మంచి విషయం ఉన్న సినిమాను వెండి తెరపై తక్కువ ధరలతో చూసే అవకాశం కల్పిస్తే ప్రేక్షకులు ఎలా థియేటర్లకు క్యూ కడతారో కల్కి 2898 ఏడీ సినిమా రుజువు చేస్తోంది. ఈ చిత్రాన్ని తొలి రెండు వారాల్లో అదనపు రేట్లతో నడిపించారు.
ఇలాంటి బంపర్ క్రేజున్న సినిమాలను వెంటనే చూసేయాలని ఆశపడే ప్రేక్షకులు ఆ రేట్లతోనే చూశారు. ఇది థియేటర్లలో మాత్రమే చూడాల్సిన విజువల్ వండర్ అనే టాక్ రావడంతో రెండో వారం తర్వాత నార్మల్ రేట్లతో ప్రేక్షకులు పెద్ద సంఖ్యలోనే సినిమా చూశారు.
బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పోటీ లేకపోవడం కూడా కల్కికి బాగా కలిసొచ్చింది. ఇక సినిమా థియేట్రికల్ రన్ నెల రోజులు పూర్తయ్యాక కల్కి టీం మరో ఐడియా వేసింది. రేట్లను నార్మల్ స్థాయి నుంచి తగ్గించి వంద రూపాయలకే ఈ చిత్రాన్ని చూసే అవకాశం లభించింది.
ఇలాంటి భారీ చిత్రాన్ని ఆలస్యంగా అయినా సరే వంద రూపాయలతో మంచి స్క్రీన్లలో చూసే అవకాశం వస్తే ప్రేక్షకులు ఎందుకు కాదనుకుంటారు. దీంతో రిలీజై 40 రోజులు కావస్తున్నా కల్కి మంచి ఆక్యుపెన్సీలతో నడుస్తోంది. ఈ సోమవారం నాడు బుక్ మై షోలో కల్కి టికెట్లు 10 వేలకు పైగా అమ్ముడయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
కల్కి రిలీజయ్యాక గత ఐదు వారాల్లో ఏ ఒక్క సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకోలేదు. సరిగా పెర్ఫామ్ చేయలేదు. ఇది కల్కికి బాగా కలిసొచ్చింది. సినిమాకు మంచి టాక్ రావడం, పోటీ లేకపోవడం.. దీనికి తోడు టికెట్ల ధరలు తగ్గించడం వల్ల ఇప్పటికీ బాక్సాఫీస్ లీడర్‌గా కొనసాగుతోంది.
మంచి సినిమాలకు టికెట్ల ధరలు అందుబాటులో ఉంటే ప్రేక్షకులను థియేటర్లకు ఎక్కువ రోజుల పాటు థియేటర్లకు రప్పించవచ్చు. సినిమాకు లాంగ్ రన్ ఉంటుంది. ఒక్కో టికెట్ మీద వచ్చే ఆదాయం తగ్గినా ఆక్యుపెన్సీలు పెరగడం వల్ల లాభాలు పెంచుకోవచ్చు. ఈ మోడల్‌ను మిగతా పెద్ద సినిమాలు కూడా అనుసరిస్తే ప్రయోజనం ఉంటుంది.