గత నెల రోజులుగా జోష్ లేకుండా సాగిపోతున్న ఇండియన్ బాక్సాఫీస్‌లో ఇండిపెండెన్స్ డే వీకెండ్ హుషారు తెచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. వివిధ భాషల్లో క్రేజీ సినిమాలు రిలీజవుతున్నాయి ఈ వారాంతంలో. తెలుగులో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లాంటి మాస్ మూవీస్ మంచి బజ్ మధ్య రిలీజవుతున్నాయి.
చిన్న సినిమా అయిన ‘ఆయ్’కి కూడా యూత్‌లో క్రేజ్ కనిపిస్తోంది. ఇక తమిళంలో ‘తంగలాన్’ అనే భారీ చిత్రం వస్తోంది. అది తెలుగులోనూ మంచి అంచనాల మధ్య రిలీజవుతోంది.
ఇక హిందీలో అయితే ఈ వీకెండ్లో మూడు క్రేజీ సినిమాలు రిలీజవుతున్నాయి. అవే.. ఖేల్ ఖేల్ మే, వేదా, స్త్రీ-2. ‘ఖేల్ ఖేల్ మే’లో అక్షయ్ కుమార్ సహా భారీ తారాగణం ఉన్నారు. ‘వేదా’లో యాక్షన్ హీరో జాన్ అబ్రహాం హీరో. ‘స్త్రీ’లో రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ముఖ్య పాత్రలు పోషించారు. తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది.
ఐతే కాస్టింగ్, రేంజ్ పరంగా చూస్తే ‘ఖేల్ ఖేల్ మే’ నంబర్ వన్ స్థానంలో ఉంటే.. ‘వేదా’కు రెండో స్థానం దక్కుతుంది. ‘స్త్రీ-2’ మూడో స్థానంలో ఉంటుంది. కానీ ప్రేక్షకాసక్తిలో మాత్రం ‘స్త్రీ-2’నే ఎక్కువ మార్కులు కొట్టేస్తోంది. ఇది అప్పట్లో సూపర్ హిట్ అయిన ‘స్త్రీ’ మూవీకి సీక్వెల్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్‌లో మిగతా రెండు చిత్రాలకు ‘స్త్రీ-2’కు పోలికే లేదు. 24 గంటల వ్యవధిలో ‘స్త్రీ-2’ చిత్రానికి 22 వేల టికెట్లు తెగితే.. ఖేల్ ఖేల్ మే, వేదా చిత్రాలకు రెంటికీ కలిపినా అన్ని టికెట్లు అమ్ముడవలేదు. దీన్ని బట్టే దయ్యం సినిమా మీద ప్రేక్షకుల ఆసక్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
దాని ముందు స్టార్ హీరోలు నటించిన సినిమాలు వెలవెలబోయే పరిస్థితి కనిపిస్తోంది. టాక్ బాగుంటే ‘స్త్రీ-2’ బ్లాక్ బస్టర్ కావడం ఖాయం. మరి ఖేల్ ఖేల్ మే, వేదా చిత్రాలకు ఎలాంటి టాక్ వస్తుందో.. అవెలా పెర్ఫామ్ చేస్తాయో చూడాలి.