స్టార్ హీరోల పెద్ద మనసుకు సాక్ష్యాలు

వరదలు వచ్చింది కేరళలో. అక్కడ తెలుగు సినిమాలు ఆడిన దాఖలాలు తక్కువ. ఆర్ఆర్ఆర్, కల్కి లాంటివి తప్ప అద్భుతాలు చేసినవి వేళ్ళ మీద లెక్కబెట్టొచ్చు. అల్లు అర్జున్ కు తప్ప మిగిలిన స్టార్లు ఎవరూ తమకంటూ ప్రత్యేక మార్కెట్ సంపాదించుకోలేకపోయారు. అయినా సరే అక్కడ వరదల భీభత్సం చూసి టాలీవుడ్, కోలీవుడ్ నటీనటుల హృదయాలు తల్లడిల్లిపోయాయి. పొరుగు రాష్ట్రంలో వందలాది మంది మృతి చెంది వేలాది జనాభా ఆశ్రయం కోసం అల్లాడిపోతున్న వైనం చూసి కరిగిపోయారు. అందుకే మార్కెట్, ఇమేజ్ లెక్కలు వేసుకోకుండా తమవంతుగా చేయూతనిస్తున్నారు.

డార్లింగ్ ప్రభాస్ 2 కోట్లు, మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ సంయుక్తంగా కోటి, అల్లు అర్జున్ 25 లక్షలు, సూర్య కుటుంబం 50 లక్షలు, నయనతార జంట 20 లక్షలు, తండ్రీకొడుకులు మమ్ముట్టి దుల్కర్ సల్మాన్ 35 లక్షలు, ఫహద్ ఫాసిల్ – కమల్ హాసన్ విడివిడిగా చెరో పాతిక లక్షలు, విక్రమ్ 20 లక్షలు, రష్మిక మందన్న 10 లక్షలు ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు భూరి విరాళాలు అందిస్తున్నారు. మల్లువుడ్ హీరోలు సైతం ఇంత కాంట్రిబ్యూట్ చేయకపోవడం గమనించాల్సిన విషయం. ఏవైనా పరిమితులు ఉండొచ్చేమో కానీ మొత్తానికి తెలుగు తమిళ హీరోలు స్పందించిన విధానం అనూహ్యం.

విపత్తు ఎక్కడ వచ్చినా ఖచ్చితంగా చందాలు ఇవ్వాలన్న నిబంధన లేకపోయినా హీరోలు స్వచ్చందంగా ఇలా ముందుకు రావడం హర్షించదగ్గ విషయం. వయనాడ్ విలయం చూస్తే ఎవరికైనా కళ్ళు చెమరుస్తాయి. కొందరు యాంటీ ఫ్యాన్స్ దీని మీద కూడా అక్కసు వెళ్లగక్కుతున్న వాళ్ళు లేకపోలేదు. వరదల వల్ల కేరళలో సినిమాలు సైతం సరిగా విడుదల కావడం లేదు. కొత్త రిలీజులు చూసే స్థితిలో ప్రేక్షకులు లేకపోవడంతో ట్రేడ్ తీవ్ర నిరాశలో ఉంది. పరిస్థితి చక్కబడేందుకు ఇంకో రెండు మూడు వారాలు పట్టేలా ఉండటంతో అప్పటిదాకా కేరళ బాక్సాఫీస్ చప్పగా ఉండబోతోంది.