మరో షాక్ తిన్న జాన్వీ కపూర్

టాలీవుడ్ కు త్వరలో పరిచయం కాబోతున్న జూనియర్ అతిలోకసుందరి జాన్వీ కపూర్ కి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో కరెంట్ షాక్ కొట్టింది. నిన్న విడుదలైన ఉలజ్ నెగటివ్ రివ్యూలతో పాటు పబ్లిక్ టాక్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో డిజాస్టర్ వైపుగా పరుగులు పెడుతోందని విశ్లేషకులు ముందస్తుగా అంచనాలు వేస్తున్నారు. అజయ్ దేవగన్ ఆరోన్ మే కహా ధం తాతో పోటీ పడుతూ థియేటర్లకు వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ మీద సరైన ప్రమోషన్లు లేని కారణంగా బజ్ అంతంత మాత్రంగా ఉంది. ముందు రోజు అడ్వాన్స్ బుకింగ్స్ మరీ వీక్ గా ఉండటం ఈ విషయాన్ని తేటతెల్లం చేశాయి.

ఎప్పుడో 2018లో వచ్చిన అలియా భట్ రాజీని అనుకరించబోయి ఉలజ్ దర్శక నిర్మాతలు బోల్తా పడ్డారు. ఒక సీక్రెట్ మిషన్ మీద అండర్ కవర్ గా లండన్ కు వెళ్లిన ఒక మహిళా రాయబారి చుట్టూ దర్శకుడు సుధాన్షు సారియా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆసక్తి లేని కథా కథనాలు, అండర్ బడ్జెట్, గ్రిప్పింగ్ గా సాగాల్సిన ఎపిసోడ్స్ ని చప్పగా తేల్చేయడం లాంటి అంశాలు అవుట్ ఫుట్ ని దెబ్బ కొట్టాయి. పైగా జాన్వీ కపూర్ వయసు, ఇమేజ్ కి మించిన పాత్ర కావడంతో అది కూడా మైనస్ గా నిలిచింది. మొత్తంగా చెప్పాలంటే ఉలజ్ ఉత్తుత్తి వ్యవహారంగా ఉందంటూ పబ్లిక్ పెదవి విరిచారు.

జాన్వీ కపూర్ ఇకపై సోలోగా తన మీద ఆధారపడే సినిమాలు తగ్గిస్తే మంచిదేమో. గుడ్ లక్ జెర్రీ, మిలి, రూహీ, గుంజన్ సక్సేనా ఇవేవి ఆశించిన ఫలితాలు అందుకోలేదు. దర్శకులు తన భుజాల మీదే బరువంతా పెట్టి లాగించారు. పెర్ఫార్మన్స్ పరంగా ఒకటి రెండింటిలో మెప్పించింది కానీ పదే పదే ఆమెని టైటిల్ రోల్స్ లో పెట్టి తీయడం వల్ల అంత ఒత్తిడిని మోయలేకపోతోంది. జూనియర్ ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ 16లతో చక్కగా ఇక్కడే కెరీర్ సెట్ అయ్యేలా జాన్వీ కపూర్ ప్లాన్ చేసుకుంటే బెటర్. లేదంటే ఇలాంటి ఉలజ్ లు మార్కెట్ తగ్గించడానికి తప్ప ఇంకెందుకు ఉపయోగపడవు.