ప్రభాస్ వేగానికి ఈర్ష్య పడుతున్నారు

మాములుగా పోటీ హీరో వేగంగా హిట్లు కొడుతున్నప్పుడు ఇతర స్టార్లు ఈర్ష్య పడటం సహజం. ఇది అన్ని ఇండస్ట్రీలలోనూ ఉన్నదే. కానీ ప్రభాస్ విషయంలో మాత్రం అందరి అభిమానులు కుళ్ళుకుంటున్నారని చెప్పాలి. కారణం వేగంగా ప్యాన్ ఇండియా మూవీస్ ని పూర్తి చేయడమే కాక క్రమం తప్పకుండ వాటి రిలీజులు ఉండేలా చూసుకోవడంలో డార్లింగ్ చేసుకుంటున్న ప్లానింగ్ ఫ్యాన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రెండేళ్లకు ఒక సినిమా చేయడమే గగనంగా మారిపోతున్న ట్రెండ్ లో ఏడాదికి రెండు రిలీజులు చేస్తున్న ప్రభాస్ స్పీడ్ చూస్తుంటే ముచ్చట వేయక మానదు. ఇది ఒప్పుకోవాల్సిన నిజం.

కల్కి 2898 ఏడి విజయం ఇంకా పచ్చిగా ఉండగానే ది రాజా సాబ్ అప్డేట్స్ మొదలైపోయాయి. రేపు చిన్న గ్లిమ్స్ వదలబోతున్నారనే వార్త సోషల్ మీడియాని ఒక్కసారిగా ఊపేసింది. వెనుక వైపు నుంచి ప్రభాస్ లుక్ ని చూచాయగా రిలీజ్ చేశారు. విడుదల తేదీ ఇంకా ఖరారు కాకపోయినా ఇంత ముందుగా ప్రమోషన్ మొదలుపెట్టడంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనుసరిస్తున్న స్ట్రాటజీ ఇతర నిర్మాణ సంస్థలను ఆశ్చర్యానికి గురి చేసింది. బిజినెస్ కోసం ఇప్పటికే ఆఫర్ల ఒత్తిడి విపరీతంగా ఉన్న కారణంగా గరిష్టంగా ఎవరు సిద్దపడతారనేది తేలాలంటే ముందు అంచనాలు పెంచాలి.

ది రాజా సాబ్ బృందం చేస్తోంది ఇదే. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమా సంక్రాంతికి రావడం లేదు. 2025 మార్చి లేదా ఏప్రిల్ లో ఒక మంచి డేట్ సెట్ చేసుకునే పనిలో ఉన్నారు. ఇదే బ్యానర్ నుంచి తేజ సజ్జ మిరాయ్ వస్తున్న నేపథ్యంలో దానికి కనీసం మూడు నాలుగు వారాల గ్యాప్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ది రాజా సాబ్ కాకముందే ప్రభాస్ హను రాఘవపూడి ఫౌజీ సెట్లో అడుగు పెడతాడు. ఆగస్ట్ 15 ఓపెనింగ్ ఉండొచ్చని తెలిసింది. ఇంకోవైపు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, ప్రశాంత్ నీల్ సలార్ 2 శౌర్యంగపర్వం, నాగ్ అశ్విన్ కల్కి 2 స్క్రిప్టులు ఎప్పుడు సిద్ధం చేస్తే అప్పుడు అవీ కార్యరూపం దాలుస్తాయి.