‘దసరా’ విలన్ పాత్రతో తెలుగులో చాలా మంచి పేరు సంపాదించాడు మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. అతను తర్వాత ‘రంగబలి’ సహా కొన్ని చిత్రాల్లో నటించాడు. త్వరలో విడుదల కానున్న ‘దేవర’లోనూ షైన్ నటించాడు. మలయాళంలో కూడా అతను విలక్షణమైన పాత్రలు చేశాడు. తెర మీదే తను చేసే పాత్రలే కాదు.. బయట తన చర్యలు కూడా విచిత్రంగా ఉంటాయి.
సినిమా వేడుకల్లో స్టేజ్‌ల మీద, బయట ఇంటర్వ్యూలు ఇచ్చినపుడు తన ప్రవర్తన చిత్ర విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడేం చేస్తాడో తెలియదన్నట్లుగా ఉంటుంది తన తీరు. ఐతే దీనికి కారణం తనకున్న అరుదైన వ్యాధి అని షైన్ టామ్ చాకో వెల్లడించడం గమనార్హం. తాను అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ఎడిహెచ్డి)తో బాధపడుతున్నట్లు షైన్ వెల్లడించాడు.
ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తులు తరచుగా ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారని.. తమను చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు గుర్తించాలని కోరుకుంటారని.. ఇతర నటుల నుండి ప్రత్యేకంగా నిలబడటానికి ప్రయత్నిస్తారని షైన్ తెలిపాడు. ఈ డిజార్డర్ వల్ల తన నిశ్చితార్థం కూడా చెడిపోయినట్లు అతను వెల్లడించాడు.
ఈ ఏడాది జనవరిలో తనూజ అనే అమ్మాయితో షైన్ తన రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించాడు. వాళ్లిద్దరూ తర్వాత నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. తమ ఎంగేజ్‌మెంట్ ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు షైన్. త్వరలో పెళ్లి తేదీని ప్రకటిస్తారని అందరూ ఎదురు చూస్తుండగా.. తనూజతో తన బంధం పెళ్లి కాకుండానే ముగిసిందని వెల్లడించాడు. తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తనూజాతో కలిసున్న ఫొటోలను తొలగించాడు. తనకున్న సమస్యే ఈ బంధం చెడిపోవడానికి కారణమన్నట్లుగా షైన్ తెలిపాడు. ఐతే దీన్ని తానొక వ్యాధిలా భావించనని.. తనకున్న స్పెషల్ క్వాలిటీగా అనుకుంటానని షైన్ చెప్పడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates