ఏ అడ్డంకులు రాకుండా పుష్ప 2 ది రూల్ కనక ముందు చెప్పినట్టు ఆగస్ట్ 15 విడుదలయ్యి ఉంటే ఈవారం దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్ అయ్యేది. బంగారం లాంటి ఛాన్స్ మిస్సయ్యిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇండిపెండెన్స్ డేకి ఎంత స్టామినా ఉందో స్త్రీ 2 లాంటి మీడియం బడ్జెట్ మూవీకి వస్తున్న వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. ఒక కామెడీ హారర్ సినిమా అందులోనూ రాజ్ కుమార్ రావు లాంటి చిన్న హీరో, శ్రద్ధ కపూర్ లాంటి టయర్ 2 హీరోయిన్ చిత్రానికి మొదటి రోజు వంద కోట్ల రేంజ్ లో వసూళ్లు ఎవరైనా ఊహించగలరా. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డులు ఆశించగలరా.
స్త్రీ 2 సునామి చూసి తలలు పండిన బాలీవుడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. పోటీలో ఉన్న ఖేల్ ఖేల్ మే, వేదా, డబుల్ ఇస్మార్ట్ లను దరిదాపుల్లో లేకుండా తరిమికొట్టే స్థాయిలో చెలరేగిపోవడం చూసి నోటమాట రావడం లేదు. ముంబై లాంటి నగరాల్లో వీకెండ్ లో కూడా అర్ధరాత్రి షోలు వేస్తుంటే అవన్నీ ఫుల్ అవుతున్నాయి. దీన్ని బట్టే రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు సినిమా బాగుండటం, రివ్యూలలో ప్రశంసలు దక్కడం కలెక్షన్లను ఇట్టే పెంచుతున్నాయి. స్త్రీ 2 ఏకంగా బాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచినా ఆశ్చర్యం లేదని భోగట్టా.
ఒకవేళ పుష్ప 2 కనక వచ్చి ఉంటే స్త్రీ 2 సహా ఎవరూ పోటీలో ఉండేవాళ్ళు కాదు. మన సైడ్ కూడా మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ తప్పుకునేవి. కొంచెం అటుఇటుగా కల్కి 2898 ఏడి ఓపెనింగ్ దక్కేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సుదీర్ఘమైన వీకెండ్ తో పాటు హోలీ పండగ లాంటి అంశాలు కలిసి వచ్చేవని అంటున్నారు. ఇప్పుడు చూస్తేనేమో తెలుగులో ఏ స్ట్రెయిట్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. తంగలాన్ కూడా వారం ముచ్చటలాగే కనిపిస్తోంది. ఇప్పుడు అల్లు అర్జున్ కనక సీన్ లో ఉంటే బుక్ మై షో క్రాష్ అవ్వడం, టికెట్ల కోసం జనాలు ఎగబడటం చూసేవాళ్ళం. ఛాన్స్ మిస్.