తన కష్టానికి ఎన్ని అవార్డులైనా తక్కువే..

విలక్షణ నటుడు.. ఈ మాట వినగానే అందరికీ కమల్ హాసన్ గుర్తుకొచ్చేవారు. సినిమాకు సినిమాకు పాత్ర పరంగా, లుక్ పరంగా వైవిధ్యం చూపించడంలో ఆయన్ని మించిన వారు లేరనే అభిప్రాయం ఉండేది. ఒకే సినిమాల్లో రకరకాల గెటప్పుల్లో.. గుర్తుపట్టలేని విధంగా కనిపించి ఆశ్చర్యపరిచేవారు కమల్.

ఐతే తర్వాతి తరంలో కమల్‌ను మ్యాచ్ చేయగల వైవిధ్యమైన హీరో అంటే విక్రమ్ అనే చెప్పాలి. తన ప్రతిభ గురించి.. డెడికేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. పాత్ర కోసం అతను ఏం చేయడానికైనా సిద్ధం.

‘సేతు’ అనే సినిమాలో నల్లగా, బలహీనంగా కనిపించడం కోసం గంటల తరబడి ఎండలో నిలబడ్డం, తిండి మానేయడం తనకే చెల్లింది. స్టార్ ఇమేజ్ సంపాదించాక కూడా అతడి తపన పెరిగిందే తప్ప తగ్గలేదు. పితామగన్ (శివపుత్రుడు), అన్నియన్ (అపరిచిడుతు), ఐ లాంటి సినిమాల విక్రమ్ ఎంత శ్రమించాడో అందరికీ తెలిసిందే. కేవలం మేకప్‌తో మేనేజ్ చేయడం కాకుండా ఒళ్ళు హూనం చేసుకుని పాత్ర కోసం లుక్ మార్చుకోవడం విక్రమ్‌కే చెల్లు.

ఇప్పుడు విక్రమ్ ‘తంగలాన్’ అనే సినిమాతో పలకరించాడు. ఇన్నాళ్లూ చేసిన పాత్రలన్నీ ఒకెత్తు.. ఇదొక ఎత్తు అనేలా ఉంది తంగలాన్ క్యారెక్టర్. ఇందులో విక్రమ్ లుక్ గురించి.. నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా మొదలైన కొన్ని నిమిషాలకే మనం చూస్తున్నది విక్రమ్ అనే నటుడిని అని మరిచిపోతాం. తంగలాన్ అనే పాత్రతో కనెక్ట్ అయిపోతాం.

అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు విక్రమ్. ఆ పాత్ర కోసం తన అవతారం మార్చుకోవడానికి.. మేకప్ కోసం విక్రమ్ ఎంత కష్టపడి ఉంటాడన్నది ఊహించడం కూడా కష్టం. ఇక నటన పరంగా కూడా విక్రమ్ ఔరా అనిపించాడు. అద్భుతమైన హావభావాలతో ఆ పాత్రను పండించాడు.

సినిమా కొంచెం ఎగుడు దిగుడుగా అనిపించినా.. కేవలం విక్రమ్ కోసం ఈ సినిమా చూడొచ్చంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాతో పలు పురస్కారాలను విక్రమ్ కొల్లగొడతాడనడంలో సందేహం లేదు. మరోసారి జాతీయ అవార్డు కూడా అందుకుంటాడేమో చూడాలి.