ఆందోళన నిజమైంది. ప్రార్థనలు ఫలించలేదు. కోట్లాది మంది అభిమానుల ఆశలు కూలిపోయాయి. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు. కోలుకున్నారు.. మాట్లాడుతున్నారు.. తింటున్నారు.. కూర్చుంటున్నారు.. వ్యాయామాలు చేస్తున్నారు అంటూ గత నెల రోజులుగా వస్తున్న శుభవార్తలన్నింటికీ ఒక్క రోజులో తెరపడింది. ఉన్నట్లుండి తిరగబడ్డ బాలు ఆరోగ్యం ఉన్నట్లుండి విషమించింది. ఆయన అవయవాలు పని చేయడం మానేశాయి. లైఫ్ సపోర్ట్ మీదికి వెళ్లిపోయారు. నిన్న రాత్రి బాలును చూసి బయటికి వచ్చిన కమల్ హాసన్ ముఖంలో విషాదం చూస్తేనే అర్థమైపోయింది. బాలు పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆయన కోలుకోవడంపై ఇక ఆశలు లేవని.
ఇక అప్పట్నుంచి ఎప్పుడెప్పుడు దుర్వార్త వినాల్సి వస్తుందో అని అభిమానులు తీవ్ర ఆందోళనతో ఎదురు చూశారు. చివరికి ఆ చేదు వార్త బయటికి వచ్చేసింది. బాలు ఇక లేరు. 2020 సెప్టెంబరు 25 మధ్యాహ్నం 1.04 గంటలకు 74 ఏళ్ల వయసులో బాలు పరమపదించారు. ఆగస్టు 5న కరోనాతో ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరగా.. 40 రోజుల పాటు అనారోగ్యంతో పోరాడి ఓడిపోయారు. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. ఆ వైరస్ అవయవాలపై చూపించిన ప్రభావం నుంచి బాలు కోలుకోలేకపోయారు.
తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ లాంటి అనేక భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన అనితర సాధ్యుడైన గాయకుడు బాలు. ప్రపంచంలో ఫీచర్ ఫిలిం సింగర్ ఎవరూ ఇన్ని పాటలు పాడలేదని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఐతే మొక్కుబడిగా పాడేయడం కాదు. ప్రతి పాటలోనూ శ్రావ్యత, ఆర్ద్రతతో తనదైన ముద్ర వేయడం బాలు ప్రత్యేకత. దక్షిణాదిన ఆయన కొన్ని దశాబ్దాల పాటు నంబర్ వన్ సింగర్‌గా ఏకఛత్రాధిపత్యం చలాయించారు.
ఒక దశలో హిందీలో సైతం ఆయన ‘నంబర్ వన్ సింగర్’ కిరీటాన్ని ధరించారంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి హవా బాలుకు మాత్రమే సాధ్యం. ఏ హీరోకు పాట పాడినా.. ఆ హీరోనే పాడుతున్నట్లు చేయగలగడం బాలుకే సాధ్యమైన విద్య. అలాగని అందులో ఎంతమాత్రం శ్రావ్యతకు లోటుండదు. బాలు లాంటి గాయకుడు ఒకే ఒక్కడు. ఆయనకు లేరెవరూ పోటీ. రారెవరూ సాటి.
Gulte Telugu Telugu Political and Movie News Updates