టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్య కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. తండేల్. దాదాపు వంద కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా పేరు.. ఫస్ట్ పోస్టర్.. టీజర్ అన్నీ కూడా ఎగ్జైటింగ్‌గా అనిపించాయి. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ‘తండేల్’ షెడ్యూల్ ప్రకారం అయితే క్రిస్మస్‌కు రిలీజ్ కావాల్సి ఉంది. ఐతే అదే సమయానికి ‘గేమ్ చేంజర్’ వచ్చేలా ఉండడంతో డేట్ మారొచ్చేమో.
రిలీజ్ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమా కథేంటో చాలా ముందుగానే బయటపెట్టేశాడు నిర్మాత బన్నీ వాసు. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘ఆయ్’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘తండేల్’ కథను విడమరిచి చెప్పేశాడు బన్నీ వాసు. ఇంతకీ ఈ సినిమా కథేంటో బన్నీ వాసు మాటల్లోనే తెలుసుకుందాం.
“తండేల్ అనేది వాస్తవంగా జరిగిన కథ. 21 మంది జాలరులు శ్రీకాకుళం దగ్గరున్న మచిలేశ్వరం నుంచి గుజరాత్ దగ్గర పని చేయడానికి కాంట్రాక్ట్ బేసిస్ మీద వెళ్లారు. అక్కడి నుంచి సముద్ర మార్గంలో పాకిస్థాన్‌కు తక్కువ సమయంలో వెళ్లిపోవచ్చు. అక్కడ సరిహద్దు గొడవలు జరుగుతుంటాయి. అక్కడ పని చేస్తున్న వాళ్లు అనుకోకుండా పాకిస్థాన్ వాటర్స్‌లోకి వెళ్లిపోవడం.. సైన్యానికి దొరికిపోవడం నేపథ్యంలో కథ నడుస్తుంది. వాళ్లు పాక్ సైన్యానికి దొరికింది చాలా సంక్లిష్టమైన సమయంలో. అప్పుడే కశ్మీర్లో ఆర్టికల్ 371 వచ్చింది. మన దేశం మీద ఒక టెర్రర్ ఎటాక్ కూడా జరిగింది. ఇలా మూడేళ్లలో చాలా కీలకమైన మూడు ఘటనలు జరిగాయి. ఇలాంటి ఉదంతాలు జరుగుతున్నపుడు వాళ్లు అక్కడ చిక్కుకుపోయారు. అయినా సరే.. చాలా తక్కువ సమయంలోనే వాళ్లు బయటికి రాగలిగారు. అది ఎలా అన్నదే ఈ కథ.
ఇందులో ఒక అందమైన ప్రేమకథ కూడా ఉంటుంది. ఆ 21 మంది కోసం ఆడవాళ్లు ఎలా ఫైట్ చేశారు అన్నది కూడా చూపిస్తాం. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. మన సినిమాల్లో కనిపించే మంచి మూమెంట్స్ ఇందులో ఉంటాయి. అదే సమయంలో కొత్తగా అనిపిస్తుంది. అనుకోకుండా మంచి కథ దొరికింది. ప్రేక్షకులను మచిలేశ్వరం నుంచి కరాచికి తీసుకెళ్తాం” అని బన్నీ వాసు చెప్పాడు.