‘క’ బిజినెస్సు ‘దిల్ రుబా’కు ప్లస్సు

సమయానుకూలంగా వ్యవహరిస్తేనే ఇండస్ట్రీలో మనుగడ సాధ్యమనే సత్యం అందరికీ తెలిసిందే. దాన్ని సరిగ్గా పాటించే వాళ్లే తక్కువ. రెండు వరస డిజాస్టర్ల తర్వాత యూత్ హీరో కిరణ్ అబ్బవరం మార్కెట్ రిస్క్ లో పడిన మాట వాస్తవం. దీనికి తోడు సోషల్ మీడియా ట్రోలింగ్ ఇమేజ్ మీద కొంత మరక పడేలా చేసింది. వేగంగా సినిమాలు చేయడమే తప్పించి క్వాలిటీ చూసుకోవడం లేదన్న కామెంట్లు బలంగా వినిపించాయి. అందుకే నిర్మాణంలో ఉన్న వాటి రిలీజుల విషయంలో కిరణ్ తీసుకున్న నిర్ణయాలు తెలివైన ఫలితాలు అందిస్తున్నాయనడానికి ఇదే ఉదాహరణ.

విడుదలకు సిద్ధంగా ఉన్న కిరణ్ అబ్బవరం సినిమాల్లో ముందుగా షూటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకోవడానికి అవకాశమున్నది దిల్ రుబా. కానీ ఇది లవ్ ఎంటర్ టైనర్. ఒకవేళ సినిమా ఎంత బాగున్నా ఓపెనింగ్స్ రాకపోతే వసూళ్ళ పరంగా ఇబ్బందవుతుంది. కానీ ‘క’ అలా కాదు. పీరియాడిక్ థ్రిల్లర్. మంచి స్కోప్ ఉన్న కంటెంట్. దశాబ్దాల వెనుక ఒక పోస్ట్ మ్యాన్ జీవితంలో ఒక గ్రామంలో జరిగిన అనూహ్య సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసుకున్నారు. అందుకే తానే నిర్మాతగా మారి బడ్జెట్ రిస్క్ అవుతున్నా సరే ఖర్చు పెట్టి మరీ ఒక కొత్త ప్రయోగం చేశాడు.

కట్ చేస్తే టీజర్ వచ్చాక ‘క’ మీద అంచనాలు పెరిగిపోయాయి. థియేట్రికల్ హక్కులు 12 కోట్లకు అమ్ముడుపోయిన వార్త డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే కిరణ్ మీద ఇంత మొత్తం అంత సులభంగా పెట్టలేరు. కానీ క టీజర్ వల్ల ఇదేదో విరూపాక్ష రేంజ్ లో ఆడే బొమ్మనే నమ్మకం బయ్యర్లలో వచ్చేసింది. ఎంతవరకు నిజమో నిర్ధారణ కావాల్సి ఉంది కానీ నాన్ థియేట్రికల్ నుంచి మరో 18 కోట్లు వచ్చాయనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. ఈ ప్యాన్ ఇండియా మూవీ కనక హిట్ అయితే దిల్ రుబాకు ప్రీ రిలీజ్ బిజినెస్ నుంచే రెట్టింపు లాభాలు అందుకునే ఛాన్స్ ఉంటుంది. చూద్దాం.