సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ప్రేమను ప్రదర్శించే విషయంలో మిగిలినవాళ్ల కంటే ఒక అడుగు ముందే ఉంటారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదేమో. కొత్త సినిమాలకు హడావిడి చేయడంలో ఎలాంటి వింత ఉండదు కానీ రీ రిలీజులు, రీ రీ రిలీజులకు సైతం విపరీతంగా ఎగ్జైట్ అవ్వడం వీళ్ళకే చెల్లింది. ఈ నెల ఆగస్ట్ 9 మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఎస్ఎస్ఎంబి 29 తాలూకు అప్డేట్ ఏమి ఉండకపోవడంతో ఒక్కడు, మురారిలతో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీటిలో ఒక్కడు గత ఏడాది కాలంలో రెండుసార్లు పలకరించింది. అయినా సరే టికెట్లు అమ్ముడుపోతున్నాయి.
ఇక మురారికి వస్తున్న క్రేజ్ చూసి బయ్యర్లు ఆశ్చర్యపోతున్నారు. ఏదో కొత్త సినిమా రేంజ్ లో ఓపెనింగ్ కలెక్షన్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అంతే కాదు దీన్ని థియేటర్లో మిస్ అయిన ఆడియన్స్ ఫామిలీస్ తో కలిసి వస్తాయని నమ్మకంగా చెబుతున్నారు. టీవీ ఛానల్, యూట్యూబ్ లలో బోలెడుసార్లు చూసిందే అయినా పెద్ద తెరమీద మణిశర్మ సంగీతాన్ని ఆస్వాదిస్తూ, మహేష్ నటనని ఎంజాయ్ చేస్తూ, కృష్ణవంశీ దర్శకత్వంలో ఓలలాడుతూ ఉంటే కలిగే ఆనందం వేరు. ముఖ్యంగా ఇప్పుడు పాతిక ముప్పై ఏళ్ళ వయసున్న మహేష్ ఫ్యాన్స్ మాత్రం దీన్ని మిస్ చేసుకునే ఉద్దేశంలో లేరు.
ఇంకోవైపు ఒక్కడు పరిమిత షోలే అయినా త్వరగా సోల్డ్ అవుట్ అవుతున్నాయి. ఆల్రెడీ హైదరాబాద్ గ్రాస్ లక్షకు దగ్గరగా ఉంది. ఇంకా అదనపు షోలు జోడిస్తారు. ఇక మురారి రెగ్యులర్ నాలుగు ఆటలతో మెయిన్ థియేటర్లలో నాలుగైదు రోజుల నుంచి వారం దాకా ఆడించే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. ఆగస్ట్ 9 కమిటీ కుర్రాళ్ళు, తుఫాన్, సింబ, భవనం, పాగల్ వర్సెస్ కాదల్ అంటూ అన్నీ చిన్న చిత్రాలే ఉన్నాయి. సో మురారికిది పెద్ద సానుకూలాంశంగా మారుతుంది. ఖుషి, ఆరంజ్ రేంజ్ లో రీ రిలీజ్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని ట్రేడ్ మాట్లాడుకుంటోంది. అదే నిజమైనా ఆశ్చర్యం లేదు.