25 సంవత్సరాల ‘రాజకుమారుడు’ ప్రయాణం

ఇవాళ ఘట్టమనేని అభిమానులకు చాలా ప్రత్యేకమైన రోజు. సరిగ్గా పాతికేళ్ల క్రితం ఇదే రోజు జూలై 30న మహేష్ బాబు హీరోగా మొదటి సినిమా రాజకుమారుడు విడుదలయ్యింది. సూపర్ స్టార్ కృష్ణ లెగసినీ కొనసాగించే వారసుడిగా ఆ సమయంలో మహేష్ మీద ఉన్న అంచనాలు మాములువి కాదు.

బాలనటుడిగా పలు చిత్రాల్లో మెప్పించినప్పటికీ సోలో హీరోగా మారే క్రమంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. 1990లో బాలచంద్రుడు రిలీజయ్యాక మేకప్ కు స్వస్తి చెప్పిన మహేష్ పూర్తిగా చదువుకు అంకితమైపోయాడు. 1993లో యమలీల కథతో ఎస్వి కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలు వచ్చినప్పుడు కృష్ణ కొన్నాళ్ళు ఆగమన్నారు.

అంత ఎదురుచూసే పరిస్థితి లేకపోవడంతో అలీ హీరోగా రూపొంది బ్లాక్ బస్టర్ సాధించింది. అదే సమయంలో అగ్నిపర్వతం లాంటి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కృతజ్ఞతతో వైజయంతి మూవీస్ అధినేత అశ్వినిదత్ చేసిన అభ్యర్థనని కృష్ణ మన్నించి మహేష్ బాబు డెబ్యూ బాధ్యతలు ఆయనకు అప్పజెప్పారు.

ఆ సమయంలో మంచి స్వింగ్ లో ఉన్న పరుచూరి బ్రదర్స్ చెప్పిన కథ సింగల్ సిట్టింగ్ లో ఓకే అయిపోయింది. వెంకటేష్ లాంటి స్టార్లను లాంచ్ చేసిన రాఘవేంద్రరావు కన్నా మంచి ఆప్షన్ కృష్ణగారికి కనిపించలేదు. దీంతో రాజకుమారుడు ఆయన చేతిలో పడ్డాడు. ప్రీతీ జింతా హీరోయిన్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.

పక్కా కమర్షియల్ అంశాలు, పవర్ ఫుల్ కృష్ణ క్యామియో, మణిశర్మ వినసొంపైన పాటలు, మహేష్ బాబు ఎనర్జీ, మాస్ క్లాస్ ని ఆకట్టుకునే కథా కథనాలు వెరసి రాజకుమారుడుని సూపర్ హిట్ దిశగా నడిపించాయి. శతదినోత్సవం జరుపుకోవడమే కాక రెండు నంది అవార్డులు కూడా దక్కాయి.

మహేష్ స్టామినా అర్థమైపోయి నిర్మాతలు క్యూ కట్టారు. కట్ చేస్తే ఈ పాతిక సంవత్సరాల ప్రయాణంలో చేసింది 28 సినిమాలే అయినప్పటికీ, రాజమౌళితో జట్టు కట్టేంత ప్యాన్ ఇండియా రేంజ్ కి చేరుకున్నప్పటికీ రాజకుమారుడు జ్ఞాపకాలు మాత్రం సూపర్ స్టార్ అభిమానులకు ఎప్పటికీ స్పెషల్ గా నిలిచిపోతాయి.