దేవర నుంచి విడుదలైన రెండో పాట ‘చుట్టమల్లే’ అనుకున్న కార్యం నెరవేర్చింది. స్లో పాయిజన్ లాగా మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకున్న వైనం సోషల్ మీడియా ట్రెండ్స్ లో కనిపిస్తోంది. ఇన్స్ టా రీల్స్, ఎక్స్, ఫేస్ బుక్ అన్నిటిలోనూ దీని తాలూకు కవర్స్ చేస్తున్న వాళ్ళ సంఖ్య పెద్దదే ఉంది. శ్రీలంకన్ సింగర్ యోహాని పాడిన సాంగ్ ని స్ఫూర్తిగా తీసుకుని అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేశాడనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆ వివాదం కూడా పాపులారిటీకి తోడ్పడుతోంది. ఒరిజినల్ సృష్టికర్త చమత్ సంగీత్ ఈ వ్యవహారం పట్ల పాజిటివ్ గా స్పందించడం సానుకూలాంశం.
ఇక చుట్టమల్లే సంగతికొస్తే తొలుత మిశ్రమ స్పందన కనిపించినా క్రమంగా ఇతర హీరోల పాటలకు దీన్ని మిక్స్ చేసి మరీ ఫ్యాన్స్ షేర్ చేసుకోవడం చూస్తే రీచ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ నచ్చకపోతే ఇలా రీమిక్స్ చేయరుగా అనేది జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల వెర్షన్. ఇప్పటిదాకా అనిరుద్ ఇచ్చిన రెండు పాటలు ఛార్ట్ బస్టర్ అయినట్టే. దేవర ముంగిట జాగ్రత్త అంటూ వచ్చిన ఫియర్ సాంగ్ భారీ రెస్పాన్స్ దక్కించుకోగా ఇప్పుడీ చుట్టమల్లే కూడా మొత్తం చుట్టేలాగే కనిపిస్తోంది. యూట్యూబ్ తదితర మ్యూజిక్ ప్లాట్ ఫార్మ్స్ లో నమోదవుతున్న వ్యూస్ దీన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఇక బ్యాలన్స్ ఉన్న రెండు పాటలు ఎలా ఉంటాయోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 27 విడుదలకు రెడీ అవుతున్న దేవర చేతిలో ఇంకో యాభై రోజుల సమయం మాత్రమే ఉంది. డబ్బింగ్, రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ఈవెంట్ ప్లానింగ్ తదితర పనులు బోలెడున్నాయి. దర్శకుడు కొరటాల శివ మీద మాములు ఒత్తిడి లేదు. ముందు అనుకున్న అక్టోబర్ 10 వదిలేయడంతో అది సూర్య కంగువ తీసేసుకుంది. సో ఖచ్చితంగా డేట్ కు కట్టుబడటం తప్ప దేవరకు వేరే ఆప్షన్ లేదు. చుట్టమల్లే వల్ల జరిగిన ఇంకో ప్రయోజనం జాన్వీ కపూర్ గ్లామర్ ని సరిగ్గా తెరమీద చూపించిన దర్శకుడు దొరకడం.