్టి ఆయ్ థియేటర్లకు కదిలి వెళ్లారు.
నిన్న ఆదివారం కావడంతో కొన్ని కీలక కేంద్రాల్లో రవితేజ, రామ్ కు కేటాయించిన మెయిన్ స్క్రీన్లను ఆయ్ కు మార్చడం అనూహ్యం. కొత్త కథేమీ లేకపోయినా కామెడీతో కడుపుబ్బా నవ్వించి, చివర్లో ఎమోషన్ తో కూడిన ఎలివేషన్ తో ఫుల్ టైం పాస్ చేయించిన దర్శకుడు అంజి కె మణిపుత్ర మంచి మార్కులు తెచ్చేసుకున్నాడు. హీరో నితిన్ నార్నెతో పాటు కమెడియన్లు కసిరెడ్డి, అంకిత్ కొయ్యని తమ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చడంతో ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ దూసుకెళ్తోంది. అంతకు ముందు వచ్చిన కమిటీ కుర్రోళ్ళు సైతం ఇదే తరహాలో విజయం సాధించడం మరో చక్కని పరిణామం.