బాలు నా మాట వినలేదు.. ఇళయరాజా ఉద్వేగం

Ilayaraja

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజాల బంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరూ కలిసి సంగీత ప్రియులకు వేల పాటలు అందించారు. ఎన్నో కచేరీలతో అలరించారు. వ్యక్తిగతంగానూ వీళ్లిద్దరూ ఆప్త మిత్రులు. ఒకరినొకరు సోదరుల్లా చూసుకుంటారు. ఆ మధ్య ఇద్దరి మధ్య అనుకోకుండా విభేదాలు వచ్చాయి. బాలు నిర్వహించే సంగీత కచేరీల్లో తన పాటలు వాడుకుంటున్నందుకు రాయల్టీ చెల్లించాలంటూ ఇళయరాజా నోటీసులివ్వడం కలకలం రేపింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగింది.

ఆ సంగతలా వదిలేస్తే.. గత నెల బాలు ఆరోగ్యం విషమించిందని వార్త బయటికి వచ్చినపుడు ఇళయరాజా తల్లడిల్లిపోయారు. ఎప్పుడూ ఏ విషయంలోనూ పెద్దగా ఎమోషనల్ అవ్వని ఆయన.. తీవ్ర భావోద్వేగంతో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ‘‘బాలూ.. త్వరగా లేచిరా. నీకోసం ఎదురు చూస్తున్నా. నువ్వు కచ్చితంగా తిరిగి వస్తావని నా అంతరాత్మ చెబుతోంది. అది నిజవ్వాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నాను. బాలూ.. త్వరగా రా’’ అంటూ ఆ వీడియోలో పిలుపునిచ్చారు ఇళయరాజా. ఆ వీడియో చూసిన సంగీతాభిమానులు కూడా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. కానీ ఇళయరాజా పిలుపును బాలు మన్నించలేకపోయారు. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. తన ఆప్త మిత్రుడిని కోల్పోయినా ఇళయరాజా ఇప్పుడే స్థితిలో ఉంటారో అని అభిమానులు కంగారు పడుతున్నారు.

బాలు మరణానంతరం కూడా ముందులాగే ఒక వీడియో రిలీజ్ చేశారు ఇళయరాజా. దాదాపు ఏడుస్తూ మాట్లాడిన ఆయన.. బాలు వెళ్లిపోవడం తనకెంత లోటో వివరించారు. ‘‘బాలూ.. నీ కోసం నేను ఎదురు చూస్తుంటానని చెప్పాను.. కానీ నా మాట వినకుండా వెళ్లిపోయావు. నా నోటివెంట మాట రావడం లేదు. ఎక్కడికి వెళ్లావు? ఎందుకు వెళ్లావు? గంధర్వుల కోసం పాడేందుకు వెళ్లావా? ఇక ప్రపంచంలో నేను దేన్నీ చూడలేను. ఎంతటి దుఃఖానికైనా ఓ హద్దు ఉంటుంది.. కానీ నీ విషయంలో దానికి పరిమితి లేదు” అంటూ ఇళయరాజా ఉద్వేగానికి గురైన తీరు సంగీతాభిమానులకు కంటతడి పెట్టించింది.