వీరమల్లుకే పవన్ కళ్యాణ్ మొదటి ఓటు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ ఊపిరి సలపనంత బిజీగా రాజకీయ వ్యవహారాల్లో తలమునకలై ఉన్నారు. సినిమాలు చేసేంత తీరిక లేకపోయినా ముందే ఇచ్చిన కమిట్ మెంట్లను పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దానికి అనుగుణంగా డేట్లు ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందరూ అనుకున్నట్టు మొదటి ప్రాధాన్యత ఓజి కాదని సమాచారం. హరిహర వీరమల్లు బ్యాలన్స్ తొలుత ఫినిష్ చేసే దిశగా పనులు ప్రారంభమయ్యాయి. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో స్టంట్ సిల్వా యాక్షన్ నేతృత్వంలో 500 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా యుద్ధం ఎపిసోడ్ తీస్తున్నారట.

మరికొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ ఈ సెట్లో అడుగు పెడతారు. రెండు భాగాలుగా రూపొందుతున్న హరిహర వీరమల్లుని డిసెంబర్ లో రిలీజ్ చేయాలనేది నిర్మాత ఏఎం రత్నం సంకల్పం. అయితే రామ్ చరణ గేమ్ ఛేంజర్ అదే నెలలో వస్తున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ కు సంబంధించిన పనులైతే జరుగుతున్నాయని సమాచారం. బ్రేక్ రావడానికి ముందు వరకు దర్శత్వం వహించిన క్రిష్ ఇప్పుడీ వ్యవహారాలు చూసుకునే తీరికలో లేరు. అనుష్క ఘాజితో బిజీ అయ్యారు. ఇప్పుడీ బాధ్యత మొత్తం రత్నంగారబ్బాయి జ్యోతికృష్ణ మీదే పడింది.

హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన హరిహర వీరమల్లులో ఔరంగజేబుగా బాబీ డియోల్ కీలక పాత్ర పోషించాడు. పవన్ ఫ్యాన్స్ ఓజి కోసమే ఎక్కువ ఎదురు చూస్తున్నప్పటికీ ఒకవేళ వీరమల్లు కనక ముందే వచ్చే పనైతే ప్రమోషన్లు మొదలయ్యాక హైప్ వద్దన్నా పెరిగిపోతుంది. సెప్టెంబర్ 2 పవన్ పుట్టినరోజు నేపథ్యంలో ఈ రెండు సినిమాల్లో ఒకదాని రిలీజ్ డేట్ ప్రకటన ఉంటుందేమోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ఆ సూచనలు కనిపించడం లేదు. టీజర్లు లేదా పోస్టర్లతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. షూటింగ్ చివరి దశలో తప్ప విడుదల తేదీలు లాక్ చేసుకునే పరిస్థితి లేదు.