సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్ డాల్స్‌గానే కనిపిస్తుంటారు. తమ పాత్రలకు ప్రాధాన్యం ఉన్నపుడు వాటికి తమ నటనతో న్యాయం చేయడం.. అలాగే పాటల్లో అందచందాలతో సినిమాకు ఆకర్షణ తీసుకురావడం.. ప్రమోషన్ పరంగా వీలైనంత సాయం చేయడం.. ఇలా ఉంటుంది హీరోయిన్ల వ్యవహారం.
సినిమాలు సక్సెస్ కావడంలో హీరోయిన్లకు వారి పరిధిని అనుసరించి క్రెడిట్ ఇవ్వాలి కానీ.. ఫెయిల్యూర్ క్రెడిట్ వారి ఖాతాలో వేయడం మాత్రం అన్యాయమనే చెప్పాలి. హీరోయిన్ల వల్ల సినిమాలు చెడిపోయే సందర్భాలు అరుదుగా ఉంటాయి. కానీ ఒక హీరోయిన్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే.. తన మీద ఐరెన్ లెగ్ ముద్ర వేసేయడం సోషల్ మీడియాలో కామన్ ప్రాక్టీస్ అయిపోయింది.
గతంలో శ్రుతి హాసన్ కెరీర్ ఆరంభంలో నటించిన చిత్రాలు కొన్ని ఫెయిలయ్యాయని ఆమెను ఐరెన్ లెగ్ అనేశారు. కానీ తర్వాత ఆమె వరుస సక్సెస్‌లతో ఎలా దూసుకెళ్తిందో, ఎంత పెద్ద హీరోయిన్ అయిందో తెలిసిందే. వర్తమానంలో భాగ్యశ్రీ బోర్సే మీద కొందరు నెగెటివ్ ముద్ర వేయాలని చూస్తున్నారు. వరుసగా నాలుగు ఫ్లాపులిచ్చింది అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
గత ఏడాది తెలుగులో తన తొలి చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్ అయింది. కానీ విడుదలకు ముందే ప్రోమోల్లో అందచందాలతో కుర్రాళ్ల దృష్టిని బాగా ఆకర్షించింది భాగ్యశ్రీ. ఆమె పేరు ఇండస్ట్రీలో మార్మోగడంతో అవకాశాలు వరుస కట్టాయి. కింగ్డమ్, కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా, లెనిన్.. ఇలా వరుసగా బోలెడు ఛాన్సులు వచ్చాయి. కానీ వీటిలో ఇంకో మూడు సినిమాలు రిలీజయ్యాయి. అవేవీ ఆశాజనకమైన ఫలితాలు అందుకోలేదు.
ఐతే మిస్టర్ బచ్చన్, కింగ్డమ్ సినిమాలను పక్కన పెడితే.. కాంత, ఆంధ్ర కింగ్ తాలూకాలో భాగ్యశ్రీ అన్ని విధాలా మెప్పించింది. తన అందంతో ఆకట్టుకోవడమే కాదు.. నటనతోనూ మెప్పించింది. ఆమెను జస్ట్ గ్లామర్ డాల్ అనడానికి లేదు. తన ప్రతి సినిమా ప్రమోషన్ కోసం ఆమె ఎంతో కష్టపడిందన్నది వాస్తవం. ముఖ్యంగా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కోసం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యుఎస్‌కు వెళ్లి మరీ ప్రమోట్ చేసింది.
ఇంత డెడికేషన్ హీరోయిన్లలో అరుదుగా కనిపిస్తుంటుంది. అందం, అభినయం రెండూ ఉన్నాయి. తన పాత్రలకు న్యాయం చేస్తోంది. ప్రమోషన్ల పరంగానూ కష్టపడుతోంది. ఇలాంటి హీరోయిన్ల మీద ఐరెన్ లెగ్ ముద్ర వేసి నెగెటివ్ ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదని సోషల్ మీడియా జనాలు గుర్తిస్తే మంచిది.
Gulte Telugu Telugu Political and Movie News Updates