వ్యక్తిగత జీవితానికి సంబంధించి లావణ్య అనే అమ్మాయి పెట్టిన కేసులో విచారణ ఎదుర్కుంటున్న హీరో రాజ్ తరుణ్ అప్పటి నుంచి మీడియా ముందుకు రాని సంగతి తెలిసిందే. ఆరోపణలు వచ్చిన మొదటి రోజు మాట్లాడాడు కానీ కేసు ఫైలయ్యాక మాత్రం కనిపించలేదు. అంత పెద్ద బడ్జెట్ తో నిర్మించిన పురుషోత్తముడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సైతం హాజరు కాలేదు. ఎల్లుండి విడుదల కాబోతున్న తిరగబడరా సామీ కోసం కెమెరా ముందు ప్రత్యక్షమయ్యాడు. ఊహించినట్టే మీడియా నుంచి ఎక్కువ కేసుకు సంబంధించిన ప్రశ్నలే ఎదురుకావడంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు.
కేవలం సినిమా గురించే మాట్లాడదామని చెప్పినా జర్నలిస్టులు వినే పరిస్థితి లేకపోవడంతో ఫైనల్ గా వివాదం గురించి నోరు విప్పాడు. ఆమె చేసిన అలిగేషన్లకు సంబంధించి అవి తప్పని నిరూపించేందుకు పూర్తి ఆధారాలు ఉన్నాయని, వేరే పేర్లు కూడా వాటిలో ఇన్వాల్వ్ కావడం వల్ల అన్నీ బయట పెట్టలేకపోతున్నానని చెప్పిన రాజ్ తరుణ్ మనస్థాపం చెందడం వల్లే పురుషోత్తముడు ప్రమోషన్లలో పాల్గొనలేదని క్లారిటీ ఇచ్చాడు. తన తరఫున లాయర్ వెళ్లిన క్రమాన్ని సమర్ధించుకున్న ఈ యూత్ హీరో ఒక దశలో పదే పదే అవే ప్రశ్నలు రిపీట్ కావడంతో అసహనానికి గురయ్యాడు.
అన్ని నిజాలు త్వరలో బయటపడతాయని, చట్టప్రకారం న్యాయం జరుగుతుందని చెప్పిన రాజ్ తరుణ్ అంతకు మించి మరింత లోతుగా సమాధానం చెప్పేందుకు ఇష్టపడలేదు. కాసేపు సరదాగా మాట్లాడినప్పటికీ కేసు క్వశ్చన్లు మాత్రం విపరీతంగా ఇబ్బంది పెట్టిన వైనం కనిపించింది. యజ్ఞం ఫేమ్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన తిరగబడరా సామీలో హీరోయిన్ గా నటించిన మాన్యా మల్హోత్రా మీద సైతం కేసు నమోదైన నేపధ్యంలో ఆమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎన్నడూ లేని రీతిలో రాజ్ తరుణ్ ప్రెస్ మీట్ కు భారీ సంఖ్యలో జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు హాజరు కావడం విశేషమనే చెప్పాలి.